IPL Owners Meeting: వారంతా పెద్దపెద్ద కార్పొరేట్లు. వేలకోట్ల ఆస్తిపరులు. అదే స్థాయిలో ఉద్యోగులకు యజమానులు. క్రికెట్ వల్ల ఆదాయం వస్తున్న నేపథ్యంలో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కొన్ని సంవత్సరాలుగా కాసుల పంట పండించుకుంటున్నారు. క్రికెట్ ను కాస్తా క్యాష్ రీచ్ లీగ్ గా మార్చేశారు. జెంటిల్మెన్ గేమ్ ను కార్పొరేట్ ఆటగా రూపాంతరం చెందించారు. చివరికి ఎలా ఆడాలో ఆటగాళ్లకు ముందే చెప్తున్నారు. విఫలమైన ఆటగాళ్లకు అందరి ముందే క్లాస్ (కేఎల్ రాహుల్, సంజీవ్ గొయెంకా ఎపిసోడ్) తీసుకుంటున్నారు. ఈ విషయాలు ఎలా ఉన్నా సరే క్రమశిక్షణ విషయంలో కార్పొరేట్లు కాస్త పద్ధతి పాటించాలి. హుందాగా వ్యవహరించాలి. కానీ కట్టు తప్పారు. ఒకరినొకరు దూషించుకున్నారు.. ఒకానొక దశలో సహనం కోల్పోయి ఏవేవో మాటలు అనుకున్నారు. ఇంత జరిగిన తర్వాత వచ్చే సీజన్ ఐపీఎల్ నిర్వహణ సాధ్యమేనా? అనే అనుమానం సగటు క్రికెట్ అభిమానిలో వ్యక్తమవుతోంది.
అసంపూర్తిగా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇష్టం 10 ఫ్రాంచైజీ జట్లు ఉన్నాయి. వీటిని ఐపీఎల్ పాలకమండలి నియంత్రిస్తుంది. వచ్చే సీజన్ కు సంబంధించి ఐపీఎల్ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశం అసంపూర్తిగా ముగిసిందని ప్రముఖ క్రీడా వెబ్ సైట్ క్రిక్ బజ్(cricbuzz) పేర్కొంది. ముంబై వేదికగా జరిగిన ఈ సమావేశం లో ప్రధానంగా మెగా వేలం, రిటెన్షన్, ఇంపాక్ట్ విధానంపై ఆయా జట్ల యజమానులు చర్చలు జరిపారు. అయితే దీనిపై బీసీసీఐ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరోసారి భేటీలో వీటిపై ఒక స్పష్టత వస్తుందని తెలుస్తున్నాయి. మెగా వేలం విషయంలో యాజమాన్యాలు ఆసక్తిగా లేవని, కోల్ కతా యజమాని షారుక్ ఖాన్ దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అతడికి సన్ రైజర్స్ హైదరాబాద్ (sunrisers Hyderabad) యాజమాన్యం మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది..
వాగ్వాదం
ఈ సమావేశంలో పంజాబ్ కింగ్స్ యజమాని నెస్ వాడియా, కోల్ కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్ పరస్పరం తిట్టుకున్నారని తెలుస్తోంది. ఇద్దరు తమ స్థాయి మర్చిపోయి దూషణల పర్వం సాగించారని, ఒకానొక దశలో సమావేశం నుంచి బయటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. వారిద్దరిని అదుపు చేసేందుకు ఐపీఎల్ పెద్దలు తీవ్రంగా ప్రయత్నించినట్టు తెలుస్తోంది..” రీ టెన్షన్ పై చర్చ సాగింది. షారుక్ ఖాన్ వీలైనంత ఎక్కువ మందిని చేసుకునే అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. నెస్ వాడియా మాత్రం ఒప్పుకోలేదు. ఆయన మెగా వేలం నిర్వహించాలని బలంగా కోరారు. ఇదే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఒకానొక దశలో సమావేశం నుంచి వారిద్దరూ బయటికి వెళ్ళేందుకు నిర్ణయించుకున్నారని” స్పోర్ట్స్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
నిర్వహిస్తారా?
ఆటగాళ్లను రిటైన్ చేసుకునే నిబంధనకు సంబంధించి జట్ల యాజమాన్యాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో వచ్చే సీజన్ ఉంటుందా? లేదా? అనే అనుమానం అభిమానుల్లో వ్యక్తమౌతోంది. వాస్తవానికి ఈ నిబంధనకు సంబంధించి గతంలో చర్చ స్వల్ప స్థాయిలోనే జరిగేది. కానీ ఈసారి ఐపీఎల్ నిర్వాహక కమిటీ ముంబైలో భారీ ఎత్తున సమావేశం నిర్వహించడం, అందులో ఫ్రాంచైజీ జట్లు పంతాలకు పోవడంతో.. వచ్చే సీజన్ ఉంటుందా? లేదా? అనే అనుమానం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. “మెగా వేలం పై ఒక నిర్ణయం జరగాలి. అప్పుడే రిటెన్షన్ పై స్పష్టత వస్తుంది. వేలం వద్దని బీసీసీఐ అనుకుంటే రిటెన్షన్ అవసరం దాదాపుగా ఉండదు. రిటైన్ విధానంపై ఎక్కువ శాతం యాజమాన్యాలు అనుకూలంగా ఉన్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ విధానంపై కూడా యాజమాన్యాలు సవరింపు విధానాలను కోరుతున్నాయి. ఇవన్నీ జరగాలంటే చాలా సమయం పడుతుంది. అంటే ఐపీఎల్ నిర్వహణ కమిటీ మరిన్ని భేటీలు నిర్వహించాల్సి ఉంది. అది ఎప్పటిలోగా సాధ్యమవుతుందో ఇప్పుడే చెప్పడం కష్టమని” క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇన్ని పరిణామాల మధ్య వచ్చే సీజన్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.