T20 World Cup 2024 : దేశవ్యాప్తంగా ఐపీఎల్ మేనియా ఇంకా తగ్గలేదు. లీగ్ సమరం ముగిసింది. రేపటి నుంచి ప్లే ఆఫ్ పోరు ప్రారంభం కానుంది. హైదరాబాద్, కోల్ కతా, బెంగళూరు, రాజస్థాన్ ప్లే ఆఫ్ కు వెళ్లిపోయాయి. మొదటి రెండు స్థానాలలో నిలిచిన కోల్ కతా, హైదరాబాద్ జట్ల మధ్య రేపు ప్లే ఆఫ్ మ్యాచ్ జరగనుంది.. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఇందుకు వేదిక కానుంది.. మే 22న రాజస్థాన్, బెంగళూరు ఎలిమినేటర్ మ్యాచ్ లో తలపడతాయి. ఇది ఇలా ఉండగానే టీ -20 వరల్డ్ కప్ కు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ అభిమానులకు ఆసక్తిని కలగజేస్తోంది. జూన్ రెండు నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా t20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇప్పటికే రోహిత్ ఆధ్వర్యంలో టీం ను బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ టోర్నీ ప్రారంభం కాకముందే టీమిండియా కు చేదు గుళిక తగిలింది.
టి20 వరల్డ్ కప్ లో భాగంగా జూన్ 1న టీమిండియా బంగ్లాదేశ్ జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కంటే కొద్దిరోజుల ముందే రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యా, బుమ్రా అమెరికా వెళ్ళనున్నారు. అయితే సంజు సాంసన్, యశస్వి జైస్వాల్, యజువేంద్ర చాహల్, విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్ వంటి వారు వార్మప్ మ్యాచ్ కు దూరం కానున్నారు. టీమిండియా జూన్ 5 న టోర్నీలో మొదటి మ్యాచ్ ఐర్లాండ్ జట్టుతో ఆడుతుంది. అంతకుముందు బంగ్లాదేశ్ జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. టి20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలలో రాణించాలంటే ఆటగాళ్లకు వార్మప్ మ్యాచ్ లు ఎంతో ఉపకరిస్తాయి. అయితే ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ లు ఆడే ఆటగాళ్లకు ఆ అవకాశం లేదు.
టి20 వరల్డ్ కప్ ఆడేందుకు మే 25న అర్ధరాత్రి మన దేశానికి చెందిన ఆటగాళ్ల బృందం అమెరికా చేరుకుంటుంది. లీగ్ దశలో బయటికి వచ్చిన ముంబై ఆటగాళ్లు రోహిత్ శర్మ, బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ మొదటి బ్యాచ్ లో వెళ్తారు. రెండో బ్యాచ్ లో ఆటగాళ్లు మే 28న అమెరికా చేరుకుంటారు.. అయితే ఐపీఎల్ ఫైనల్ లో ఆడి, రెండవ బ్యాచ్లో అమెరికా వెళ్లే ఆటగాళ్లకు వార్మప్ మ్యాచ్ ఆడే అవకాశం లేదు. వారికి ఎంతోకొంత విశ్రాంతి లభించే అవకాశం ఉంది.
ఇక ఈ ఐపిఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ జట్టు అనూహ్యంగా ప్లే ఆఫ్ వెళ్ళింది. మే 22న ఈ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. అందులో గెలిస్తే బెంగళూరు మే 24న క్వాలిఫైయర్ -2 మ్యాచ్ ఆడుతుంది. ఈ ప్రకారం బెంగళూరు జట్టులో కీలక ఆటగాళ్లయిన విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్ ఐపీఎల్ లో ఇంకా కొద్దిరోజులు క్రికెట్ ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ బెంగళూరు ఫైనల్ వెళ్తే విరాట్ కోహ్లీ, సిరాజ్ మే 27 అర్ధరాత్రి అమెరికా బయలుదేరి వెళ్తారు. ఒకవేళ బెంగళూరు ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోతే టి20 ప్రపంచ కప్ కోసం మే 25న అమెరికా వెళ్లే మొదటి విమానంలో రోహిత్, సూర్య కుమార్ యాదవ్, బుమ్రా, రాహుల్ ద్రావిడ్ తో పాటు విరాట్ కోహ్లీ, సిరాజ్ ప్రయాణిస్తారు..
ఒకవేళ విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్ మే 29న అమెరికా వెళ్తే.. వార్మప్ మ్యాచ్ కు ముందు వారికి రెండు రోజులపాటు విశ్రాంతి లభిస్తుంది. టి20 ప్రపంచ కప్ లో జూన్ 5న ఐర్లాండ్ జట్టుతో ఆడే మ్యాచ్ కు ముందు టీమిండియా మేనేజ్మెంట్ ఇద్దరి ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే భారత్, న్యూయార్క్ కు కాలమానంలో 9.50 గంటల వ్యత్యాసం ఉంటుంది. అలాంటప్పుడు అక్కడి పరిస్థితులకు ఆటగాళ్లు అలవాటు పడటం ఒకింత కష్టమే.
ఇక రాజస్థాన్ జట్టు ఐపిఎల్ ఫైనల్ చేరుకుంటే సంజు, యజువేంద్ర చాహల్, యశస్వి జైస్వాల్ కూడా వార్మప్ మ్యాచ్ ఆడే అవకాశం ఉండదు. మే 22న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్, బెంగళూరు తలపడతాయి. ఈ మ్యాచ్లో విజేతను బట్టి యూఎస్ వెళ్లే బ్యాచ్ లో ఆటగాళ్లు మారతారు. అయితే టి20 వరల్డ్ కప్ లో ముంబై ఆటగాళ్లకు వీలైనంత ఎక్కువ సమయం విశ్రాంతి లభిస్తుంది. అమెరికా వెళ్లడానికి ముందు సూర్య కుమార్ యాదవ్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, బుమ్రా కు వారం పాటు రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది.