Kho Kho World Cup 2025: భారత ఖోఖో చరిత్రలో సంచలనం నమోదైంది. భారత ఆటగాళ్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. నెవ్వర్ బిఫోర్ అనేలా.. గంటల వ్యవధిలోనే అటు మహిళల టీం.. ఇటు పురుషుల టీం ప్రపంచ ఛాంపియన్లు(World Champions)గా నిలిచాయి. రెండు వరల్డ్ కప్‌లను భారత ఖాతాలో వేశాయి. న్యూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో నేపాల్‌తో జరిగిన తుది పోరులు భారత్ 54–36 తేడాతో గెలిచి జగజ్జేతగా నిలిచింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరిన భారత పురుషుల జట్టు కూడా అదే జోరును కొనసాగించింది. ప్రత్యర్థి నేపాల్‌ను కట్టడి చేసి విశ్వ విజేతగా నిలిచింది.
తొలి వరల్డ్ కప్‌లోనే..
ఖోఖోను విశ్వవ్యాప్తం చేయడానికి భారత్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తొలిసారి ప్రపంచకకప్ పోటీలు నిర్వహిస్తోంది. మొదటిసారి నిర్వహించిన ఖోఖో వరల్డ్ కప్ పోటీల్లో మహిళలు, పురుషుల ఇద్దరూ ఛాంపియన్‌లుగా నిలవడం విశేషం. ముందు జరిగిన మహిళల ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఈ ప్రపంచకప్‌లో చెలరేగిపోయిన మహిళల జట్టు.. ఫైనల్‌లోనూ అదే దూకుడుతో చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం(జనవరి 19న) జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌పై 78–40 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచిన నేపాల్..
ఈ మ్యాచ్‌లో నేపాల్ టాస్ గెలిచింది. ముందుగా భారత్‌ను అటాక్‌కు రమ్మని ఆహ్వానిచింది. ఆతిథ్య భారత్‌కు ఇది వరంగా మారింది. నేపాల్‌కు శాపంగా మారింది. ఆది నుంచి రెచ్చిపోయిన భారత ఆటగాళ్లు నేపాల్‌ను వరుస విరామాల్లో ఒత్తిడిలోకి నెట్టారు. ఎక్కడా నేపాల్‌కు అవకాశం ఇవ్వకుండా ఆధిపత్యం ప్రదర్శించారు. ఆట ప్రారంభం నుంచి ముగిసే వరకూ ఒకేరకమైన ఆట తీరుతో నేపాల్‌ను ఓడించింది.
సాయంత్రం పురుషుల మ్యాచ్..
ఇక ఆదివారం సాయంత్రం ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో పురుషుల ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో కూడా భారత్ నేపాల్ తపలడ్డాయి. ఆది నుంచి భారత పురుషుల జట్టు ఆధిప్యం కనబర్చింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండానే విశ్వ విజేతగా నిలిచింది.