https://oktelugu.com/

Ind Vs Aus 5th Test: బుమ్రాను రెచ్చగొడితే ఇట్లుంటదీ మరీ.. కోన్ స్టాస్ రేపు ఉంటదీ నీకు.. వైరల్ వీడియో!

దాహం వేసినప్పుడు.. సింహం వాగు వద్దకు వచ్చి తలవంచుకొని నీళ్లు తాగుతుంది.. సింహం తలవంచింది కదా అని.. తొడ కొడితే.. ఒకసారి సింహం తల ఎగిరేసి చూస్తే.. తొడ, దానిని కొట్టిన చేయి రెండూ ఉండవు. ఇప్పుడు ఎందుకు ఈ ఉపోద్ఘాతం అంటే.. ఆగండి ఆగండి అక్కడి దాకే వస్తున్నాం.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 3, 2025 / 04:04 PM IST

    Ind Vs Aus 5th Test(7)

    Follow us on

    Ind Vs Aus 5th Test: ప్రస్తుతం సిడ్నీ వేదికగా టీమిండియా – ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రెండు జట్లు చివరి టెస్ట్ ఆడుతున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా రెండు టెస్టులు గెలిచి ఊపు మీద ఉంది. సిరీస్ లో పై చేయి సాధించింది. టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్లాలంటే ఈ టెస్ట్ కచ్చితంగా గెలవాలి. ఈ టెస్ట్ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన టీమ్ ఇండియా 185 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 40, రవీంద్ర జడేజా 26, బుమ్రా 22, గిల్ 20 పరుగులు చేశారు. బోలాండ్ నాలుగు వికెట్లు పట్టగొట్టి.. టీం ఇండియా టాప్ ఆర్డర్ కు చుక్కలు చూపించాడు.

    బుమ్రా విశ్వరూపం..

    ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో తొలి బంతికే కోన్ స్టాస్ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్ చేస్తుండగా.. నాన్ స్ట్రైకర్ గా ఉన్న కోన్ స్టాస్ అనవసరమైన వివాదంలో తల దూర్చాడు..” ఏమైంది హితుడా.. వికెట్లు తీయలేకపోతున్నావు” అంటూ హేళన చేశాడు. దానికి బుమ్రా ” .. అతడిని శక్తి పెంచుకోమను.. ఆ తర్వాత కాస్త ఎదురు చూడు..” ఇక నీకు అర్థమవుతుందని బదులిచ్చాడు. ఆ తర్వాత బంతికి ఉస్మాన్ ఖవాజాను బుమ్రా అవుట్ చేసి…కోన్ స్టాస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఈ పరిణామం మొత్తం సినిమా లాగా కనిపించింది. మైదానంలో డ్రామాను తలపించింది. కోన్ స్టాస్ అడ్డగోలుగా మాట్లాడినప్పుడు.. బుమ్రా కూడా అదే స్థాయిలో స్పందించాడు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ సామెత లాగా ఖవాజా వికెట్ పడగొట్టి కోన్ స్టాస్ తిరుగులేని బదులిచ్చాడు. దీంతో కోన్ స్టాస్ ముఖం చిన్న బుచ్చుకున్నాడు. బుమ్రా, కోన్ స్టాస్ మధ్య వార్ నేపథ్యంలో.. కామెంట్రీ చేస్తున్న వారు కూడా ఆ పరిణామాన్ని సరికొత్తగా వ్యాఖ్యానించారు. ” మొత్తానికి బుమ్రా వికెట్ పడగొట్టాడు. అప్పుడు కోన్ స్టాస్ ముఖం చిన్న బోయిందని” వ్యాఖ్యానించాడు. తొలి రోజు ఆట చివరి సమయంలో బుమ్రా, కోన్ స్టాస్ మధ్య వివాదం జరిగిన నేపథ్యంలో.. శనివారం రెండో రోజు వీరిద్దరి మధ్య పోరు మరింత రసవత్తరంగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. బుమ్రాను గెలికితే.. దాని తదుపరి పరిణామాలు వేరే విధంగా ఉంటాయని..కోన్ స్టాస్ కు రేపు అసలైన సినిమా కనబడుతుందని వారు వివరిస్తున్నారు. కోన్ స్టాస్ శనివారం బుమ్రా ను నిలువరించడం దాదాపు అసాధ్యమని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బుమ్రా ను గెలుక్కోకుండా ఉండాల్సిందని కోన్ స్టాస్ కు హితవు పలుకుతున్నారు.