KKR Vs SRH: శనివారం నాటి కోల్ కతా – హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ మ్యాచ్లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ షారుక్ ఖాన్ సిగరెట్ తాగిన వీడియోలు మీడియా, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దాన్ని మర్చిపోకముందే మరో వివాదం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కోల్ కతా జట్టులోని ఓ ఆటగాడు మైదానంలో ఇచ్చిన ముద్దు కలకలం రేపుతోంది.. దీనిపై బీసీసీఐ స్పందించడం..ఆ ఆటగాడిపై చర్యలు తీసుకోవడం.. వెంట వెంటనే జరిగిపోయాయి.
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా కోల్ కతా, హైదరాబాద్ జట్లు తమ తొలి మ్యాచ్ ను కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్ మైదానంలో ఆడాయి. ఈ మ్యాచ్ లో కోల్ కతా జట్టు విజయం సాధించింది..కోల్ కతా యువ బౌలర్ హర్షిత్ రానా చివరి ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. హైదరాబాద్ జట్టుకు 13 పరుగులు అవసరమైనచోట కేవలం 8 రన్స్ మాత్రమే ఇచ్చి కోల్ కతా ను గెలిపించాడు. ప్రమాదకరమైన క్లాసెన్, షహబాజ్ వికెట్లను పడగొట్టాడు. వీరిని మాత్రమే కాదు హైదరాబాద్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (32) ను కూడా పెవిలియన్ పంపించాడు.
మయాంక్ అగర్వాల్ అవుట్ అయిన అనంతరం అతడు పెవిలియన్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో రానా ఓవర్ యాక్షన్ చేశాడు. నేరుగా మయాంక్ అగర్వాల్ కు గాలిలో ముద్దు(ఫ్లయింగ్ కిస్) విసిరి.. వీడ్కోలు పలికాడు. క్లాసెన్ ను ఔట్ చేసినప్పుడు కూడా అతడు ఇలాగే ప్రవర్తించాడు. వాస్తవానికి మైదానంలో అనుచితంగా ప్రవర్తిస్తే ఆటగాళ్లపై.. ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు కఠిన చర్యలు తీసుకుంటుంది.
రానా పై కోడ్ ఆఫ్ కండక్ట్ నియమావళి ప్రకారం ఐపీఎల్ చర్యలు తీసుకుంది. అతడికి భారీ జరిమానా విధించింది. ఈ మేరకు నిర్వాహకులు కీలక ప్రకటన చేశారు. ” కోల్ కతా బౌలర్ హర్షిత్ రానా నియమాలను ఉల్లంఘించాడు. అందువల్ల అతడి మ్యాచ్ ఫీజులో 60% జరిమానా విధించాం. కోడ్ ఆఫ్ కండక్ట్ ను అతడు పాటించకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో రానా ఇష్టానుసారంగా వ్యవహరించాడు. ఐపీఎల్ నిబంధనలోని ఆర్టికల్ 2.5 లెవెల్ -1 నేరానికి పాల్పడ్డాడు. దీంతో మ్యాచ్ రిఫరీ సూచనల ప్రకారం 10 శాతం, 50 శాతం చొప్పున రెండు తప్పిదాలకు అతడి మ్యాచ్ ఫీజు నుంచి జరిమానాగా విధించాం. మ్యాచ్ రిఫరీ నిర్ణయాన్ని అమలు చేశామని” ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు.
మైదానంలో రానా వ్యవహరించిన తీరు సరికాదని టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ” రానా వ్యవహరించిన తీరు టికెట్ నిబంధనలకు విరుద్ధం. ఇలాంటి చిల్లర చేష్టలు ఆటలో సరికాదు. తన బౌలింగ్లో ఎవరైనా బ్యాటర్ ఇలాగే సిక్స్ కొట్టి గేలి చేస్తే ఎలా ఉంటుంది? దాన్ని అతడు స్వీకరించగలడా? అతని వయసుకు ఇంకా పరిపక్వత రాలేదు. అవుట్ అయినప్పుడు ఆటగాడు సంబరాలు జరుపుకోవడం సర్వసాధారణం. కానీ ఆ సంబరాలు సొంత జట్టుతో తీసుకుంటే బాగుంటుంది. ప్రత్యర్థి బ్యాటర్లపై ఇలాంటి చిల్లర చేష్టలకు పాల్పడితే భవిష్యత్తు అంధకారం అవుతుందని” గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
View this post on Instagram