
ప్రతీ ఐపీఎల్ లోనూ ఓటములతో సాగి ఐపీఎల్ కప్ నకు అందనంత దూరంలో ఉంటోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. టీమిండియా కెప్టెన్ కోహ్లీ కెప్టెన్సీ ఉన్నా కూడీ ఈ బెంగళూరు టీం ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడలేదు. కానీ ఈసారి జోరుమీదుంది. వరుస విజయాలతో అందరికంటే బెంగళూరు ముందుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నైలో తొలి మూడు మ్యాచ్ లను గెలిచి సత్తా చాటింది. ఐపిఎల్ 2021 లో ఇంతవరకు ఓటమి ఎరుగని జట్టుగా అజేయంగా ఉంది. ఇన్నాళ్లు చెన్నైలో ఆడిన బెంగళూరు ఇప్పుడు వాంఖడే స్టేడియంలో తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్‌తో మొదటి మ్యాచ్ కు కోహ్లీ సేన సిద్ధమైంది. ఇక రాజస్థాన్ జట్టు తడబడుతోంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఒకదాన్ని మాత్రమే వీరు గెలిచారు. ఈరోజు మరొక విజయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
-విదేశీ ఆటగాళ్ల వైదొలగడంతో రాజస్థాన్ రాయల్స్ ఇబ్బంది
గాయం కారణంగా కీలక బౌలర్ జోఫ్రా ఆర్చర్ అందుబాటులో లేకుండా పోయాడు. ఇక తొలి మ్యాచ్ లో క్యాచ్ అందుకుంటూ వేలు విరగగొట్టకొని కీలక ఆల్ రౌంటర్ బెన్ స్టోక్స్ రాజస్థాన్ టీం నుంచి వైదొలిగాడు. శస్త్రచికిత్స కోసం రాజస్థాన్ ను వదిలేసి ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. ఇప్పుడు మరో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్స్టన్ బయో-బబుల్ తో ఆటను ఆడలేనని చెబుతూ ఐపీఎల్ లీగ్ నుండి నిష్క్రమించాడు. ఈ విధంగా, రాజస్థాన్ కు ఇప్పుడు ఐదుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. జోస్ బట్లర్, క్రిస్ మోరిస్ మరియు డేవిడ్ మిల్లెర్ ఖచ్చితంగా ఆడతారు. ఇక మరో స్థానంలో ఆండ్రూ టై లేదా ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆడుతారు. రాజస్థాన్ డెత్ బౌలింగ్ ఏమాత్రం బాగుండడం లేదు. బెంగళూరుతో మ్యాచ్ లో ఇలానే కొనసాగిస్తే, వారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఏదేమైనా, బ్యాటింగ్ చాలా బాగా కనిపిస్తున్నా.. వారి టాప్-ఆర్డర్ బ్యాట్స్ మెన్ నుండి పెద్ద స్కోరు లభించడం లేదు.
-భీకరంగా కనిపిస్తున్న బెంగళూరు
బెంగళూరు టీం గతంలో కంటే బలంగా తయారైంది.. హ్యాట్రిక్ విజయాల వారిని ఇప్పటికే టైటిల్ రేసులో నిలిపాయి. గ్లెన్ మాక్స్వెల్ మరియు ఎబి డివిలియర్స్ భీకర ఫాంలో ఉండడం బెంగళూరుకు కలిసివస్తోంది. బెంగళూరు బ్యాటింగ్ బలంగా కనిపిస్తుంది. సిరాజ్, చాహల్, హర్షల్ పటేల్‌లతో కూడా బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. వాంఖడే పిచ్ బెంగళూరు బ్యాటింగ్ శైలికి సరిగ్గా సరిపోతుంది. అందువల్ల వారు ఈ మైదానంలో రెచ్చిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ రాత్రికి ఎక్కువ స్కోరింగ్ మ్యాచ్ ను ఆశించవచ్చు.
ఐపీఎల్ చరిత్రలో: 23 మ్యాచ్‌ల్లో ఈ రెండు టీంలు తలపడ్డాయి. బెంళూరు, రాజస్థాన్ లు చెరో 10 మ్యాచ్‌లు గెలిచాయి. మూడు ఆటలు ఫలితం లేకుండా ముగిశాయి.
మ్యాచ్ వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై.
మ్యాచ్ సమయం: సాయంత్రం 07.30 PM