T20 World Cup 2024: ఐపీఎల్ 17వ సీజన్ జోరుగా సాగుతోంది. కొంతమంది ఆటగాళ్లు అంతకుమించి అనేలాగా ఆడుతున్నారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. మంచినీళ్లు తాగినంత ఈజీగా ఫోర్లు.. జెర్సీ వేసుకున్నంత సులభంగా సిక్సర్లు కొడుతున్నారు. ఫలితంగా ఆయా జట్లు విజయాలు సాధిస్తున్నాయి. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లు నిరాశ పరుస్తుండడంతో తోపు అనుకున్న జట్లు వెనుకంజలో ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఐపిఎల్ దాదాపు సగం పూర్తయింది. మిగతా మ్యాచ్లు నిర్వహిస్తే ఐపీఎల్ పూర్తవుతుంది. ఐపీఎల్ పూర్తయిన తర్వాత జూన్ 1 నుంచి ఐసీసీ నిర్వహించే టి20 వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది. ఈసారి టీ20 వరల్డ్ కప్ నకు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈసారి ఈ కప్ కోసం 20 జట్లు పోటీ పడుతున్నాయి. అన్ని దేశాలు మే ఒకటి వరకు టోర్నీలో ఆడే స్క్వాడ్ ను ప్రకటించాలని ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది. 25 వరకు ప్రకటించిన జట్లలో మార్పులు చేసుకోవాలని సూచించింది.
ఐసీసీ ప్రకటన నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, సెలెక్టర్ అజిత్ అగర్కార్ తరచూ సమావేశం అవుతున్నారు. వీరి సమావేశానికి సంబంధించి ఏదో ఒక వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే టి20 వరల్డ్ కప్ కు ఎంపిక చేసే ఆటగాళ్లకు సంబంధించి ఐపీఎల్ ఫామ్ కూడా లెక్కలోకి తీసుకుంటారని తెలుస్తోంది. అయితే ఈ లీగ్ లో ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నలుగురు ఆటగాళ్లు t20 వరల్డ్ కప్ నకు ఎంపికవడం దాదాపు అసాధ్యమని తెలుస్తోంది.
కె.ఎల్ రాహుల్
లక్నో జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఈ ఆటగాడు.. ఐపీఎల్ లో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. బ్యాట్ తో మాయాజాలం ప్రదర్శించే ఈ ఆటగాడు సత్తా చాటలేకపోతున్నాడు. టీమిండియాలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా వచ్చే ఇతను.. ఐపీఎల్ కు వచ్చేసరికి ఓపెనర్ గా బరి లోకి దిగుతున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో రోహిత్ శర్మకు జోడిగా గిల్ లేదా విరాట్ కోహ్లీని ఓపెనింగ్ జోడీగా పంపించాలని బీసీసీ ఐ భావిస్తోంది. అదే జరిగితే రాహుల్ కు అవకాశం లభించడం కష్టమే. పైగా అతడు ఇటీవల పలుమార్లు గాయాల బారిన పడ్డాడు.
రవిచంద్రన్ అశ్విన్
ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో అదరగొట్టిన రవిచంద్రన్ అశ్విన్.. ఐపీఎల్ కు వచ్చేసరికి తేలిపోతున్నాడు. రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్న ఈ సీనియర్ స్పిన్నర్.. ఇంతవరకు మెరుగైన ప్రదర్శన చేయలేదు. వెస్టిండీస్, అమెరికా మైదానాలు స్పిన్నర్లకు అనుకూలిస్తాయి. అయితే రవిచంద్రన్ అశ్విన్ సరైన ప్రదర్శన చేయకపోవడం వల్ల అతడిని t20 వరల్డ్ కప్ కు ఎంపిక చేయకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
జితేష్ శర్మ
పంజాబ్ జట్టులో ఆడుతున్న ఈ ఆటగాడు . టి20 లో బెస్ట్ స్ట్రైక్ రేటు కలిగి ఉన్నాడు. అయితే ఈ సీజన్లో ఆ స్థాయి ఆట అతడు ప్రదర్శించడం లేదు. ఇతడు గనుక తన బెస్ట్ ఇస్తే టి20 వరల్డ్ కప్ నకు బీసీసీఐ ఎంపిక చేసే అవకాశం ఉంది. లేకుంటే ఇతడి స్థానంలో దినేష్ కార్తీక్ ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోలేదు.
యశస్వి జైస్వాల్
ఇటీవల జరిగిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు ఈ ఆటగాడు. రాజస్థాన్ జట్టుకు ఆడుతున్నప్పటికీ సరిగ్గా ఆడలేకపోతున్నాడు. గిల్, ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్ లో ఉండటంతో టీ 20 వరల్డ్ కప్ లో జై స్వాల్ కు అవకాశం లభించదని తెలుస్తోంది.