Kane Williamson: న్యూజిలాండ్ జట్టు కీలక ఆటగాడు కేన్ విలియంసన్ సెంట్రల్ కాంట్రాక్టు తిరస్కరించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. స్పోర్ట్స్ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేన్ విలియంసన్ వాటన్నింటికీ పుల్ స్టాప్ పెడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడు అన్న ఆ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టు లీగ్ దశలోనే ఇంటికి వచ్చింది. బలహీనమైన ఆఫ్ఘనిస్తాన్ జట్టు చేతిలో దారుణమైన ఓటమి ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు ఆటగాళ్ల ప్రదర్శన పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి . ఇదిలా ఉండగానే న్యూజిలాండ్ జట్టు కీలక ఆటగాడు కేన్ విలియంసన్ హఠాత్తుగా ఓ నిర్ణయం తీసుకున్నాడు. న్యూజిలాండ్ జట్టు సెంట్రల్ కాంట్రాక్ట్ కు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించాడు.. దీంతో అతనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడని, అతడు పూర్తిగా డబ్బు మనిషి లాగా మారిపోయాడని విమర్శలు వ్యక్తమయ్యాయి.. సెంట్రల్ కాంట్రాక్టుకు దూరం కావడంతో.. శ్రీలంక టూర్ కు అతడిని ఎంపిక చేయకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో న్యూజిలాండ్ జట్టు శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టి20 లు ఆడనుంది. భారత్ తో న్యూజిలాండ్ జట్టు ఆడే డబ్ల్యూటీసీ సిరీస్, పాకిస్తాన్ జట్టుతో వన్డే సిరీస్ లో అతడు ఆడతాడని తెలుస్తోంది.
2024 -25 సీజన్ కు సంబంధించి కేన్ విలియంసన్ సెంట్రల్ కాంట్రాక్టు తిరస్కరించాడు. అయితే జనవరిలో సౌత్ ఆఫ్రికా లో ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ పోటీలలో ఆడేందుకే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఇదే విషయాన్ని అతడు అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. న్యూజిలాండ్ లో విలేకరులతో ప్రస్తావించాడు. జనవరి నెలలో సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ లీగ్ తన గమ్యస్థానం గా ఉంటుందని కేన్ విలియంసన్ ధ్రువీకరించాడు. ఇదే సమయంలో తన కెరియర్ ముగింపు దశకు చేరుకుందని భావించడం లేదని కేన్ అన్నాడు. ” ఇది కేవలం ఒప్పందం ప్రకారం నేను తీసుకున్న నిర్ణయం మాత్రమే. ఇప్పటి నియమాల ప్రకారం నేను ఒకదానిని మాత్రమే కొనసాగించగలను. న్యూజిలాండ్ జట్టు కోసం ఆడే విషయంలో నేను కట్టుబడి ఉన్నాను. నాకు సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ లీగ్ అత్యంత ఉత్తేజితంగా కనిపిస్తోందని” విలియమ్సన్ పేర్కొన్నాడు.
న్యూజిలాండ్ జట్టులో సెంట్రల్ కాంట్రాక్టు కు అర్హత సాధించేందుకు ఆటగాళ్లు కచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలి. నిబంధనలను పాటించని ఆటగాళ్లను న్యూజిలాండ్ క్రికెట్ మేనేజ్మెంట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ పరిధిలోకి తీసుకోదు. అయితే కేన్ విలియం సన్ ముందుగానే తాను సెంట్రల్ కాంట్రాక్టులో ఉండనని తేల్చి చెప్పేశాడు. దీంతో అతనిపై న్యూజిలాండ్ క్రికెట్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.. మరోవైపు న్యూజిలాండ్ జట్టు సీఈవో స్కాట్ వినింక్, కేన్ విలియం సన్ 2028 లో టి20 వరల్డ్ కప్ ను న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లో నిర్వహించే విషయం పై చర్చించుకున్నారు. కానీ, ఇంతలోనే కేన్ సెంట్రల్ కాంట్రాక్టు కు దూరం గా ఉంటానని సంచలన నిర్ణయం తీసుకున్నాడు.