Hardik Pandya Vs Irfan Pathan
Hardik Pandya Vs Irfan Pathan: ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది.. వరుసగా ఆ జట్టు మూడు మ్యాచ్ లలో ఓటమిపాలైంది. సోమవారం రాత్రి రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో పేలవమైన ఆటతీరు ప్రదర్శించి ఓడిపోయింది.. గుజరాత్, హైదరాబాద్ జట్లతో జరిగిన మ్యాచ్ లలో విజయం వరకు వచ్చిన ముంబై.. రాజస్థాన్ చేతిలో మాత్రం దారుణంగా ఓడిపోయింది. సొంత మైదానంలో తక్కువ స్కోరు చేయడం.. రాజస్థాన్ చేతిలో ఓడిపోవడం ముంబై అభిమానులను కలవరపరుస్తోంది.
ముంబై జట్టు ఓటమి నేపథ్యంలో రకరకాల విశ్లేషణలు తెరపై వస్తున్నాయి. అయితే ఇందులో టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ విభిన్నంగా స్పందిస్తున్నాడు. ఈ సీజన్ మొదలైన నాటి నుంచి అతడు ముంబై జట్టు మీద సానుకూల దృక్పథంతో లేడు. ముఖ్యంగా జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించడం పట్ల నేరుగా విమర్శలు చేశాడు.. హార్దిక్ కెప్టెన్సీ పట్ల పరోక్షంగా ఆరోపణలు చేస్తున్నాడు.. ఇతర జట్లు ఆడే మ్యాచ్ ల గురించి ఇర్ఫాన్ స్పందిస్తున్నప్పటికీ.. ముంబై విషయంలో మరి ముఖ్యంగా హార్దిక్ పాండ్యా విషయంలో అతని వ్యవహార శైలి విభిన్నంగా ఉంటున్నది. హార్దిక్ పేరు ప్రస్తావించకుండానే ఇర్ఫాన్ పఠాన్ పరోక్షంగా విమర్శలు చేస్తున్నాడు.
సోమవారం రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 20 పరుగులకే ముంబై జట్టు 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కు దిగాడు. 21 బంతుల్లో 34 పరుగులు చేశాడు. అతడు ప్రతిదానికి దిగిన నేపథ్యంలో ముంబై స్కోరు పరుగులు పెడుతుందని అందరూ భావించారు. మరో ఎండ్ లో తిలక్ వర్మ ఉండడంతో ముంబై అభిమానులు ఆశావాహ దృక్పథంతో ఉన్నారు.. 34 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా చాహల్ బౌలింగ్ లో వెనుతిరిగాడు. అయినప్పటికీ అతడు ముంబై జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు.. ఈ క్రమంలో ఇర్ఫాన్ పఠాన్ ట్విట్టర్ లో స్పందించాడు. హార్దిక్ పాండ్యా పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు..” క్రికెట్ గురించి బాగా తెలిసిన వాళ్లకు ఇది అవగతం అవుతుంది. మీరు స్థిరపడితే.. జట్టును చివరి అంచుల వరకు తీసుకెళ్లాలి” అంటూ కామెంట్స్ చేశాడు.
హార్దిక్ ఆట తీరుపై మాత్రమే కాదు.. బుమ్రా ను కొత్త బంతితో బౌలింగ్ వెంటనే చేయించడం పట్ల కూడా ఇర్ఫాన్ స్పందించాడు. గుజరాత్, హైదరాబాద్ జట్లతో జరిగిన మ్యాచ్ లలో హార్దిక్ బుమ్రాకు ఆలస్యంగా బౌలింగ్ ఇచ్చాడు..”జట్టులో అతడు అత్యుత్తమ బౌలర్. అతడికి తొందరగా బంతి అందించడానికి ఈసారి ఎటువంటి రాకెట్ సైన్స్ ఉపయోగించలేదు. ఎట్టకేలకు బుమ్రా కొత్త బంతి స్వీకరించాడు. రాజస్థాన్ ముందు స్వల్ప లక్ష్యం ఉన్న నేపథ్యంలో అతడు అయిష్టంగా నైనా ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు కావచ్చు” అని ఇర్ఫాన్ పేర్కొన్నాడు.
వాస్తవానికి ఇర్ఫాన్, హార్దిక్ కు మధ్య మంచి స్నేహం ఉంది. గతంలో వారిద్దరూ ఒకరిపై ఒకరు చలోక్తులు విసురుకున్న వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు ఇర్ఫాన్, హార్దిక్ మధ్య గొడవ ఎప్పుడు మొదలైంది అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. అయితే హార్దిక్ కు జట్టు పగ్గాలు ఇవ్వడం పట్ల ఇర్ఫాన్ మండిపడుతున్నాడు. బహుశా అదే అతడి కోపానికి కారణమే ఉంటుందని తెలుస్తోంది. వచ్చే మ్యాచ్ లలో ఒకవేళ ముంబై గెలిస్తే ఇర్ఫాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి. కనీసం హార్దిక్ పాండ్యాకు మద్దతుగా ఒక్క ట్వీట్ అయినా చేస్తాడో చూడాలని ముంబై అభిమానులు అంటున్నారు.
You always want your Leader to do the difficult things. If he doesn’t do it he won’t earn his team’s respect.
— Irfan Pathan (@IrfanPathan) April 1, 2024