Pakistan Super League: డబ్బుకు డబ్బు.. గౌరవానికి గౌరవం.. హోదాకు హోదా.. ఇలా అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రపంచ జట్ల క్రికెటర్లు ఐపీఎల్ ఆడేందుకు ఇష్టాన్ని చేపిస్తుంటారు. అందువల్లే ఐపిఎల్ ఈ స్థాయిలో ఎదిగింది. ఇంకా తన బ్రాండ్ వేల్యూ ను పెంచుకుంటున్నది.
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఐపీఎల్ ను చూసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పిఎస్ఎల్ ను తెరపైకి తీసుకొచ్చింది. బిసిసిఐ మాదిరిగానే విదేశీ ప్లేయర్లను ఆడాలని కోరింది. మొదట్లో పాకిస్తాన్ సూపర్ లీగ్ కొంచెం మెరుగ్గానే ఉండేది. ఆ తర్వాత నానాటికి తీసి కట్టుగా పరిస్థితి మారిపోయింది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ ఈ సీజన్ ప్రారంభానికి ముందే విదేశీ ప్లేయర్లు వరుసగా షాక్ ఇస్తున్నారు. మార్చి 26న పాకిస్తాన్ సూపర్ లీగ్ 11వ సీజన్ మొదలు కావలసి ఉంది. అయితే ఈ టోర్నీకి కొద్దిరోజుల గడువు ఉందనగా.. వ్యక్తిగత కారణాలవల్ల ఏకంగా ఎనిమిది మంది ఫారిన్ ప్లేయర్లు తప్పుకున్నారు. ఇది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు పెద్ద తలనొప్పిగా మారింది. ఒకప్పుడు ఐపీఎల్ తో పోటీ పడతామని చెప్పిన పాకిస్తాన్ క్రికెట్ పెద్దలు.. ఇప్పుడు తలవంచుకున్నారు. అంతేకాదు ఉన్న ప్లేయర్లను కాపాడుకుంటే చాలని భావిస్తున్నారు.
వదిలేసిన ప్లేయర్లు వీళ్లే
ఆస్ట్రేలియా యంగ్ ఆటగాడు మెక్ గుర్క్ రావల్పిండి జట్టు తరుపున ఆడాల్సి ఉండేది. అయితే అతడు వ్యక్తిగత కారణాలను చూపుతూ తప్పుకున్నాడు. స్పెన్సర్ జాన్సన్ కూడా లీగ్ నుంచి తప్పుకున్నాడు. ఇతడు క్వెట్టా గ్లాడియేటర్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక వెస్టిండీస్ ప్లేయర్లు జాన్సన్ చార్లెస్.. మోటి కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి తప్పుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్ మీల్స్, జింబాబ్వే బౌలర్ ముజరబాని, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ గురుబాజ్, దక్షిణాఫ్రికా ప్లేయర్ బార్ట్ మన్ కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి తప్పుకున్నారు.
కారణం అదేనా
ఇంతమంది ఫారిన్ ప్లేయర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం ఐపీఎల్లో వచ్చే ఆదాయం. ఐపీఎల్ లో రీప్లేస్మెంట్ ప్లేయర్గా వెళ్తే బీభత్సమైన ఆదాయం వస్తుంది. ఉదాహరణకు ముజరబాని కోల్ కతా జట్టులో చేరాడు. షనక రాజస్థాన్ జట్టు పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు. ఐపీఎల్ నుంచి పిలుపు వస్తే చాలు చాలామంది ప్లేయర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఒప్పందాలను పక్కన పెడుతున్నారు. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ కళ తప్పుతోంది.
ఈ పరిణామంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నక్వి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫారిన్ ప్లేయర్లు ఒప్పందాలను పక్కనపెట్టి ఐపీఎల్లో ఆడేందుకు వెళ్లడం పట్ల ఆయన మండిపడుతున్నారు. ప్లేయర్ల మీద న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. గతంలో బాష్ అనే అనే దక్షిణాఫ్రికా ఆటగాడు మీద పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకుంది. నాటి చర్యలను ఇప్పుడు ఈ ప్లేయర్ల మీద కూడా అమలు చేస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హెచ్చరిస్తోంది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బెదిరింపులను ఫారం ప్లేయర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మరోవైపు ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో.. ఫారిన్ ప్లేయర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడేందుకు భయపడుతున్నారని తెలుస్తోంది.