Jasprit Bumrah: కొన్ని రోజులుగా క్రికెట్‌లో టీమిండియా విజయాల్లో కీలక బాధ్యతలు పోషిస్తున్న బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా. ఆయన లేకుంటే.. ఇండియా గెలుపు లేదు అన్నంత కీలకంగా మారిపోయాడు. దీంతో టీమిండియా మేనేజ్‌మెంట్ అతడిని ఇష్టం వచ్చినట్లు వాడేసింది. అతని గాయాలు(injuries), ఇబ్బందులను పట్టించుకోకుండా బంగారు బాతు చందంగా గెలుపే లక్ష్యంగా ప్రతీ టోర్నీ ఆడించింది. దీంతో ఇప్పుడు అతను టీమ్‌కు దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో ఇప్పుడు బూమ్రా గాయానికి కారణం ఏంటి, బాధ్యులు ఎవరు అన్న చర్చ జరుగుతోంది. ఓవర్లు వేస్తున్నాడు.. వికెట్లు తీస్తున్నాడు అని అతడిని టీ20ల నుంచి టెస్టు మ్యాచ్‌ల వరకు అన్నీ ఆడించారు. ఇక బుమ్రా ఏ మ్యాచ్ ఆడినా వంద శాతం ఎఫర్ట్ పెడతాడు. విజయం కోసం చివరి వరకు పోరాడతాడు. టీమ్ కోసం చాలాసార్లు 110 శాతం ఎఫర్ట్ కూడా పెట్టాడు. గాయాలు కొనితెచ్చుకుని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. అయితే క్రికెట్ అన్నాక గాయాలు కామన్. చాలా మంది గాయపడిన వాళ్లే. తిరిగి వచ్చినవాళ్లే. కానీ బుమ్రాను ఒకేగాయం పదే పదే ఇబ్బంది పడుతోంది. అంటే ఆలోచించాల్సిన విషయం. పూర్తిగా చికిత్స జరుగక ముందే.. పూర్తిగా కోలోకోక ముందే.. అతడిని తిరిగి జట్టులోకి తీసుకోవడం, ఆడిస్తుండడం కారణంగా అతని గాయం తిరగబెట్టడానికి కారణం. తాజాగా ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో ఐదో టెస్టులో వెన్ను నొప్పితో మైదానం వీడాడు బుమ్రా. ఆ తర్వాత మళ్లీ రాలేదు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఫిబ్రవరిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అందుబాటులో ఉంటాడో ఉండడో తెలియని పరిస్థితి.
అత్యధిక వికెట్లు..
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఐదు టెస్టులు, తొమ్మిది ఇన్నింగ్స్ ఆడిన బుమ్రా 151 ఓవర్లు వేశాడు. లాంగ్ స్పెల్స్‌తోపాటు జట్టుకు అవసరమైనప్పుడు, కెప్టెన్ అడిగినప్పుడల్లా బంతిని తీసుకున్నాడు. ఇకెట్లు పడగొట్టాడు. బౌలర్‌గా ఇన్ని ఓవర్లు వేయడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో క్రీడాకారులకు తెలుసు. కానీ బుమ్రా.. ఇబ్బందిని పట్టించుకోలేదు. తనకు అప్పగించిన బాధ్యతను 100 శాతం ఎఫర్ట్ పెట్టి నిర్వహించాడు. జట్టు భారాన్ని భుజాన వేసుకున్నాడు. 2018–19లో బీజీటీ సీజన్‌లో 157.1 ఓవర్లు వేసి భారత్‌కు చారిత్రక విజయాలు అందించాడు.
ఏడాదిన్నర క్రితం గాయం..
ఇదిలా ఉంటే.. ఏడాదిన్నర క్రితం బుమ్ర వెన్నుపూపలకు గాయమైంది. కొన్నినెలలపాటు విశ్రాంతి తీసుకున్నాడు. వన్డే ప్రపంచకమప్ వేళ అందుబాటులోకి వచ్చాడు. భారత్ ఫైనల్స్‌కు చేరడంలో కీలకపాత్ర పోసించాడు. ఇక టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో విజృంభించి భారత్‌ను గెలిపించాడు. బీజీటీలో అతడికి గాయం తిరగబెడితే చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy), టెస్టు వరల్డ్ కప్‌కు ఇబ్బంది అవుతుందన్న విషయాన్ని కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ ఏమాత్రం పట్టించుకోలేదు.
ఎక్కువ ఓవర్లు వేసినా..
ఇక బుమ్రా కన్నా.. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(167) ఎక్కువ ఓవర్లు వేశాడు. కానీ, అతనికి ఏమీ కాలేదు. అయితే బౌలింగ్ చేయడం ఒక ఎత్తు అయితే పరుగులు తక్కువ ఇచ్చి.. వికెట్లు ఎక్కువ పడగొట్టడం ముఖ్యం. సిరీస్‌లో అత్యధిక మెడిన్లు(39), ఎకానమీ(2.70) మాత్ర బుమ్రాదే. అంతే ఎంత పకడ్బందీగా బౌలింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. 32 వికెట్లతో సిరీస్‌లో టాపర్‌గా నిలిచాడు.
గాయపడే అవకాశాలు ఉన్నా..
బుమ్రా గాయపడే అవకాశం ఉందన్న విషయం నిపుణులు చెబుతుఆన్నరు. అయినా మేనేజ్‌మెంట్ పట్టించుకోలేదు. వికెట్లు తీయాలి.. జట్టును గెలిపించాలి అన్న ఒకే ఒక్క కారణంతో అన్ని మ్యాచ్‌లు ఆడించింది. దీంతో జెస్సీపై ఒత్తిడి పెరిగింది. ఒకరిపైనే ఆధారపడడం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రతీసారి అందరూ బుమ్రావైపే చూడడం, అభిమానులు కూడా బుమ్రా ఉంటేనే జట్టు గెలుస్తుంది అన్న అంచనాలకు రావడం కూడా బుమ్రాపై ఒత్తిడకి కారణం. ఇదే పరిస్థితి కొనసాగితే తర్వాత వచ్చే బౌలర్లు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. గాయపడిన తర్వాత శరీరం మాట వినాలి అని బుమ్రా ఒక మాట అన్నాడు. ఇదంతా చూస్తుంటే శరీరం మాట ఆయన విన్నా.. ఆయన మాట జట్టు యాజమాన్యం వినలేదు. ఇదే బుమ్రాకు అలసలు కారణం.