David Warner: ఆస్ట్రేలియా జట్టులో అత్యంత ప్రతిభ కలిగిన ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ ఒకడు. సుదీర్ఘమైన క్రికెట్ కెరియర్ లో అనేక విజయాలను జట్టుకు అందించాడు. అయితే, అంత గొప్ప ఆటగాడిపై క్రికెట్ ఆస్ట్రేలియా అవమానకర రీతిలో వ్యవహరిస్తోంది. దీనిపై తాజాగా స్పందించిన డేవిడ్ వార్నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా ప్రవర్తిస్తున్న తీరు చాలా హాస్యాస్పదంగా ఉందన్నాడు. అంతగా క్షమించరాని నేరం తానేం చేశానని ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ముందు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన పట్ల భిన్నంగా వ్యవహరిస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా తీరుపై తీవ్రంగా స్పందించాడు. బాల్ టాంపరింగ్ ఉదంతంలో డేవిడ్ వార్నర్ పై క్రికెట్ ఆస్ట్రేలియా రెండేళ్లపాటు నిషేధం విధించడంతోపాటు కెప్టెన్సీ పై జీవితకాలం నిషేధం విధించింది. బాల్ టాంపరింగ్ ఘటనలో వార్నర్ తో పాటు ఉన్న స్టీవ్ స్మిత్ ను మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా చూసి చూడనట్లు వదిలేసింది. దీంతో అతను మళ్లీ టీమ్ వైస్ కెప్టెన్ అయి.. కమిన్స్ గైర్హాజరీలో జట్టును కూడా నడిపిస్తున్నాడు.
తీవ్ర అసహనానికి గురైన డేవిడ్ వార్నర్..
ఇదే వ్యవహారంపై డేవిడ్ వార్నర్ తాజాగా తీవ్ర అసహనానికి గురయ్యాడు. క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన కెప్టెన్సీ బ్యాన్ పై రివ్యూ పిటిషన్ ను దాఖలు చేశాడు. అయితే ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్.. కేసును బహిరంగంగా విచారణ చేపట్టాలని నిర్ణయించడంతో వార్నర్ ఆ పిటిషన్ ను ఉపసంహరించుకున్నాడు. మర్చిపోవాలనుకున్న విషయాలను పదేపదే గుర్తు చేసుకోవడం తనకి ఇష్టం లేదని ఈ సందర్భంగా వార్నర్ స్పష్టం చేశాడు. దేశం కోసం ఆడుతున్న క్రికెటర్లు అందరినీ ఒకేలా చూడాలన్న విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా మరిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.
క్రికెట్ ఆస్ట్రేలియా తీరు నవ్వులాటగా కనిపిస్తోంది..
ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియాపై విరుచుకుపడ్డాడు డేవిడ్ వార్నర్. ‘ నా విషయంలో సీఏ తీరు నవ్వులాటగా ఉంది. నేను గతాన్ని ముగిద్దామని భావిస్తుంటే. ఎదుటి వారు మాత్రం ఇంకా కొనసాగించాలని ధోరణితో ప్రవర్తిస్తున్నారు. బోర్డులో ఒక్కరు కూడా పారదర్శకంగా లేరు. ఎవరు జవాబుదారీగా ఉండకూడదని, ఎవరు నిర్ణయం తీసుకోకూడదు అనుకున్నారు. సిఏ పాలనలో స్పష్టంగా నాయకత్వ లోపం కనిపించింది. నేను వదిలేద్దామని అనుకున్న ప్రతిసారి సిఏ పెద్దలు దానిని బయటకు తీస్తూనే ఉన్నారు’ అని డేవిడ్ వార్నర్ ఆవేదన వ్యక్తం చేశాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వ్యవహార శైలి నా వ్యక్తిగత ప్రదర్శన పైన ప్రభావం చూపిందని విమర్శించాడు. టెస్టు మ్యాచ్ ల సందర్భంగా ప్రతిరోజు నాకు ఉదయాన్నే లాయర్ల నుంచి ఫోన్లు వచ్చేవని అవి నన్ను చికాకు గురి చేశాయని వాపోయాడు. ఇదంతా తనకు అగౌరవంగా అనిపించిందని, తన బ్యాటింగ్ ప్రదర్శనను తీవ్రంగా దెబ్బతీసిందని వాపోయాడు. ఆటపై దృష్టి సారించలేకపోయానని, ఈ వ్యవహారం జరిగి తొమ్మిది నెలలు అవుతోంది అంటూ అసహనాన్ని కనబరిచాడు.
చర్చనీయాంశంగా మారిన వార్నర్ వ్యాఖ్యలు..
డేవిడ్ వార్నర్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చినీయాంశంగా మారాయి. జూన్ ఏడు నుంచి 11 తేదీల మధ్య లండన్ లోని ఓవల్ మైదానం వేదికగా భారత్ తో జరగనున్న డబ్ల్యూటీసి ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ కు ముందు వార్నర్ క్రికెట్ ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా మాట్లాడిన ఈ మాటలు క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా డేవిడ్ వార్నర్ చేసిన వ్యాఖ్యలు పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.