Nalanda University : 1600 సంవత్సరాల పురాతన విశ్వవిద్యాలయం.. దీని గురించి తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే?

Nalanda University ఇది కొరియా, జపాన్, చైనా, మంగోలియా, శ్రీలంక, టిబెట్, ఆగ్నేయాసియాతో సహా ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులను ఆకర్షించింది.

Written By: NARESH, Updated On : June 20, 2024 9:59 pm

Nalanda Univercity

Follow us on

Nalanda University : బిహార్ లోని రాజ్‌గిర్ లో 450 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ‘నలంద విశ్వవిద్యాలయం’ నూతన క్యాంపస్ ను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం (జూన్ 19) రోజున ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించే ‘నెట్ జీరో’ గ్రీన్ క్యాంపస్ ను ఏర్పాటు చేశారు. క్యాంపస్ లో 1900 మంది విద్యార్థులు చదువుకునేలా 40 తరగతి గదులు, 300 మంది విద్యార్థులు కూర్చునే సామర్థ్యంతో రెండు ఆడిటోరియంలు ఉన్నాయి.

నలంద యూనివర్సిటీ హాస్టల్ లో సుమారు 550 మంది విద్యార్థులు ఉండే సదుపాయాలు కల్పించారు. 2000 మంది విద్యార్థుల సామర్థ్యంతో యాంఫిథియేటర్, ఫెసిలిటీ క్లబ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కలిగి ఉంది. కొత్త క్యాంపస్ ప్రాముఖ్యత దాని అధునాతన మౌలిక సదుపాయాల్లో ఉంది. ఇది పురాతన విద్యా కేంద్రానికి ప్రతీక. విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులు, వివిధ దేశాల రాయబారులు విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

‘నలంద’ చరిత్ర
పురాతన రాజ్యం మగధ (ఆధునిక బిహార్)లో నలంద విశ్వవిద్యాలయం క్రీ.శ ఐదో శతాబ్దంలో స్థాపించారు. ఇది రాజగృహ నగరానికి (ప్రస్తుత – రాజ్గిర్), పాటలీపుత్ర (ప్రస్తుత – పాట్నా) సమీపంలో ఉంది. కొరియా, జపాన్, చైనా, మంగోలియా, శ్రీలంక, టిబెట్ తో పాటు ఆగ్నేయాసియాతో సహా ప్రపంచం నలుమూలల నుంచి పండితులు వచ్చి ఇక్కడ అభ్యసించారు, బోధించారు. అందుకే నలంద విశ్వవిద్యాలయం ప్రపంచంలోని మొదటి రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయంగా పరిగణించబడుతుంది.

ఈ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ప్రశంసలు దక్కించుకుంది. 8వ, 9వ శతాబ్ధాల్లో పాల రాజవంశం ఆధ్వర్యంలో అభివృద్ధి చెందింది. నలంద యూనివరసిటీలో బోధించే సబ్జెక్టులు ఆయుర్వేదం, వైద్యం, గణితం, వ్యాకరణం, బౌద్ధం, ఖగోళ శాస్త్రం, భారతీయ తత్వశాస్త్రం.

నలంద యూనివర్సిటీ ప్రభావం ఎక్కువగా గణితం, ఖగోళ శాస్త్రం, దాని అనుంబంధ రంగాల్లో చూడవచ్చు. భారతీయ గణిత శాస్త్రవేత్త, జీరో ఆవిష్కర్త ఆర్యభట్ట క్రీ.శ 6వ శతాబ్ధంలో నలంద విశ్వవిద్యాలయంలో గౌరవనీయ విద్యావేత్తల్లో ఒకరిగా ఉన్నారు.అయితే, విద్యార్థులు కఠినమైన ఇంటర్వ్యూలను ఎదుర్కోవాల్సి రావడంతో విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందడం అంత సులభం కాదు. ప్రవేశం పొందిన విద్యార్థులకు ధర్మపాల, శిలాభద్ర వంటి బౌద్ధ గురువుల మార్గదర్శకత్వంలో పండితుల బృందం మార్గనిర్ధేశం చేసేది. ఈ విశ్వవిద్యాలయం 9 మిలియన్ల చేతిరాత తాళపత్ర గ్రంథాలయాలకు నిలయంగా ఉంది. దాని గ్రంథాలయాన్ని ‘ధర్మ గంజ్’ లేదా ‘మౌంటేన్ ఆఫ్ ట్రూత్’ అని పిలుస్తారు, ఇది బౌద్ధ జ్ఞానం బాంఢాగారంగా విలసిల్లేది.

మరిన్ని విషయాలు
* క్రీ.శ 5వ శతాబ్ధంలో స్థాపించిన నలంద విశ్వవిద్యాలయం వివిధ విభాగాల్లో ప్రసిద్ధి చెందిన నైపుణ్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పండితులను ఆకర్షించింది.
* నలంద విశ్వవిద్యాలయం లైబ్రరీ, ‘ధర్మ గంజ్’ లేదా ‘మౌంటెన్ ఆఫ్ ట్రూత్’ లో అత్యంత పవిత్రమైన రాత ప్రతులతో పాటు 9 మిలియన్లకు పైగా పుస్తకాలు ఉన్నాయి. రత్నోదాది అనే తొమ్మిది అంతస్తుల భవనంలో వీటిని భద్రపరిచారు.
* ఇది 10,000 మందికి పైగా విద్యార్థులు, 2000 మందికి పైగా ఉపాధ్యాయులకు వసతి కల్పించిన ప్రపంచంలోని మొదటి రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం.
* ఇది బౌద్ధ అధ్యయనాలకు, ఖగోళశాస్త్రం, వైద్యం, తర్కంతో పాటు గణితం వంటి విషయాలకు ఒక ప్రధాన కేంద్రం.
* నలంద శిథిలాల్లో ఉన్న ఈ ప్రదేశం అపారమైన సంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ 2016లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.
* నలంద విశ్వ విద్యాలయాన్ని పునరుద్ధరించాలనే ఆలోచనను మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 2006లో ప్రతిపాదించారు.
* దాదాపు 800 సంవత్సరాల తరువాత 2014లో నలంద విశ్వవిద్యాలయం తిరిగి ప్రారంభమైంది. ఇది ప్రపంచంలోని పురాతన విద్యా కేంద్రాల చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. కొత్త ప్రాంగణం పురాతన జ్ఞానాన్ని ఆధునిక జ్ఞానంతో మిళితం చేస్తూ పురాతన విశ్వవిద్యాలయంను గుర్తుకు చేస్తుంది.
* పురాతన విజ్ఞానాన్ని సమకాలీన విజ్ఞానంతో మిళితం చేస్తూ ప్రపంచంలోని పురాతన విశ్వవిద్యాలయాల పునరుద్ధరణకు ఈ కొత్త క్యాంపస్ ప్రతీక.
* గణిత శాస్త్రవేత్త, సున్నా ఆవిష్కర్త ఆర్యభట్ట కూడా నలందలో అధ్యయనం చేసి బోధించాడని చరిత్ర చెప్తోంది.
* ఇది కొరియా, జపాన్, చైనా, మంగోలియా, శ్రీలంక, టిబెట్, ఆగ్నేయాసియాతో సహా ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులను ఆకర్షించింది.