Nitish Kumar Reddy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టులో సూపర్ సెంచరీ చేసి టీమ్ ఇండియాను ఆదుకున్న నితీష్ కుమార్ రెడ్డి పై ప్రశంసల జల్లు కురుస్తోంది. విశాఖపట్నం ప్రాంతానికి చెందిన ఈ క్రికెటర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. సోషల్ మీడియా వేదికగా అతడు ఆడిన ఇన్నింగ్స్ ను కీర్తించారు.
నితీష్ కుమార్ రెడ్డి 105 పరుగులతో అజేయంగా నిలవడం.. వాషింగ్టన్ సుందర్ తో కలిసి 127 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియా కాస్త పటిష్ట స్థితిలోకి వెళ్ళింది. మూడోరోజు ఆట ముగిసిన తర్వాత 358/9 తో నిలిచింది. స్ఫూర్తిదాయకమైన ఆట తీరు ప్రదర్శించి అందరి అభిమానాన్ని చూరగొన్న నితీష్ కుమార్ రెడ్డి వార్తల్లో వ్యక్తి అయిపోయాడు. సోషల్ మీడియా నుంచి మీడియా వరకు ప్రస్తుతం అతడే కనిపిస్తున్నాడు. మీడియా కూడా అతడి గురించి పుంఖానుపుంఖాలుగా వార్త కథనాలను ప్రసారం చేస్తోంది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ రెడ్డి పై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రశంసల జల్లు కురిపించింది. వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి నెలకొల్పిన భాగస్వామ్యం టీమిండియాను పటిష్ట స్థితిలోకి నెట్టింది. ఆస్ట్రేలియా నుంచి లాగేసుకునేలా చేసింది. అందువల్లే నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేస్తే ప్రఖ్యాత రవి శాస్త్రి కూడా కన్నీరు పెట్టాడు. ఇటీవల కాలంలో ఈ తరహా ఇన్నింగ్స్ చూడలేదని వ్యాఖ్యానించాడు. రవి శాస్త్రి కన్నీరు పెట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారాయి.
భారీ నజరానా
ఆస్ట్రేలియాపై సూపర్ సెంచరీ చేసి ఆకట్టుకున్న నితీష్ కుమార్ రెడ్డి కి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బంపర్ బహుమతి ప్రకటించింది.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ నితీష్ కుమార్ రెడ్డికి నజరానా ప్రకటించారు. 25 లక్షల నగదు బహుమతి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున నితీష్ కుమార్ రెడ్డికి అందిస్తామని వెల్లడించారు. శనివారం విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు..” తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా ఆడాడు. మెల్బోర్న్ మైదానంలో తెలుగు కీర్తిని రెపరెపలాడించాడు. అతడు సెంచరీ చేయడం వల్లే టీమిండియా గట్టెక్కగలిగింది. అతడికి ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తాం. అతడు ఏం కోరుకుంటే అది ఇస్తాం. ప్రస్తుతానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున 25 లక్షల నగదు బహుమతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా నితీష్ కుమార్ రెడ్డికి అందిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఐపీఎల్ టీమ్ ను సిద్ధం చేస్తాం. అమరావతిలో ప్రపంచ స్థాయిలో క్రికెట్ మైదానాన్ని నిర్మిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడల విషయంలో ఎంతో ముందు చూపుతో ఉన్నారు.వంతు సహకారం అందిస్తానని ఇప్పటికే చెప్పారు. నితీష్ కుమార్ రెడ్డి లాంటి ఆటవాళ్లను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని” కేశినేని చిన్ని వివరించారు.