Surya Kumar Yadav : సూర్య కుమార్ యాదవ్ టెస్ట్ కలలు కల్లలు.. జట్టులోకి పునరాగమనం కష్టమేనా.. కారణమిదే

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలవాలని టీమిండియా భావిస్తోంది. ఇందులో భాగంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సరికొత్త ప్రణాళికలను అమలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే టెస్ట్ క్రికెట్ ఆడే ఆటగాళ్లు కచ్చితంగా దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటాలని నిబంధన విధించాడు. అందులో భాగంగానే త్వరలో దులీప్ ట్రోఫీ సరికొత్త విధానంలో నిర్వహించనున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 3, 2024 4:33 pm

Surya Kumar Yadav

Follow us on

Surya Kumar Yadav : సెప్టెంబర్ ఐదు నుంచి అనంతపురం వేదికగా దులీప్ ట్రోఫీ నిర్వహించనున్నారు. ప్రతీ మ్యాచ్ నాలుగు రోజులపాటు జరుగుతుంది. ఈ ట్రోఫీలో నాలుగు జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీకి ముందు టీమిండియా స్టార్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ బుచ్చిబాబు టోర్నమెంట్ లో ఆడాడు. ఆ టోర్నీలో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తమిళనాడు జట్టుతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో సూర్య కుమార్ యాదవ్ గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తుండగా అతడి చేతికి గాయమైంది. దీంతో అతడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ కారణంగా దులీప్ ట్రోఫీ ఓపెనింగ్ రౌండ్ కు అతడు దూరం కానున్నాడు. దులీప్ ట్రోఫీ లో ఇండియా – సీ జట్టుకు అతడు ఆడనున్నాడు. దులీప్ ట్రోఫీ లో భాగంగా ఇండియా – సీ జట్టు, ఇండియా – డీ జట్టుతో సెప్టెంబర్ ఐదు నుంచి 8 వరకు అనంతపురంలో మ్యాచ్ ఆడుతుంది.

సూర్య కుమార్ యాదవ్ గాయపడటంతో.. ఆ విషయాన్ని బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. గాయం వల్ల దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్ కు సూర్య కుమార్ యాదవ్ దూరం కానున్నాడు. ఫలితంగా టెస్ట్ క్రికెట్లోకి అతను రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సూర్య కుమార్ యాదవ్ లేకుండానే ప్రస్తుతం టీమిండియాలో మిడిల్ ఆర్డర్ లో చోటు సంపాదించుకునేందుకు ఆటగాళ్ల మధ్య విపరీతమైన పోటీ ఉంది. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ దులీప్ ట్రోఫీలో ఆడి, అంచనాలకు మించి రాణించినప్పటికీ అతడికి జట్టులో చోటు దక్కడం కష్టమే. మిడిల్ ఆర్డర్ లో ఎవర్ని ఎంపిక చేయాలో తెలియక జట్టు మేనేజ్మెంట్ తల పట్టుకుంటుంది. దులీప్ ట్రోఫీలో చూపించిన ప్రదర్శన ఆధారంగానే ఆటగాళ్లను బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా సిరీస్ లకు జట్టు మేనేజ్మెంట్ ఎంపిక చేయనుంది. బుమ్రా, విరాట్ కోహ్లీ, రోహిత్ మినహా మీద ఆటగాళ్లు మొత్తం దులీప్ ట్రోఫీ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దులీప్ ట్రోఫీ అనంతరం సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ జట్టుతో టీమిండియా తొలి టెస్ట్, సెప్టెంబర్ 27న రెండవ టెస్ట్ ఆడుతుంది. అక్టోబర్ 6, 9, 12 తేదీలలో టీమిండియా బంగ్లాదేశ్ తో మధ్య మూడు టి20 లు ఆడుతుంది. కాగా, శ్రీలంకతో వన్డే టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా కు దాదాపు నెల రోజులపాటు విశ్రాంతి లభించింది. కీలక ఆటగాళ్లు కుటుంబాలతో విహారయాత్రలకు వెళ్లి వచ్చారు.