Nara Lokesh: వైసిపి ప్రభుత్వ హయాంలో టిడిపి నేతలను వెంటాడారు. వేటాడినంత ప్రయత్నం చేశారు. కొందరు వైసీపీ నేతలు అదే పనిగా మాటల దాడిని కొనసాగించారు. కొందరు పోలీస్ అధికారులు అయితే వైసిపి కార్యకర్తలుగా మారిపోయారు. అయితే ఎన్నికలకు ముందు బాధితులుగా మిగిలిన పార్టీ నేతలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో.. లోకేష్ కీలక ప్రకటనలు చేశారు. తప్పులకు పాల్పడుతున్న వైసీపీ నేతలతో పాటు అధికారుల పేర్లు రాసుకుంటున్నానని.. రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నానని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పని పడతామని హెచ్చరించారు. అందుకు తగ్గట్టుగానే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి హయాంలో దూకుడుగా వ్యవహరించిన నేతలు టార్గెట్ అయ్యారు. అప్పట్లో తప్పిదాలకు పాల్పడిన అధికారుల సైతం మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పటికే రెడ్ బుక్ చాప్టర్ 1, చాప్టర్ 2 లో చుక్కలు చూపించారు లోకేష్. ఇప్పుడు చాప్టర్ 3 అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు లోకేష్. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా, పారిశ్రామికవేత్తలను ఏపీకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను కలిసి ఏపీకి ఆహ్వానిస్తున్నారు.ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, టెస్లా వంటి సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు లోకేష్. అదే సమయంలో టిడిపి ఎన్నారై నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంగా గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఎదురైన ఇబ్బందులను గుర్తు చేస్తున్నారు. తనతో పాటు పార్టీ శ్రేణులను ఇబ్బందులు పెట్టిన వారిని విడిచి పెట్టేది లేదని తేల్చి చెబుతున్నారు.
* త్వరలో ఓపెన్
త్వరలో రెడ్ బుక్ చాఫ్టర్ 3 ని ఓపెన్ చేస్తామని ప్రకటించారు నారా లోకేష్. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామన్నారు. గతంలో వైసిపి పాలనలో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే లుక్ అవుట్ నోటీసులు ఇచ్చే వారిని.. కానీ నోటీసులకు భయపడకుండా ఎన్నారైలు నిలబడ్డారని గుర్తు చేశారు. అటువంటి వారిపై ప్రశంసలు కురిపించారు. అప్పట్లో ఎన్నారై లను టార్గెట్గా చేసుకున్న వారికి రెడ్ బుక్ చాఫ్టర్ 3 లో సమాధానం ఇస్తామని తేల్చి చెప్పారు లోకేష్. అంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీస్ అధికారులు అతిగా వ్యవహరించారు. అటువంటి వారిపై ఇప్పుడు టార్గెట్ చేయనున్నారు అన్నమాట.
* తెరపైకి పాత కేసులు
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పాత కేసులు తెరపైకి వచ్చాయి. వాటిపై విచారణ కొనసాగుతోంది. టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి, చంద్రబాబు ఇంటిపై దండయాత్ర, ముంబై నటిపై అక్రమ కేసులు.. ఇలా ఒకటేమిటి అన్ని రకాల కేసులు తెరపైకి వచ్చాయి. చివరకు వైసీపీ హయాంలో అసభ్యంగా మాట్లాడిన వారిని సైతం వెంటాడిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఇటువంటి సమయంలోనే లోకేష్ రెడ్బుక్ చాప్టర్ 3 ప్రస్తావన తేవడం విశేషం.