Ishan Kishan: టీమిండియా వర్ధమాన క్రికెటర్ ఇషాన్ కిషన్ కు దెబ్బ పడితే గాని.. బుద్ధి రాలేదు.. ఫలితంగా దేశవాళి క్రికెట్ టోర్నీలో చిచ్చరపిడుగు లాగా ఆడుతున్నాడు. తన అసలు సిసలైన బ్యాటింగ్ ను ప్రత్యర్థులకు రుచి చూపిస్తున్నాడు. తన దూకుడు, అతి వల్ల టీమిండియాలో చోటు కోల్పోయాడు. కీలకమైన టోర్నీలకు దూరమయ్యాడు. టాలెంట్ ఉన్నప్పటికీ.. స్వీయ తప్పిదాలు అతడిని జట్టుకు దూరం చేశాయి. ఈ ఏడాది ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లోనూ అతడు అవకాశాన్ని కోల్పోయాడు. ఈ క్రమంలో తను చేసిన తప్పులను దిద్దుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. బీసీసీఐ పెద్దల మనసును గెలిచేందుకు మైదానంలో శివతాండవం చేస్తున్నాడు. తన కం బ్యాక్ ఎంత గట్టిగా ఉంటుందో చెప్పకనే చెబుతున్నాడు.
సిక్సర్ల వర్షం
ప్రతిష్టాత్మకమైన బుచ్చిబాబు టోర్నీలో ఇషాన్ కిషన్ జార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అయితే తొలి మ్యాచ్లోనే అతడు మైదానంలో విధ్వంసం సృష్టించాడు. గురువారం ఈ మ్యాచ్ ప్రారంభం కాగా.. ఏకంగా సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు కిషన్. అంతేకాదు మైదానంలో విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. తన సెంచరీ పూర్తి చేసుకునేందుకు ఏకంగా రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. 84 బంతుల్లో 92 పరుగుల వద్ద అతడి ఇన్నింగ్స్ ఉన్నప్పుడు.. భారీ సిక్సర్ కొట్టాడు. దీంతో అతడి స్కోరు 98 రన్స్ కు చేరుకుంది. ఆ తర్వాత బంతిని భారీ సిక్స్ కొట్టి ఏకంగా 104 రన్స్ చేశాడు.
ఈ ప్రదర్శనతో పాటు తర్వాత జరిగే దులీప్ ట్రోఫీలోనూ సత్తా చాటి, టీమిండియాలో చోటు సంపాదించాలని కిషన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. జట్టులో చోటు కోల్పోవడం, సెంట్రల్ కాంట్రాక్ట్ లో అవకాశం దక్కించుకోకపోవడం వల్ల కొంతకాలంగా ఇషాన్ కిషన్ తీవ్రమైన ఒత్తిడి అనుభవిస్తున్నాడు. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు దారులు మూసుకుపోవడంతో.. బీసీసీఐ పెద్దల మనసును గెలుచుకునేందుకు కసిగా ఆడుతున్నాడు. ఇక బుచ్చిబాబు టోర్నీలో తొలి మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 107 బంతుల్లో 114 రన్స్ చేసి, ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరుకున్నాడు. అంతేకాదు నాయకుడిగా జార్ఖండ్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.
ఇక ఈ మ్యాచ్లో ముందుగా మధ్యప్రదేశ్ జట్టు బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 225 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. మధ్యప్రదేశ్ చెట్లు శుభం 84, అక్విల్ 57 రన్స్ చేసి ఆకట్టుకున్నారు. జార్ఖండ్ బౌలర్లలో శుభం సింగ్, సౌరభ్ తలా మూడు వికెట్లు దక్కించుకున్నారు. ఇక తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన జార్ఖండ్ 84 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 రన్స్ చేసింది . జార్ఖండ్ జట్టులో కెప్టెన్ ఇషాన్ కిషన్ 114 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. వికాశ్ విశాల్ 38, శరన్దీప్ సింగ్ 33, ఆదిత్య సింగ్ 33 రన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఇంకా మూడు వికెట్లు చేతిలో ఉండడంతో జార్ఖండ్ జట్టు దూకుడుగా ఆడుతోంది.