Odi World Cup 2023: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడకు భారత క్రికెట్ నియంత్రణ మండలితో ఉన్న ఒప్పందం ముగియడానికి ఇంకా కొనిన్నాళ్లు మాత్రమే మిగిలి ఉంది. వన్డే వరల్డ్ కప్–2023 తర్వాత ఈ కర్ణాటక మాజీ క్రికెటర్ రెండేళ్ల కాంట్రాక్ట్ పూర్తికానుంది. ఈ నేపథ్యంలో తదుపరి ద్రవిడ్ హెడ్ కోచ్‌గా కొనసాగుతాడా? లేదంటే తన బాధ్యతల నుంచి తప్పుకొంటాడా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా ప్రదర్శనపైనే ద్రవిడ్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
రవిశాస్త్రి తర్వాత ద్రవిడ్..
టీ 20 వరల్డ్ కప్–2021లో భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన అనంతరం రవిశాస్త్రి హెడ్ కోచ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఈక్రమంలో చర్చల అనంతరం రాహుల్ ద్రావిడ్‌ను ఒప్పించిన నాటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. టీమిండియా హెడ్ కోచ్‌గా నియమించాడు.
ద్వైపాక్షిక సిరీస్‌లలో హిట్
2021, నవంబరు 3న బాధ్యతలు స్వీకరించిన ద్రవిడ్.. టీమిండియాకు వరుస విజయాలు సాధించాడు. కెప్టెన్ రోహిత్‌శర్మతో కలిసి పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్‌లు అందించాడు. అయితే, గతేడాది ఆసియా టీ20 కప్, 20 ప్రపంచకప్లో రోహిత్ సేన వైఫల్యం ద్రవిడ్‌కు మచ్చగా మారింది. కీలక టోర్నీల్లో టీమిండియా విఫలమవడం, ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్–2023 ఫైనల్లోనూ ఆస్ట్రేలియాపై టీమిండియా చిత్తుగా ఓడడంతో అటు కెప్టెన్.. ఇటు హెడ్ కోచ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రయోగాలతో జట్టుకు నష్టం కలిగిస్తున్నాడంటూ ద్రవిడను తొలగించాలనే డిమాండ్లు ముందుకు తెచ్చారు టీమిండియా అభిమానులు.
ఈసారి సొంతగడ్డపై వరల్డ్ కప్..
వచ్చే నెల నుంచి వన్డే వరల్డ్ కప్ భారత్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్ రూపంలో తనను తాను ముఖ్యంగా సొంతగడ్డపై నిరూపించుకునే అవకాశం ద్రవిడ్ ముంగిట నిలిచింది. తేడా జరిగి అనుకున్న ఫలితం రాకపోతే.. ద్రవిడ్‌పై మరోసారి విమర్శలు తప్పవు. అయితే, ఈ క్రమంలో బీసీసీఐ ఆఫీస్ బేరర్ ఒకరు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ‘ఒకవేళ భారత్ పునరుద్ధరించుకోకపోవచ్చు. ఎందుకంటే ప్రపంచకప్ గెలిచినా ద్రవిడ్ తన కాంట్రాక్ట్‌ను ఉన్నతస్థితిలో ఉన్నపుడే వైదొలగాలనుకోవడం సహజం’ అని పేర్కొన్నాడు.
ఒక్కో ఫార్మాట్ కు ఒక్కో కోచ్
వరల్డ్ కప్ తర్వాత బీసీసీఐ కోచ్‌ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్‌ను నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ప్రతిపాదన కూడా ఎప్పటి నుంచో ఉంది. ఇది అమలు చేస్తే.. రాహుల్ ద్రవిడ్‌ను టెస్టు జట్టు కోచ్‌గా కొనసాగించే అవకాశం ఉంది.
నాడు అతడు బలిపశువు
కోచ్‌లు, కెప్టెన్లపై జట్టు ఓటమి ప్రభావం పడడం సహజం. వరల్డ్ కప్‌లో టీమిండియా ఆ ప్రభావం కోచ్, కెప్టెన్‌పై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. వన్డే వరల్డ్ కప్–2007 సమయంలో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో టీమిండియా హెడ్ కోచ్ గ్రెగ్ చాపెల్ ఉన్నాడు. వెస్టిండీస్‌లో జరిగిన ఈ మెగా టోర్నీలో టీమిండియా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. కనీసం సెమీస్ కూడా చేరకుండా నిష్క్రమించడంతో చాపెల్‌కు రాజీనామా తప్ప వేరే మార్గం లేకుండా పోయింది
కొత్త కోచ్ ఊహించని పేరు!
ద్రావిడ్ విషయంలో అలా జరుగుతుందని అనుకోలేం. కానీ, ఓటమి ప్రభావంతో కెప్టెన్, కోచ్‌లలో ఎవరో ఒకరిని బలిపశువును చేయకతప్పదు. ఒకవేళ ద్రవిడ్ తప్పుకొంటే.. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను తొలి సీజన్‌లోనే విజేతగా నిలిపిన ఆశిష్ నెహ్రా రేసులోకి రావొచ్చని పలువురు విశ్లేషకులు అంటున్నారు.