https://oktelugu.com/

Liquor: మందుబాబులకు భారీ షాక్.. కంగారు పెడుతున్న కొత్త రూల్

 బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే ఉపేక్షించేది లేదని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని, జనజీవనానికి ఆటంకం కలిగించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

Written By: Rocky, Updated On : November 19, 2024 10:14 pm
Liquor

Liquor

Follow us on

Liquor: నేటి సమాజంలో మందుతాగడం ఫ్యాషన్‌గా మారింది. ఆఫీస్ పార్టీలైనా, ఇంట్లో వేడుకలైనా మందు లేకుండా ఏ కార్యక్రమం జరుగదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు వీకెండ్ వచ్చిందంటే చాలు కొందరు మందు పార్టీ కంపల్సరీ చేసుకుంటారు. అయితే అతిగా మద్యం సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ, చాలా మంది వ్యక్తులు మద్యం తాగడం మాత్రం మానుకోవడం లేదు.

సంతోషం, దుఃఖం, విజయాలు, ఓటములు, ఉద్యోగం రావడం, ఉద్యోగం పోగొట్టుకోవడం, పదోన్నతి, పెళ్లి, విడాకులు, పుట్టిన రోజు, డిసెంబర్ 31 వేడుకలు ఇలా ఏ సందర్భమైనా మద్యం పార్టీతో జరుపుకోవడం యువతలో సర్వసాధారణమైపోయింది. ఈ ఆల్కహాల్ కల్చర్ కేవలం యువతతోనే ఆగడం లేదు.. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. ఏ సందర్భమైనా, పార్టీ అంటే ముందుగా “మందు” ఉండాల్సిందే. తమ ఆర్థిక స్థాయిని బట్టి ఇలా మద్యం పార్టీలు నిర్వహిస్తుంటారు. కొందరు మరో అడుగు ముందుకేసి బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లపై, పార్కుల్లో లేదా శివారు ప్రాంతాల్లో మద్యం సేవించి హింసాత్మక ఘటనలకు కారణం అవుతున్నారు. మద్యం మత్తులో గొడవలు, అసాంఘిక కార్యకలాపాలు, జనజీవనానికి అడ్డంకులు కలిగిస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి.

ఇది పరిమితికి మించి జరుగుతోందని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే ఉపేక్షించేది లేదని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని, జనజీవనానికి ఆటంకం కలిగించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గత 24 గంటల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బహిరంగంగా మద్యం సేవించినందుకు 85 కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనం నడిపిన 16 మందిపై కేసులు పెట్టారు. రోడ్డు భద్రత ఉల్లంఘనలపై 584 కేసులు నమోదు చేసి రూ.1,29,650 జరిమానా విధించారు.

ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టి, అనుమానాస్పదంగా సంచరిస్తున్న 98 మందిని తనిఖీ చేశారు. వారిలో నలుగురిని స్టేషన్‌కు తరలించారు. 154 ఏటీఎంలను రాత్రి ఏటీఎం సెంటర్ల భద్రత కోసం తనిఖీ చేశారు. ఎస్పీ హెచ్చరిక.. రోడ్లు, ఫుట్‌పాత్‌లు, పార్కులు, వ్యాపార ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో మద్యం తాగి పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు. ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలపై కఠిన పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పారు. మద్యం వ్యసనం వ్యక్తిగత జీవితానికే కాకుండా సమాజానికి కూడా హానికరం కాబట్టి వాటిపై కఠిన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎస్పీ హెచ్చరించారు.