IPL Final Mania : ఐపీఎల్ ఫైనల్ మేనియా మొదలైంది. గుజరాత్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ జరుగబోతోంది. ఈ ఫైనల్ ను బీసీసీఐ అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. కరోనాతో రెండేళ్లుగా వేడుకలు ఏమీ లేకుండా చప్పగా సాగించిన ఐపీఎల్ ను ఈసారి ఫైనల్ ను అంతకుమించిన లెవల్ లో నిర్వహిస్తున్నారు.
కరోనా ఆంక్షలను అధిగమించేసి తాజాగా ఐపీఎల్ ఫైనల్ జరిగే ప్రపంచంలోనే అతిపెద్ద నరేంద్రమోడీ స్టేడియంలో ఏకంగా 1.10 లక్షల మంది ప్రజలను అనుమతించారు. వీరందరి సమక్షంలో ఈ గోలగోల సందడి నడుమ ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.
విశేషం ఏంటంటే ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కాబోతున్నారు. ఇక బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా సహా బాలీవుడ్ హీరోలు రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్ సహా ఎంతో మంది ప్రముఖులు వచ్చారు.
ఐపీఎల్ ఫైనల్ కు ముందు పాటలతో డ్యాన్సులు, సంగీత కచేరి నిర్వహించారు. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ డ్యాన్స్ చేసి లక్ష మంది ప్రజలను అలరించారు. అనంతరం రెహమాన్ తన సంగీత కచేరితో మనసు దోచేశారు.
గుజరాత్, రాజస్థాన్ జట్లు ఈ ఐపీఎల్ ఫైనల్ లో తలపడుతున్నాయి. ఇప్పటికే క్వాలిఫైయర్ లో రాజస్థాన్ ను గుజరాత్ ఓడించింది. ఇప్పుడు బెంగళూరును మరో క్వాలిఫైయర్ లో ఓడించి మరీ రాజస్థాన్ ఫైనల్ చేరింది. తమను ఓడించిన గుజరాత్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీ అయ్యింది. మరి.. ఈ ఫైనల్ లో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తి రేపుతోంది. దేశమంతా ఇప్పుడు ఈ ఐపీఎల్ ఫైనల్ కోసం టీవీలకు అతుక్కుపోతున్నారు.