KKR Vs RCB
KKR Vs RCB: దరిద్రం, దురదృష్టం, ఖర్మ, గ్రహచారం.. ఇంకా ఎన్ని పేర్లు ఉంటే అన్ని.. అవన్నీ రాసినా సరిపోదు.. బ్యాడ్ లక్ ఆ స్థాయిలో బెంగళూరు జట్టు చుట్టూ పరిభ్రమిస్తోంది మరీ.. ఈ సీజన్లో వరుస పరాజయాలతో అపప్రదను మూట కట్టుకుంటున్న ఆ జట్టు.. ఆదివారం కోల్ కతా తో జరిగిన మ్యాచ్లో ఒక పరుగు తేడాతో ఓటమిపాలైంది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్లో బెంగళూరులో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో బెంగళూరు ఓడిపోయింది అని చెప్పే కంటే దురదృష్టం వెంటాడింది అనడం సబబు.
సొంత మైదానంలో కోల్ కతా ముందుగా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 222 రన్స్ చేసింది. ఫిల్ సాల్ట్(48), అండ్రీ రసెల్(27*) చెలరేగి ఆడారు. కెప్టెన్ అయ్యర్(50), రమణ్ దీప్ సింగ్ (24*) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో కోల్ కతా భారీ స్కోరు సాధించింది. బెంగళూరు బౌలర్లలో దయాళ్ 2/56, గ్రీన్ 2/35 వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్, ఫెర్గుసన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
చేజింగ్ కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 221 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. విల్ జాక్స్(55), పాటి దార్(52) అద్భుతంగా ఆడారు. దినేష్ కార్తీక్(24), కర్ణ శర్మ (20) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో బెంగళూరు ఆ స్థాయి స్కోర్ చేయగలిగింది. కోల్ కతా బౌలర్లలో రస్సెల్(3/25), సునీల్ నరైన్, హర్షిత్ రానా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ పడగొట్టారు.
223 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన బెంగళూరు జట్టుకు మొదట్లోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది.. ఓపెనర్ విరాట్ కోహ్లీ (18) అంపైర్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం వల్ల అవుట్ అయ్యాడు. వాస్తవానికి హర్షిత్ రానా వేసిన హై ఫుల్ టాస్ బంతికి విరాట్ కోహ్లీ క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. వాస్తవానికి ఆ బంతి నడుం కంటే తక్కువ ఎత్తులో వచ్చింది. అయినప్పటికీ థర్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. “కోహ్లీ క్రీజ్ బయట ఉండి ఆడాడు. బంతి డిప్ అయింది. అందువల్లే అది ఫెయిర్ డెలివరీ” అని థర్డ్ ఎంపైర్ వ్యాఖ్యానించాడు. దీంతో కోహ్లీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అతడు అవుట్ అయిన వెంటనే ఫాఫ్ డూ ప్లేసిస్ (7) ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేశాడు. దీంతో బెంగళూరు 35 రన్స్ కే రెండు వికెట్లు కోల్పోయింది. ఈక్రమంలో బెంగళూరు జట్టును విల్ జాక్స్, రజత్ పాటిదార్ ఆదుకున్నారు. ఇద్దరూ అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ప్రమాదకరంగా మారుతున్న వీరిద్దరినీ రసెల్ ఔట్ చేశాడు. దీంతో 102 రన్స్ భాగస్వామ్యం నమోదయిన మూడో వికెట్ డౌన్ అయింది.
ఈ దశలో వచ్చిన గ్రీన్(6) మరో సారి దారుణమైన ఆట తీరుతో నిరాశ పరిచాడు. అంపైర్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల లోమ్రోర్ (4) ఔట్ అయ్యాడు. వాస్తవానికి ఆ బంతిని సునీల్ నరైన్ నోబ్ గా వేశాడు. దానిని అంపైర్ గుర్తించలేదు. ఈ క్రమంలో దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభు దేశాయ్(24) హర్షిత్ రాణా బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. దినేష్ కార్తీక్ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో బెంగళూరు 200 స్కోర్ ను రీచ్ అయింది.
ధాటిగా ఆడుతున్న దినేష్ కార్తీక్ .. రస్సెల్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. చివరి ఓవర్ లో ఆర్ సీ బీ విజయానికి 21 రన్స్ అవసరమయ్యాయి. ఈ దశలో కర్ణ శర్మ మూడు సిక్స్ లు కొట్టాడు. దీంతో ఆర్సీబీ విజయానికి రెండు బాల్స్ లో మూడు రన్స్ అవసరమయ్యాయి. లాస్ట్ బాల్ కు టూడీ తీసే ప్రయత్నంలో పెర్గూసన్ ఔట్ అయ్యాడు. దీంతో ఆర్సీబీ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.