
నాలుగు పరాజయాలతో అట్టడుగున ఉన్న మన సన్ రైజర్స్ హైదరాబాద్ తో నాలుగు వరుస విజయాలు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సాయంత్రం తలపడబోతోంది. రెట్టించిన ఉత్సాహంతో చెన్నై ఉండగా.. వరుస పరాజయాలతో అస్తవ్యస్తంగా హైదరాబాద్ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన ఐదు మ్యాచ్ లలో నాలుగు ఓడిపోయింది. విశ్వాసం సన్నగిల్లింది. ఈ రెండు జట్లు ఈ రాత్రి కొత్త వేదికపై తొలి మ్యాచ్ ఆడబోతున్నాయి. కొత్త వేధిక ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడనున్నాయి. చెన్నై మందకొడి స్పిన్ పిచ్ పై సరిగ్గా ఆడలేని సన్ రైజర్స్ ఇప్పుడు ఢిల్లీలోనైనా సత్తా చాటుతుందా? లేదా అన్నది వేచిచూడాలి. ఈ వేదికపై ఈ సీజన్ లో జరిగే మొదటి మ్యాచ్ ఇదే కావడం విశేషం..
-సన్ రైజర్స్ తిరిగి పుంజుకుంటుందా?
సన్ రైజర్ హైదరాబాద్ వారి మొదటి ఐదు మ్యాచ్ లను చెన్నైలో ఆడింది. వాటిలో నాలుగు ఓడిపోయింది. చెన్నై పిచ్ సన్‌రైజర్స్‌కు సరిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. టాప్-ఆర్డర్ వార్నర్, విలియమ్సన్ మరియు బైర్‌స్టో వంటి వారితో దుర్భేద్యంగా బ్యాటింగ్ కనిపిస్తున్నప్పటికీ మిడిల్-ఆర్డర్ ఇప్పటికీ సన్ రైజర్స్ ను చావుదెబ్బతీస్తోంది. కుప్పకూలి మ్యాచ్ లు ఓడిపోయేలా చేస్తోంది. మిడిల్ ఆర్డర్ వైఫల్యం కారణంగానే నాలుగు మ్యాచ్ లను సన్ రైజర్స్ కోల్పోయింది. భువనేశ్వర్ కూడా ఫిట్ గా లేకపోవడంతో గత మ్యాచ్ ఆడలేదు. అతను ఈ రోజు సిద్ధార్త్ కౌల్ స్థానంలో ఆదే అవకాశం ఉంటుంది. అభిషేక్ శర్మ / విజయ్ శంకర్ / కేదర్ జాదవ్ ల స్థానాల్లో విరాట్ సింగ్ మరియు అబ్దుల్ సమద్ కోసం మనీష్ పాండే వస్తారని కూడా తెలుస్తోంది.
– చెన్నై వరుసగా ఐదో విజయంపై గురి
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ టీం సమరోత్సాహంతో ఉంది. ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది. వరుసగా ఐదు విజయాలు సాధించడానికి ఎదురుచూస్తోంది. అందరు ఆటగాళ్ళు మంచి ఫామ్‌లో ఉన్నారు. జట్టు విజయానికి బాగా సహకరిస్తున్నారు. ఢిల్లీ పిచ్ సిఎస్‌కెకు సరిపోతుంది. మొయిన్ అలీ ఆరోగ్యంగా ఉంటే, అతను డ్వేన్ బ్రావో స్థానంలో ఉంటాడని తెలుస్తోంది. లేకపోతే ధోని తన వైపు ఎటువంటి మార్పులు చేయటానికి ఇష్టపడడు.
ఐపీఎల్ చరిత్ర: ఈ రెండు టీంలు ఇప్పటివరకు ఒకరితో ఒకరు 14 మ్యాచ్‌లు ఆడాయి. సీఎస్‌కే 10 మ్యాచ్ లలో గెలిచింది. ఎస్‌ఆర్‌హెచ్ కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.
మ్యాచ్ వేదిక: అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ.
మ్యాచ్ సమయం: సాయంత్రం 07.30 PM