Jos Buttler: ఇంగ్లాండ్ జట్టు స్టార్ బ్యాటర్ జోష్ బట్లర్ మరో అరుదైన ఘనతను నమోదు చేసుకున్నాడు. టి20 లో పదివేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఇంగ్లాండ్ జట్టులో అత్యంత విధ్వంసకర ఆటగాడిగా పేరుగాంచిన బట్లర్ తాజాగా ఇంగ్లాండ్ లో జరుగుతున్న టి20 బ్లాస్ట్ లో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొమ్మిదో బ్యాటర్ గా బట్లర్ రికార్డు సృష్టించాడు.
జోష్ బట్లర్.. ఈ పేరు వింటే చాలు విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లను ఊచ కోత కోస్తాడు. ఎదుటి జట్టులోని బౌలర్ ఎంత గొప్పవాడైన బట్లర్ క్రీజులో ఉంటే పరుగులు సమర్పించుకోవాల్సిందే. ముఖ్యంగా టి20ల్లో తనదైన శైలిలో విరుచుకుపడే ఈ క్రికెటర్.. తాజాగా ఇంగ్లాండ్ లో జరుగుతున్న టి20 బ్లాస్ట్ లీగ్ లోనూ అదరగొడుతున్నాడు. డెర్బీ షైర్ తో జరిగిన మ్యాచ్లో లంకా షైర్ తరఫున బరిలోకి దిగిన బట్లర్ 39 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ లో మూడు పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద పదివేల పరుగుల ల్యాండ్ మార్కును రీచ్ అయ్యాడు. టి20 కెరీర్ లో మొత్తం 372 మ్యాచులు ఆడిన బట్లర్.. 34.16 సగటుతో 144.70 స్ట్రైక్ రేట్ తో ఆరు శతకాలు, 21 అర్థ సెంచరీలు సాయంతో 10,080 పరుగులను పూర్తి చేశాడు.
టి20 కెరియర్ మొత్తం.. తొమ్మిదో ఆటగాడు..
అంతర్జాతీయ టి20, ఐపీఎల్, టి20 బ్లాస్ట్ వంటి అన్ని లీగుల్లో కలిపి ఇప్పటి వరకు బట్లర్ 372 మ్యాచ్లు ఆడాడు. పదివేలకు పైగా పరుగులు సాధించాడు. ఈ ఘనత సాధించిన తొమ్మిదో బ్యాటరుగా బట్లర్ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 14,562 పరుగులు చేసి టాప్ లో ఉన్నాడు క్రిస్ గేల్. ఆ తర్వాత స్థానంలో పాకిస్తాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ (12,528), మూడో స్థానంలో వెస్టిండీస్ ప్లేయర్ పోలార్డ్ (12,175), నాలుగో స్థానంలో భారత జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (11,965), ఐదో స్థానంలో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ (11,695), ఆరో స్థానంలో ఆస్ట్రేలియా మరో ఓపెనర్ ఆరోన్ పించ్ (11,392), ఏడో స్థానంలో ఇంగ్లాండుకు చెందిన మరో ఆటగాడు అలెక్స్ హేల్స్ (11,214), ఎనిమిదో స్థానంలో భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ (11,035) ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో బట్లర్ చేరాడు. ఇకపోతే ఈ జాబితాలో ఇంగ్లాండు జట్టు తరుపున చేరిన రెండు ఆటగాడిగా నిలిచాడు బట్లర్. బట్లర్ కంటే ముందు హేల్స్ ఈ జాబితాలో స్నానం సంపాదించుకున్నాడు. జేమ్స్ విన్స్ ఈ జాబితాలో చేరేందుకు అతి దగ్గరలో ఉన్నాడు.
అత్యంత వేగంగా పరుగులు చేసిన బట్లర్..
పదివేల పరుగుల మైలు రాయిని బట్లర్ అత్యంత వేగంగా అందుకున్నాడు. టీమిండియా స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ తో పోలిస్తే 12 ఇన్నింగ్స్ లు కంటే ముందుగానే ఈ ఘనత సాధించాడు. రోహిత్ శర్మ 362 ఇన్నింగ్స్ ల్లో పదివేల పరుగులు మైలురాయని అందుకోగా, బట్లర్ 350 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనతను సాధించాడు. ఇక బట్లర్ విధ్వంసం గురించి అభిమానులకు తెలియనిది కాదు. ఓపెనర్ గా వచ్చి అరవీర భయంకరమైన ఆట పేరుతో అదరగొడుతుంటాడు ఈ లెజెండ్ క్రికెటర్. బౌలర్ ఎవరైనా, జట్టు ఏ పరిస్థితుల్లో ఉన్న తనదైన శైలి ఆటతీరుతో రెచ్చిపోవడం బట్లర్ నైజం. ఆ దూకుడు అయిన ఆట తీరుతోనే ఈ అరుదైన మైలురాయిని సాధించగలిగాడు ఇంగ్లాండ్ క్రికెటర్. ఇప్పటికీ అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ టి20 ల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న బట్లర్.. భవిష్యత్తులో మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం కనిపిస్తోంది.