India vs Bangladesh : అనుకున్నట్టుగానే బుమ్రా 400 సాధించాడు.. ఈ జాబితాలో భారతీయ బౌలర్లు ఎవరున్నారంటే..

టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా దూసుకుపోతున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. సమకాలీన క్రికెట్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ.. సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 20, 2024 9:39 pm

India vs Bangladesh

Follow us on

India vs Bangladesh : ప్రస్తుత బంగ్లాదేశ్ టోర్నీ లో బుమ్రా ను ఎంపిక చేయడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే బంగ్లా తర్వాత టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో మూడు, ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లోకి భారత్ ప్రవేశించాలంటే కచ్చితంగా ఈ టెస్ట్ సిరీస్ లలో నెగ్గాలి. అందువల్ల భారత జట్టు మేనేజ్మెంట్ బుమ్రాకు బంగ్లాదేశ్ టోర్నీకి విశ్రాంతి ఇవ్వాలని భావించింది. ఆ దిశగా ప్రకటన కూడా చేసింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు గాని.. బంగ్లాదేశ్ టోర్నీలో బుమ్రాకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.. అయితే ఆ నిర్ణయం ఎంత చక్కటిదో బుమ్రా నిరూపించాడు. స్పిన్ కు అనుకూలించే చెన్నై మైదానంపై పేస్ ను రాబట్టాడు. క్రికెట్ల మీద వికెట్లు పడగొట్టాడు. బుమ్రా దూకుడు వల్ల బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 149 పరుగులకే చాప చుట్టింది. తొలి ఓవర్ లోనే బుమ్రా అద్భుతమైన ఇన్ స్వింగర్ తో బంగ్లా ఓపెనర్ షాద్మాన్ ను ఔట్ చేశాడు. టి విరామం సమయానికి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే సమయంలో అద్భుతమైన ఘనతను బుమ్రా తన పేరు మీద లిఖించుకున్నాడు. జాతీయ క్రికెట్ చరిత్రలో అన్ని ఫార్మాట్లలో కలిపి 400 వికెట్లు పూర్తి చేసిన టాప్ -10 భారత బౌలర్ల లిస్టులో ఎంట్రీ ఇచ్చాడు.. అత్యధిక వికెట్లు తీసిన భారతీయ ఆరవ పేస్ బౌలర్ బుమ్రా అరుదైన ఘనతను అందుకున్నాడు. బంగ్లాదేశ్ ఆటగాడు హసన్ మహమూద్ ను అవుట్ చేయడం ద్వారా బుమ్రా ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.

ఎన్ని రికార్డులు సాధించాడంటే

బుమ్రా ఇప్పటివరకు 162 టెస్ట్ వికెట్లు సొంతం చేసుకున్నాడు. 149 వన్డే వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 89 t20 వికెట్లను పడగొట్టాడు. తన క్రికెట్ కెరియర్లో 227 వ ఇన్నింగ్స్ లో బుమ్రా ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్లు అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్, జహీర్ ఖాన్, ఈశాంత్ శర్మ, మహమ్మద్ షమీ సరసన బుమ్రా స్థానం సంపాదించుకున్నాడు. 2018లో టెస్టుల్లోకి బుమ్రా ఎంట్రీ ఇచ్చాడు. ప్రారంభం నుంచి అద్భుతంగా బౌలింగ్ చేస్తూ అదరగొట్టడం మొదలుపెట్టాడు. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో బుమ్రా ఏకంగా 19 వికెట్లు సొంతం చేసుకున్నాడు..

అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్లు వీరే

అనిల్ కుంబ్లే – 953 వికెట్లు

రవిచంద్రన్ అశ్విన్ – 744 వికెట్లు

హర్భజన్ సింగ్ – 707 వికెట్లు

కపిల్ దేవ్ – 687 వికెట్లు

జహీర్ ఖాన్ – 597 వికెట్లు

రవీంద్ర జడేజా – 570 వికెట్లు

జవగల్ శ్రీనాథ్ – 551 వికెట్లు

మహమ్మద్ షమీ – 448 వికెట్లు

ఈశాంత్ శర్మ – 434 వికెట్లు

జస్ ప్రీత్ బుమ్రా – 400* వికెట్లు.