KKR vs PBKS : కోల్ కతా పై గెలిచిన ఆనందం ఆవిరి.. స్వదేశానికి పంజాబ్ కీలక ఆటగాడు

ఎందుకంటే పాయింట్ల పట్టికలో మొన్నటిదాకా మూడో స్థానంలో కొనసాగిన చెన్నై జట్టు, ప్రస్తుతం ఐదవ స్థానానికి దిగజారింది. ప్లే ఆఫ్ వెళ్లాలంటే చెన్నై జట్టు కచ్చితంగా ఆ మ్యాచ్ లో గెలవాలి.

Written By: NARESH, Updated On : April 27, 2024 8:06 pm

punjab_kings

Follow us on

KKR vs PBKS : శుక్రవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా జట్టు తో జరిగిన మ్యాచ్లో 261 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి.. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన పంజాబ్ జట్టుకు.. ఆ ఆనందం ఎంతోసేపు మిగిలినట్లు కనిపించడం లేదు. ప్లే ఆఫ్ వెళ్ళాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో.. అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేసి 8 వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. ఈ గెలుపుతో పంజాబ్ జట్టు మంచి హుషారు మీద ఉంది. ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్, జింబాబ్వే కు చెందిన ఆటగాడు సికిందర్ రాజా స్వదేశానికి వెళ్ళిపోయాడు. దీంతో పంజాబ్ జట్టు ఆడే మిగతా మ్యాచ్ లలో అతడు ఉండడు.

మే 3 నుంచి 12 వరకు జింబాబ్వే బంగ్లాదేశ్ జట్టుతో ఐదు మ్యాచ్ ల టీ – 20 సిరీస్ ఆడనుంది. జింబాబ్వే జట్టుకు సికిందర్ రాజా సారథ్యం వహించనున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ను వీడేందుకు సికిందర్ నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే అతడు జింబాబ్వే బయలుదేరి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు మిగతా మ్యాచ్లలో అతడు అందుబాటులో ఉండడు. ప్లే ఆఫ్ కు చేరుకోవాలంటే పంజాబ్ జట్టు మిగతా అన్ని మ్యాచ్లను కచ్చితంగా గెలవాలి. గెలుపు మాత్రమే కాదు, భారీ రన్ రేట్ సాధించాలి. ఈ క్రమంలో సికిందర్ రాజా స్వ దేశానికి వెళ్లిపోవడం పంజాబ్ జట్టుకు ఎదురు దెబ్బేనని క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక ఈ సీజన్లో పంజాబ్ జట్టు తరఫున సికిందర్ రాజా కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. మ్యాచ్లలో అతడు 43 పరుగులు చేశాడు. పెద్దగా అవకాశాలు రాకపోవడంతో అతడు రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. ఇక గత సీజన్ లో ఏడు మ్యాచ్లు ఆడిన అతడు 139 రన్స్ చేశాడు. మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఇక ఈ సీజన్లో పంజాబ్ జట్టు ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడింది. కేవలం మూడు మ్యాచ్ లలో మాత్రమే గెలిచింది. 6 పాయింట్లతో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ జట్టు తన తదుపరి మ్యాచ్ మే 1న చేపాక్ స్టేడియం వేదికగా చెన్నై జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకూ అత్యంత కీలకం. ఎందుకంటే పాయింట్ల పట్టికలో మొన్నటిదాకా మూడో స్థానంలో కొనసాగిన చెన్నై జట్టు, ప్రస్తుతం ఐదవ స్థానానికి దిగజారింది. ప్లే ఆఫ్ వెళ్లాలంటే చెన్నై జట్టు కచ్చితంగా ఆ మ్యాచ్ లో గెలవాలి.