KKR vs SRH : గత సీజన్లలో దారుణమైన ఆట ఆడింది. అసలు ఎందుకురా నాయనా ఆడుతున్నారని.. అభిమానుల నుంచి చీత్కరింపులు.. మాజీ ఆటగాళ్ల నుంచి విమర్శలు.. ఇలాంటి తరుణంలో ఈసారి గట్టిగా కొట్టేందుకు బరిలోకి దిగింది హైదరాబాద్ జట్టు.. ఎటువంటి అంచనాలు లేని చోట.. ఆ జట్టు బలంగా నిలబడింది. కసికొద్ది ఆడింది. ఐపీఎల్ చరిత్రను తిరగరాసింది. ఓటమి ఎదురైనప్పుడు కుంగి పోలేదు. విజయం దక్కినప్పుడు విర్రవీగలేదు. ఫలితంగా ఆ జట్టు నిలకడైన ఆట తీరు ప్రదర్శిస్తూ ప్లే ఆఫ్ వెళ్ళింది. చివరికి అదృష్టం కూడా తోడు కావడంతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్ లో భాగంగా సోమవారం గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా కోల్ కతా జట్టు తో తలపడనుంది.
వాస్తవానికి ఈసారి హైదరాబాద్ జట్టులో మేనేజ్మెంట్ సమూల మార్పులు చేసింది. కొత్త కెప్టెన్ ను నియమించింది. ఆటగాళ్లను తీసుకుంది. సమష్టి నిర్ణయాలు తీసుకొని.. వాటిని అమలులో పెట్టడం ప్రారంభించింది. అవి సత్ఫలితాలను ఇవ్వడం మొదలుపెట్టాయి. ఫలితంగా హైదరాబాద్ జట్టు ఐపీఎల్లో 287/3, 277/3 పరుగులు నమోదు చేసింది. కీలకమైన ప్లే ఆఫ్ వెళ్లిన నేపథ్యంలో హైదరాబాద్ ఆటగాళ్లు ఇదే స్థాయిలో ప్రదర్శన చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. అహ్మదాబాద్ మైదానం కూడా అలాంటి సూపర్ ఫాస్ట్ బ్యాటింగ్ కు స్వర్గధామం లాంటిది..
హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ, హెడ్ సిక్సర పిడుగులుగా మారారు. ప్రత్యర్థి బౌలర్ల పై వీర విహారం చేస్తున్నారు. భువనేశ్వర్ కుమార్, నటరాజన్, కమిన్స్ నిధానమైన బంతులు వేస్తూ.. అప్పుడప్పుడు యార్కర్లు సంధిస్తూ.. ప్రత్యర్థి బ్యాటర్ల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. నితీష్ రెడ్డి, క్లాసెన్, మార్క్రం, అబ్దుల్ సమద్ అటువంటివారు కూడా ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే ఇన్ని సానుకూలతలు ఉన్న హైదరాబాద్ జట్టుకు.. నాణ్యమైన స్పిన్నర్లు లేకపోవడం ప్రధానమైన వెలితి. నితీష్ రెడ్డి వంటి వారు బౌలింగ్ వేస్తున్నప్పటికీ ధారాళంగా పరుగులు ఇస్తున్నారు.
మరోవైపు కోల్ కతా జట్టు ఇదే విధమైన ఆటతీరుతో అదరగొడుతోంది. గౌతమ్ గంభీర్ మెంటార్ గా వచ్చిన తర్వాత ఆ జట్టు ఆట తీరు పూర్తిగా మారిపోయింది. అయ్యర్ నాయకత్వంలో జోరు చూపుతున్న నేపథ్యంలో కోల్ కతా జట్టుకు అడ్డే లేకుండా పోయింది.. రైడర్స్ జట్టులో నరైన్, సాల్ట్.. భయం అనేది లేకుండానే బ్యాటింగ్ చేస్తున్నారు. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. అండ్రీ రస్సెల్ బీభత్సంగా బ్యాటింగ్ చేస్తున్నాడు.. ఇతడికి రింకూ సింగ్ జతయితే.. అగ్నికి ఆజ్యం తోడైనట్టే.. అయితే కోల్ కతా జట్టు పేస్ బౌలింగ్ అంతగా బలంగా లేదు. శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ పెద్దగా ఫామ్ లో లేడు. ఇది కోల్ కతా కు పెద్ద మైనస్ పాయింట్.
ఇక ఐపీఎల్ చరిత్రలో హైదరాబాద్, కోల్ కతా 26 సార్లు తలపడ్డాయి. ఇందులో కోల్ కతా 17 సార్లు విజయం సాధించింది. హైదరాబాద్ ఏడుసార్లు మాత్రమే గెలుపొందింది.. ఈ లెక్కల ప్రకారం కోల్ కతా దే హైదరాబాద్ పై పై చేయిగా ఉంది. ఇక ఈ సీజన్లో కోల్ కతా సొంత గడ్డపై జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఓడిపోయింది. అది కూడా నాలుగు పరుగుల తేడాతోనే. ఆ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ లేడు. ఇక అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఓటమిపాలైంది. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నప్పటికీ.. హైదరాబాద్ 162 పరుగులకే పరిమితమై, ఓడిపోయింది.
అహ్మదాబాద్ మైదానం అటు పేస్, ఇటు బౌన్స్ కు అనుకూలిస్తుంది. పిచ్ క్యూరేటర్ల అభిప్రాయం ప్రకారం భారీ స్కోరు నమోదు కాకపోవచ్చు. ముందుగా బ్యాటింగ్ చేసే జట్టుకు ఎక్కువగా విజయావకాశాలు లభిస్తాయి. ఇక ఇటీవల ఈ మైదానంలో కోల్ కతా, గుజరాత్ జట్లు తలపడాల్సి ఉండగా.. మ్యాచ్ వల్ల అది రద్దయింది. అయితే సోమవారం ఈ ప్రాంతంలో వర్షం కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.