IPL Mega Auction 2025: చెన్నై జట్టు ఐపీఎల్లో ఐదుసార్లు విజేతగా నిలిచింది. 2023 సీజన్లో గుజరాత్ జట్టును ఫైనల్లో ఓడించి ట్రోఫీని దక్కించుకుంది. ఇక గత సీజన్లో ధోని తన నాయకత్వ బాధ్యత నుంచి తప్పుకున్నాడు. రుతు రాజ్ గైక్వాడ్ కు తన స్థానాన్ని అప్పగించాడు. అయితే గత సీజన్లో చెన్నై జట్టు తన స్థాయికి తగ్గట్టు ఆట తీరు ప్రదర్శించలేదు. అందువల్లే చెన్నై జట్టు విజేతగా నిలువలేకపోయింది. అయితే వచ్చే సీజన్లో తన స్థాయిని ప్రదర్శించాలని చెన్నై జట్టు భావిస్తున్నది. ఈ క్రమంలోనే భారం అనుకున్న ఆటగాళ్లను పక్కన పెట్టింది. పనికి వస్తారనుకున్న ప్లేయర్లను అంటిపెట్టుకుంది. అందువల్ల వేలంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే ఓ పంతొమ్మిది సంవత్సరాల ఆటగాడి విషయంలో చెన్నై జట్టు సాహసమే చేసింది. వేగంగా అతనికోసం 10 కోట్లు ఖర్చుపెట్టింది. అతడు ఆడింది 23 మ్యాచ్ లు మాత్రమే. అయినప్పటికీ అంతటి ధైర్యానికి ఒడిగట్టింది.
చైనా మన్ బౌలర్
అతడి పేరు నూర్ అహ్మద్.. ఆఫ్ఘనిస్తాన్ అతడి మాతృదేశం.. ఎడమచేతి వాటం స్పిన్ బౌలర్ గా అతడు పేరుగాంచాడు. ఆ దేశ క్రికెట్ అభిమానులు అతడిని ప్రేమగా చైనామన్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే అతని యాక్షన్ కులదీప్ యాదవ్ లాగానే ఉంటుంది. 2023లో ఐపీఎల్లోకి అతడు ప్రవేశించాడు. గుజరాత్ జట్టుతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. నిన్నటి వరకు అతడు ఆ జట్టుతోనే తన బంధాన్ని పెనవేసుకున్నాడు. అయితే ఇటీవల ఆ జట్టు అతడిని రిలీజ్ చేసింది. అతడి బౌలింగ్ నైపుణ్యాన్ని గుర్తించి చెన్నై జట్టు కొనుగోలు చేసింది. అతడికి రెండు సీజన్ల అనుభవం మాత్రమే ఉన్నప్పటికీ 10 కోట్లు కోట్ చేసింది చెన్నై జట్టు. 2023లో నూర్ అహ్మద్ 16 వికెట్లు సాధించాడు. 2024లో 8 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు అతడు 23 మ్యాచ్ లు ఆడాడు. ఏకంగా 24 వికెట్లు పడగొట్టాడు. 3/37 బౌలింగ్ తో అద్భుతమైన గణాంకాలను తన పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నాడు.. అంతేకాదు గ్రౌండ్లో నూర్ అహ్మద్ చురుకుగా కదులుతాడు. గుజరాత్ జట్టు తరఫున అతడు అద్భుతమైన క్యాచ్లు పట్టాడు. ఇక టి20 ఇంటర్నేషనల్ విషయానికి వస్తే 14 మ్యాచులు ఆడాడు. పది పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు. వన్డేల లోనూ 10 మ్యాచ్లు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. అద్భుతమైన స్పిన్ బౌలింగ్ వేయడం ఇతడి నైజం. మెలికలు తిప్పే బంతులు వేస్తూ బ్యాటర్లను తికమక పెట్టగలడు. ఒత్తిడికి గురిచేసి అవుట్ చేయగలడు. అతని నైపుణ్యాన్ని గుర్తించి చెన్నై జట్టు ఏకంగా 10 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చింది.