IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించి రి టెన్షన్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. గురువారం సాయంత్రం ఆయా జట్లు తమ లిస్టును బీసీసీఐకి అందించాయి. వీరిలో కొందరు ఆటగాళ్లు జాక్ పాట్ కొట్టేశారు. వాస్తవానికి వారు సమర్థవంతమైన ఆటగాళ్లు అయినప్పటికీ ఫీజు చెల్లింపు విషయంలో ఫ్రాంచైజీలు గతంలో అంతగా ఆసక్తి చూపించలేదు. దీంతో వారు లక్షలకు మాత్రమే పరిమితమయ్యారు. గత సీజన్లో వారు అద్భుతమైన ప్రతిభ చూపడంతో.. ఈసారి వారిని ఆయా జట్ల యజమాన్యాలు భారీ ధరకు కొనుగోలు చేశాయి. దీంతో ఆ ఆటగాళ్లు ఒక్కసారిగా కోటీశ్వరులుగా మారిపోయారు. ఈ జాబితాలో ఉన్న ఆటగాళ్ల వివరాలను ఒకసారి పరిశీలిస్తే..
కోటీశ్వరులుగా మారారు..
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వికెట్ కీపర్ గా ధ్రువ్ జూరెల్ కు గతంలో 20 లక్షలు చెల్లించారు. ఈసారి అతడికి ఏకంగా 14 కోట్లు ఇచ్చి, రాజస్థాన్ జట్టు రిటైన్ చేసుకుంది. ఈసారి అతడి ఫీజు ఏకంగా 6,900% పెరిగింది. మాయాంక్ యాదవ్ కు గతంలో లక్నో జట్టు 20 లక్షలు ఇవ్వగా.. ఈసారి ఏకంగా 11 కోట్లతో రిటైన్ చేసుకుంది.. ఈసారి అతని ఫీజు 5,400 శాతం పెరిగింది. మతిష పతీరణకు గతంలో చెన్నై జట్టు 20 లక్షలు చెల్లించగా.. ఇప్పుడు ఏకంగా 13 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకుంది.. ఈ సీజన్లో అతడి ఫీజు ఏకంగా 6,400% పెరిగింది. బెంగళూరు జట్టు గతంలో రజత్ పాటిదార్ కు 20 లక్షలు చెల్లించింది. అయితే ఈసారి 11 కోట్లు ఇచ్చి తన వద్ద ఉంచుకుంది. అతడి ఫీజు ఏకంగా 5,400% పెరిగింది. సాయి సుదర్శన్ అనే ఆటగాడికి గతంలో గుజరాత్ జట్టు 20 లక్షలు చెల్లించగా.. ఈసారి ఏకంగా 8.50 కోట్లు ఇచ్చి తన వద్ద ఉంచుకుంది. మొత్తంగా అతడు ఫీజు 4,150 శాతం పెరిగింది.. పంజాబ్ జట్టు గతంలో శశాంక్ సింగ్ కు 20 లక్షలు చెల్లించగా.. ఇప్పుడు ఏకంగా 5.50 కోట్లు ఇచ్చింది. అతడి ఫీజు ఏకంగా 2,650 శాతం పెరిగింది. అయితే ఈ జాబితాలో జాక్ పాట్ కొట్టిన ఆటగాడిగా ధృవ్ జురెల్ కు దక్కింది. అతడి ఫీజు గతంతో పోల్చితే ఏకంగా 6,900 శాతం పెరగడం విశేషం. ఆ తర్వాత స్థానంలో మతీష పతీరణ 6,400%తో రెండవ స్థానంలో ఉన్నాడు. రజత్ పాటిదార్, మాయాంక్ యాదవ్, సాయి సుదర్శన్, శశాంక్ సింగ్ తర్వాతి స్థానాలలో ఉన్నారు. అయితే ఈ ఆటగాళ్లు గత ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన చూపించిన నేపథ్యంలో.. వారికి ఈసారి భారీగా ఫీజు పెరిగింది.