Kavya Maran Hyderabad team owner : మెగా వేలంలో హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నట్టు జాతీయ మీడియాలో ప్రసారమవుతున్న కథనాల ద్వారా తెలుస్తోంది. హైదరాబాద్ జట్టు నేరుగా ముగ్గురు ఆటగాళ్ళను రిటైన్ చేసుకుని.. మిగతా వారిని ఆర్టీఎం కార్డు ద్వారా సొంతం చేసుకోవాలని భావిస్తోంది.. వాస్తవ ధర కంటే ఎక్కువకే రిటైన్డ్ ఆటగాళ్లకు కావ్య మారన్ ఆఫర్ చేసిందని తెలుస్తోంది.. అభిషేక్ శర్మ, క్లాసెన్, ప్యాట్ కమిన్స్ ను తమకు ప్రాధాన్యమైన ఆటగాళ్లుగా పరిగణించింది. వీరికి 23, 18, 14 కోట్లను చెల్లిస్తోందని తెలుస్తోంది. నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్ ను కావ్య ఆర్టీఎం కార్డు ద్వారా దక్కించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. క్యాప్డ్ విభాగంలో ఐదుగురు ఆటగాళ్లకు మాత్రమే అవకాశం ఉన్న నేపథ్యంలో.. వాషింగ్టన్ సుందర్, నటరాజన్ కు కావ్య ఉద్వాసన పలకాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన న్యూజిలాండ్ జట్టుతో రెండవ టెస్టులో వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
హైదరాబాద్ వదులుకుంటే..
హైదరాబాద్ వదులుకుంటే.. సుందర్ ను దక్కించుకోవాలని ముంబై, చెన్నై, గుజరాత్ జట్లు చూస్తున్నాయి. భారీగా డబ్బులు చెల్లించి దక్కించుకోవాలని భావిస్తున్నాయి.. సుందర్ గొప్పగా ఆడటానికి తెలిసినప్పటికీ.. రి టెన్షన్ నిబంధనల వల్ల కావ్య సుందర్ ను వదులుకుంటున్నది. “సుందర్ గొప్పగా ఆడుతున్నాడు. న్యూజిలాండ్ జట్టుపై జరిగిన టెస్టులో వికెట్ల మీద వికెట్లు తీశాడు. న్యూజిలాండ్ పై భారత్ ఓడిపోయినప్పటికీ.. వాషింగ్టన్ సుందర్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇలాంటి సమయంలో సుందర్ ను వదులుకోవడం కావ్య కు ఇష్టం లేదు. అయినప్పటికీ నిబంధనల వల్ల ఆమె ఆ పని చేయక తప్పడం లేదని” స్పోర్ట్స్అనలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, గత సీజన్లో హైదరాబాద్ జట్టు ఫైనల్ మ్యాచ్ లో కోల్ కతా చేతిలో ఓడిపోయింది. అయితే ఈసారి ఐపీఎల్ కప్ దక్కించుకోవాలని హైదరాబాద్ జట్టు భావిస్తోంది. దానికి అనుగుణంగానే కావ్య జట్టులో మార్పులు చేర్పులు చేస్తోంది. సమష్టి ప్రదర్శన చేసే ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని భావిస్తోంది. అందువల్లే కష్టమైనా సరే కీలక ఆటగాళ్లను దూరం పెడుతోంది. “కావ్యమారన్ జట్టు సౌత్ ఆఫ్రికా క్రికెట్ లీగ్ లో ట్రోఫీ దక్కించుకుంది. కానీ భారత్ వేదికగా జరిగిన ఐపిఎల్ లో మాత్రం ట్రోఫీ అందుకోలేకపోయింది. ఫైనల్ లో హైదరాబాద్ జట్టు ఓడిపోయిన తర్వాత కావ్య ఏడ్చింది. తనను తాను సముదాయించుకొని జట్టు ఆటగాళ్లలో స్ఫూర్తి నింపింది. గొప్పగా ఆడారంటూ భుజం తట్టింది. ఇప్పుడు ఆ ఓటమి నుంచి ట్రోఫీని దక్కించుకునే మార్గాన్ని రచిస్తోంది. ఇది చాలా మందికి నచ్చకపోయినప్పటికీ జట్టు యజమానిగా అది ఆమెకు తక్షణ అవసరం. అందువల్లే ఇలాంటి మార్పులకు శ్రీకారం చుడుతోందని” మీడియాలో వార్తలు వస్తున్నాయి.