Site icon OkTelugu

T20 world cup vs T20 leagues : టీ20 లీగ్‌లలో పరుగుల వరద.. టీ20 వరల్డ్‌కప్‌ లో ఆపసోపాలు.. ఎందుకిలా?

T20 world cup vs T20 leagues

T20 world cup vs T20 leagues : టీ20 క్రికెట్ అంటేనే భారీ స్కోర్లు, వరుస సిక్సర్లు, 200 దాటితేనే సేఫ్ అనే భావన ఇటీవలి లీగ్‌లలో బలంగా ముద్రపడింది. ఐపీఎల్, బీబీఎల్, పీఎస్‌ఎల్ వంటి లీగ్‌లలో 200 కన్నా తక్కువ స్కోరు ఇప్పుడు పెద్దగా భయం కలిగించదు. కానీ అదే టీ20 వరల్డ్‌కప్‌కు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది.

పురుషుల టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఇప్పటివరకు 317 మ్యాచ్‌లు జరగగా అందులో కేవలం 18 సార్లు మాత్రమే 200కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. అదే తాజా ఐపీఎల్ సీజన్‌లో ఒక్కటే 52 సార్లు 200 ప్లస్ స్కోర్లు వచ్చాయి. అంతేకాదు టీ20 వరల్డ్‌కప్‌లో 200కు పైగా లక్ష్యాన్ని చేధించిన సందర్భాలు కేవలం రెండే. ఇది లీగ్ క్రికెట్‌తో పోలిస్తే అంతర్జాతీయ టోర్నమెంట్ ఎంత కఠినమో చెప్పే స్పష్టమైన ఉదాహరణ.

T20 world cup vs T20 leagues

జాగ్రత్తే ప్రధాన కారణం

వరల్డ్‌కప్‌లో ప్రతి మ్యాచ్ విలువ అమితంగా ఉంటుంది. లీగ్‌లలో లాగా “ఇంకో ఛాన్స్ ఉంటుంది” అనే వెసులుబాటు ఇక్కడ లేదు. ఒక ఓటమి, ఒక బ్యాటింగ్ కూలాప్స్ నెట్ రన్‌రేట్‌ను దెబ్బతీస్తే, క్వాలిఫికేషన్ అవకాశాలే ప్రమాదంలో పడతాయి. అందుకే బ్యాటర్లు అతి దూకుడుకంటే వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు. ఫ్రాంచైజీ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా కోచ్‌గా పనిచేసిన టామ్ మూడీ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ “ఐపీఎల్‌లో మొదటి రెండు మూడు మ్యాచ్‌లు ఓడినా చివరికి ట్రోఫీ గెలవచ్చు. కానీ వరల్డ్‌కప్‌లో అలా అయితే బ్యాగులు సర్దుకోవాల్సిందే” అని చెబుతున్నారు.

ఇంపాక్ట్ సబ్ ప్రభావం

లీగ్‌లలో స్కోర్లు పెరగడానికి మరో పెద్ద కారణం ‘ఇంపాక్ట్ సబ్’ నిబంధన. అదనపు బ్యాటర్ లేదా బౌలర్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉండటంతో టీమ్స్ మరింత నిర్భయంగా ఆడుతున్నాయి. వరల్డ్‌కప్‌లో ఈ వెసులుబాటు లేకపోవడంతో బ్యాటింగ్‌లో సహజంగానే నియంత్రణ పెరుగుతుంది.

పరిస్థితులు, మైదానాల తేడా

వరల్డ్‌కప్ అంటే ఒక్క దేశంలో ఒక్క రకమైన పిచ్‌లపై జరగదు. ఒక మ్యాచ్‌లో చిన్న గ్రౌండ్, ఫ్లాట్ వికెట్ ఉంటే మరో మ్యాచ్‌లో పెద్ద మైదానం, నెమ్మదైన పిచ్ ఎదురవుతుంది. ఉదాహరణకు వాంఖడేలో సిక్సర్‌గా వెళ్లే షాట్, ఎంసీజీలో బౌండరీ లోపలే క్యాచ్ అవుతుంది. ఇలాంటి అనుభవాలే బ్యాటర్లను మరింత జాగ్రత్తగా ఆడేలా చేస్తాయి. లీగ్‌లలో అయితే ఒక్కో టీమ్‌కు హోం గ్రౌండ్ ఉంటుంది. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా స్క్వాడ్‌ను తయారు చేస్తారు. వరల్డ్‌కప్‌లో ఆ సౌలభ్యం ఉండదు.

బలమైన బౌలింగ్ దళాలు

అంతర్జాతీయ టోర్నమెంట్‌లో దేశాలు తమ అత్యుత్తమ బౌలర్లను రంగంలోకి దింపుతాయి. ఐదు స్పెషలిస్ట్ బౌలర్లు, అదనంగా పార్ట్‌టైమ్ ఆప్షన్‌లు ఉండటం వల్ల బ్యాటింగ్‌పై ఒత్తిడి పెరుగుతుంది. లీగ్‌లలో అలాంటి లోతైన బౌలింగ్ క్వాలిటీ ప్రతిసారి దొరకదు.

రిస్క్ తక్కువైన బ్యాటర్ల విలువ

ఇటీవలి టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌ను గమనిస్తే గెలిచిన జట్లలో టాప్ స్కోరర్లు చాలా సందర్భాల్లో 135 కంటే తక్కువ స్ట్రైక్‌రేట్‌తోనే రాణించారు. ఇది లీగ్‌ల్లో కాస్త నెమ్మదిగా కనిపించినా, వరల్డ్‌కప్‌లో మాత్రం అదే విజయానికి మార్గం అవుతోంది. 30కి పైగా బంతులు ఆడి 100 కంటే తక్కువ స్ట్రైక్‌రేట్‌తో ఆడే ఇన్నింగ్స్‌లు వరల్డ్‌కప్‌లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.

2026 వరల్డ్‌కప్‌లో మార్పు ఉంటుందా?

ఈసారి భారత్‌లో జరగనున్న వరల్డ్‌కప్‌లో అన్ని మైదానాలు ఐపీఎల్‌కు పరిచయమైనవే. చిన్న బౌండరీలు, వేగవంతమైన అవుట్‌ఫీల్డ్, డ్యూ వంటి అంశాలు స్కోర్లను పెంచే అవకాశం ఉంది. అయినా, వరల్డ్‌కప్ ఒత్తిడి నాకౌట్ ఫార్మాట్ కారణంగా బ్యాటర్లు పూర్తిగా “ఆల్ గన్స్ బ్లేజింగ్” విధానంలోకి వెళ్లే అవకాశాలు తక్కువే.

టీ20 లీగ్‌లు వినోదానికి, భారీ స్కోర్లకు వేదిక అయితే… టీ20 వరల్డ్‌కప్ మాత్రం ఓర్పు, వ్యూహం, పరిస్థితులకు అనుగుణంగా ఆడే తెలివికి పరీక్ష. అందుకే అక్కడ పరుగుల వేగం నెమ్మదిగా కనిపించినా, ఆ నెమ్మదే విజయానికి కీలకంగా మారుతోంది.

Exit mobile version