WTC Final 2023 : డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో అశ్విన్ ను పక్కనపెట్టడం భారత్ కు లాభమా..? నష్టమా..?

అశ్విన్ ను ఆడించకపోవడం మంచిదంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో అశ్విన్ కంటే శార్దూల్ ఠాకూర్ బెటర్ ఛాయిస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Written By: NARESH, Updated On : June 7, 2023 9:38 pm
Follow us on

WTC Final 2023 : రవిచంద్రన్ అశ్విన్.. ఫార్మాట్ తో సంబంధం లేకుండా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఈ మధ్య కాలంలో సత్తా చాటుతున్న వెటరన్ ప్లేయర్. అటువంటి కీలక ప్లేయర్ కు ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ తుది జట్టులో అవకాశం కల్పించలేదు మేనేజ్మెంట్. దీనిపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ అశ్విన్ ను పిచ్ పరిస్థితి దృష్ట్యా తీసుకోలేకపోయామని మేనేజ్మెంట్ వివరణ ఇస్తున్నప్పటికీ, అభిమానులు మాత్రం ఆ వివరణ పట్ల సంతృప్తి చెందడం లేదు.

కీలక మ్యాచ్ ల్లో ఏ జట్టు అయినా కీలక ప్లేయర్లతో బరిలోకి దిగుతుంది. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగే జట్టు అయితే కీలక ప్లేయర్లు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంది. అయితే, వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ వంటి మ్యాచ్ లో మాత్రం అటువంటి ఆలోచన భారత జట్టు చేయలేదా..? అనే ప్రశ్నలు ఒక విషయంలో ఉత్పన్నమవుతున్నాయి. అదే రవిచంద్రన్ అశ్విన్ ను జట్టులోకి తీసుకోకపోవడంగా చెబుతున్నారు. కీలక మ్యాచ్ లో ఆల్ రౌండర్ అయిన అశ్విన్ ను విస్మరించడంపై వారు పెదవి విరుస్తున్నారు. మ్యాచ్ విన్నర్ ను ఎలా పక్కన పెడతారని కెప్టెన్, కోచ్ లను నిలదీస్తున్నారు. మ్యాచ్ స్టార్ట్ అయ్యాక పిచ్ పేసర్లకు సహకరించడం చూశాక కూడా అభిమానులు ఈ విషయాన్ని వదిలిపెట్టడం లేదు. సోషల్ మీడియా వేదికగా మేనేజ్మెంట్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు.

భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి..

అశ్విన్ ను జట్టులోకి తీసుకోకపోవడం పట్ల సమర్థిస్తున్న వారితోపాటు విమర్శస్తున్న వారు కూడా ఉన్నారు. దీనికి పలు విషయాలను కూడా విమర్శిస్తున్న వారు వెల్లడిస్తున్నారు. ఇంగ్లాండ్ లో అశ్విన్ ఆడిన దాదాపు ప్రతి మ్యాచ్ లో కూడా భారత జట్టు ఓడిపోయింది. ఇక్కడ అశ్విన్ ఆడిన ఏడు మ్యాచ్ ల్లో ఇండియా జట్టు ఏకంగా ఆరు మ్యాచ్ ల్లో ఓటమి పాలయింది. కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలుపొందింది. వీటిని ఉదహరిస్తూ అశ్విన్ అంటే గిట్టని వాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అశ్విన్ ను ఆడించకపోవడం మంచిదంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో అశ్విన్ కంటే శార్దూల్ ఠాకూర్ బెటర్ ఛాయిస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది ప్రస్తుత మ్యాచ్ పరిస్థితి..

ఇకపోతే మ్యాచ్ విషయానికి వస్తే బుధవారం మధ్యాహ్నం మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బుధవారం రెండో సెషన్ కొనసాగుతోంది. 170 పరుగులకు మూడు వికెట్లను ఆస్ట్రేలియా జట్టు నష్టపోయింది. ఇందులో డేవిడ్ వార్నర్ 60 బంతుల్లో 43 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఉస్మాన్ ఖవాజా పది బంతులు ఆడి డక్ అవుట్ అయ్యాడు. మార్నస్ లబుసేన్ 62 బంతుల్లో 26 పరుగులకు ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో స్టీవెన్ స్మిత్ 102 బంతుల్లో 33 పరుగులు, ట్రావిస్ హెడ్ 75 బంతుల్లో 60 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత జట్టు బౌలర్లలో మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, షార్ధూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.