IPL 2024 SRH Vs KKR: కెప్టెన్ మారినా సన్ రైజర్స్ కథ మారలేదు.. చివరి వరకూ వచ్చి ఓటమి

టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణయానికి తగ్గట్టుగానే హైదరాబాద్ బౌలర్లు 51 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టారు. దీంతో కోల్ కతా 150 లోపు ఆల్ అవుట్ అవుతుందని అందరు భావించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 24, 2024 8:38 am

IPL 2024 SRH Vs KKR

Follow us on

IPL 2024 SRH Vs KKR: కెప్టెన్ మారాడు. ఈసారి మొత్తం మార్చుతానని ప్రకటించాడు. జట్టు సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇక హైదరాబాద్ జట్టుకు అన్ని మంచి రోజులే అని అభిమానులు అనుకున్నారు. ఈసారి కప్ గెలుస్తుందని భావించారు. కానీ ఆరంభ మ్యాచ్ లోనే హైదరాబాద్ ఓడిపోయింది. 17వ సీజన్ ను ఓటమితో మొదలుపెట్టింది. శనివారం సాయంత్రం కోల్ కతా జట్టు తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ లో చివరి వరకు వచ్చి.. ఆఖరి క్షణంలో తడబడింది. ఫలితంగా నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది.

టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణయానికి తగ్గట్టుగానే హైదరాబాద్ బౌలర్లు 51 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టారు. దీంతో కోల్ కతా 150 లోపు ఆల్ అవుట్ అవుతుందని అందరు భావించారు. కానీ రమన్ దీప్ సింగ్ (35), సాల్ట్(54), రస్సెల్(64) పరుగులు చేయడంతో కోల్ కతా జట్టు. 20 ఓవర్లకు 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది. రింకు సింగ్, రస్సెల్ ఏడో వికెట్ కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హైదరాబాద్ భవనంలో నటరాజన్ 3 వికెట్లు పడగొట్టాడు. మయాంక్ మార్కండే రెండు వికెట్లు తీశాడు. కమిన్స్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

అనంతరం 209 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (32), అభిషేక్ శర్మ (32) మెరుగైన ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కు 60 పరుగులు జోడించారు. మయాంక్ అగర్వాల్ ను హర్షిత్ రానా అవుట్ చేశాడు. జట్టు స్కోరు 71 పరుగులకు చేరుకున్నప్పుడు అభిషేక్ శర్మ రస్సెల్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి (20) ధాటిగా ఆడే క్రమంలో అవుట్ అయ్యాడు. మార్క్రమ్(18) త్వరగానే పెవిలియన్ చేరాడు. ఈ దశలో వచ్చిన హెన్రిచ్ క్లాసెన్(63) ఆకాశమే చెలరేగిపోయాడు. ఏకంగా ఎనిమిది సిక్స్ లు బాదాడు. అబ్దుల్ సమద్ (15) తో ఐదో వికెట్ కు 34, షాబాజ్ అహ్మద్(16) తో కలిసి ఆరో వికెట్ కు 58 పరుగులు జోడించాడు. అయితే చివరి గెలుపుకు నాలుగు పరుగుల దూరంలో హర్షిత్ రానా బౌలింగ్లో క్లాసెన్ సూర్య శర్మ పట్టిన క్యాచ్ ద్వారా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మార్కో జాన్సన్ ఒక ఫోర్ కొట్టినా హైదరాబాద్ గెలిచేదే. కానీ అతడు సింగిల్ రన్ కే పరిమితం కావడంతో హైదరాబాద్ జట్టు నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది.

వాస్తవానికి రాహుల్ త్రిపాఠి అవుట్ అయిన తర్వాత.. సాధించాల్సిన రన్ రేట్ అమాంతం పెరిగిపోయింది. ఈ దశలో క్లాసెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్ లను నమ్ముకోకుండా కేవలం సిక్స్ లు మాత్రమే కొట్టాడు. ఫలితంగా హైదరాబాద్ జట్టు విజయం దిశగా ప్రయాణించింది. కానీ చివరి ఓవర్ హర్షిత్ రానా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. క్లాసెన్ వీరోచిత ఇన్నింగ్స్ వృధా అయ్యింది.