IPL Players Team India : బౌలర్ ఎవరనేది లెక్క పెట్టలేదు. పిచ్ ఎలాంటిదనేది చూడలేదు. దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. పరుగుల వరద పారించారు. ఇక కొంతమంది బౌలర్లు వికెట్లను పడగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు. మొత్తంగా ఐపీఎల్లో సిసలైన ప్లేయర్లుగా నిలిచారు. త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి అడుగులు వేస్తున్నారు.
ప్రతి సీజన్లో ఐపిఎల్ పూర్తయిన తర్వాత కొంతమంది భవిష్యత్తు ఆటగాళ్లు వెలుగులోకి వస్తారు. వారి ప్రతిభను గుర్తించిన మేనేజ్మెంట్ అవకాశాలు కల్పిస్తుంది. ఇక ఈసారి కూడా టాలెంటెడ్ ప్లేయర్లు వెలుగులోకి వచ్చారు. వారి ప్రతిభ ఈసారి అనితరసాధ్యంగా.. అనన్య సామాన్యంగా కనిపించింది. అందువల్లే వారికి జాతీయ జట్టులో చోటు లభించే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆటగాళ్లు ఎవరంటే..
1.వైభవ్ (రాజస్థాన్ రాయల్స్)
అత్యంత చిన్న వయసులో ఐపీఎల్ లో ప్రవేశించి రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ జట్టులో ఓపెనర్ గా రంగంలోకి దిగి అదరగొట్టాడు. ఏడు ఇన్నింగ్స్లలో 252 రన్స్ చేశాడు. అతడు స్ట్రైక్ రేట్ 206.50. గిల్ జట్టుపై ఏకంగా శతకం చేశాడు. స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ పురస్కారం కూడా దక్కించుకున్నాడు. అండర్ 19 లో చోటు సొంతం చేసుకున్నాడు.
2.ప్రియాన్ష్ ఆర్య
పంజాబ్ జట్టు తరఫున సింహం లాగా ఆడాడు ప్రియాన్ష్ ఆర్య. తొలి సీజన్లోనే మెరుపు బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. సిసలైన ఓపెనర్ గా పేరు తెచ్చుకున్నాడు.. చెన్నై జట్టుపై 39 బాల్స్ లోనే శతకం సాధించాడు.. 17 ఇన్నింగ్స్ లలో 475 పరుగులు చేశాడు. భవిష్యత్తు ఆశా కిరణంగా కనిపిస్తున్నాడు.
3.దిగ్వేష్ రాటి
లక్నో జట్టు తరఫున రంగంలోకి దిగిన ఈ మిస్టరీ స్పిన్ బౌలర్ ఒక రేంజ్ లో బౌలింగ్ చేసాడు. 13 మ్యాచ్లలో 14 వికెట్లు సొంతం చేసుకున్నాడు. 8.25 ఎకానమీతో సరికొత్త రికార్డు సృష్టించాడు.. ముఖ్యంగా అతడు సిగ్నేచర్ యాటిట్యూడ్ చాలామందిని ఆకట్టుకుంది. బహుశా అతడిని జాతీయ జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
4.యష్ దయాళ్
కన్నడ జట్టు లో ఈసారి అదిరిపోయే రేంజ్ లో బౌలింగ్ వేసాడు ఇతడు. ఎడమ చేతి వాటంతో వేగంగా బంతులు వేసి ఆకట్టుకున్నాడు.. ముఖ్యంగా తొలి, చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ వేసి అదరగొట్టాడు.. 2022 ఐపీఎల్ సీజన్లో తొమ్మిది మ్యాచ్ లు ఆడిన యష్ దయాళ్ 11 వికెట్స్ సొంతం చేసుకున్నాడు. 2024 సీజన్లో 15 వికెట్లు పడగొట్టాడు. ఇక ప్రస్తుత సీజన్లో 15 మ్యాచ్లు ఆడి 13 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
5.ప్రభ్ సిమ్రాన్ సింగ్
పంజాబ్ జట్టు తరఫున ఓపెనర్ గా ప్రభ్ సిమ్రాన్ సింగ్ బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. 17 మ్యాచ్లలో 549 రన్స్ చేశాడు. 160.53 సగటు నమోదు చేశాడు. ఈ సీజన్లో అతడు 4 అర్థ శతకాలు సాధించాడు. గత సీజన్లో అతడు 334 పరుగులు చేశాడు.. మొత్తంగా అతడికి త్వరలోనే జాతీయ జట్టులో అవకాశం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది.