KKR vs SRH : సిక్సర పిడుగులనుకుంటే.. స్టార్క్ కు తలవంచి.. గుండు సున్నాలు చుట్టారు.. సన్ రైజర్స్ ఆశలు గల్లంతు..

తొలి ఓవర్ మిచెల్ స్టార్క్ వేశాడు. అతడు వేసిన రెండవ బంతికే ప్రమాదకరమైన ట్రావిస్ హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. దీంతో పరుగుల ఖాతా ప్రారంభించకుండానే హైదరాబాదు తొలి వికెట్ కోల్పోయింది. దీంతో మైదానం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది

Written By: Anabothula Bhaskar, Updated On : May 21, 2024 8:34 pm

KKR vs SRH

Follow us on

KKR vs SRH : ఐపీఎల్ లో ప్లే ఆఫ్ సమరం మొదలైంది. అహ్మదాబాద్ వేదికగా కోల్ కతా, హైదరాబాద్ జట్లు తల పడుతున్నాయి. వాతావరణం పొడిగా ఉండడంతో మ్యాచ్ నిర్వహణకు ఎటువంటి ఆటంకాలూ ఎదురు కాలేదు. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమిన్స్ మరో మాటకు తావు లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే అతని అంచనా తప్పని కోల్ కతా బౌలర్లు నిరూపించారు.

తొలి ఓవర్ మిచెల్ స్టార్క్ వేశాడు. అతడు వేసిన రెండవ బంతికే ప్రమాదకరమైన ట్రావిస్ హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. దీంతో పరుగుల ఖాతా ప్రారంభించకుండానే హైదరాబాదు తొలి వికెట్ కోల్పోయింది. దీంతో మైదానం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. మొదటి బంతిని ఆఫ్ స్టంప్ అవతల వేసిన స్టార్క్.. ఆ తర్వాతి బంతిని కూడా అలానే వేశాడు.. అయితే దానిని హెడ్ తప్పుగా అంచనా వేయడంతో అది వెంటనే వికెట్లను గిరాటేసింది.. దీంతో హెడ్ నిరాశతో వెనుతిరిగాడు. అంతకుముందు పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్లో ఇలానే హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హెడ్ అవుట్ అయిన కొంతసేపటికే, హైదరాబాద్ జట్టు స్కోరు 13 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. ఎస్ ఆర్ హెచ్ ఆటగాడు, ప్రమాదకరమైన ఓపెనర్ అభిషేక్ శర్మ మూడు పరుగులు మాత్రమే చేసి వైభవ్ ఆరోరా బౌలింగ్లో రస్సెల్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన రాహుల్ త్రిపాఠి 24*, నితీష్ రెడ్డి (9) మెరుగ్గా ఆడే ప్రయత్నం చేశారు. అయితే నితిష్ రెడ్డిని కూడా స్టార్క్ బలిగొన్నాడు. స్టార్క్ వేసిన అద్భుతమైన బంతికి నితీష్ రెడ్డి రహమానుల్లాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన షాబాజ్ అహ్మద్ స్టార్క్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇతడు కూడా 0 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు..

అటు నితీష్ రెడ్డి, ఇటు షాబాజ్ అహ్మద్ ను వరుస బంతుల్లో స్టార్క్ వెనక్కి పంపించాడు. దీంతో హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది. మైదానం బౌన్స్ కు సహకరిస్తున్న నేపథ్యంలో కోల్ కతా బౌలర్ స్టార్క్ అద్భుతంగా బంతులు వేశాడు.. స్లో బౌలింగ్ వేస్తూ హైదరాబాద్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. దీంతో అతన్ని కాచుకోవడం హైదరాబాద్ బ్యాటర్లకు ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం రాహుల్ త్రిపాఠి, క్లాసెన్ 9* క్రీజ్ లో ఉన్నారు. ప్లే ఆఫ్ మ్యాచ్ లో హెడ్, అబ్దుల్ సమద్ క్లీన్ బౌల్డ్ కావడం, అభిషేక్ శర్మ ప్రభావం చూపించకపోవడంతో హైదరాబాద్ అభిమానులు డీలా పడిపోయారు. “ప్లే ఆఫ్ ముందు ఇలా ఆడుతున్నారేంటి.. సిక్సర పిడుగుల్లా చెలరేగుతారనుకుంటే.. స్టార్క్ ముందు ఇలా తలవంచుతున్నారేంటి” అని కామెంట్స్ చేస్తున్నారు.