
‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ అంటే టాలీవుడ్ లో మంచి పేరు ఉంది. సినిమాలను పక్కాగా ప్లాన్ చేస్తోందని, నటీనటులకు పక్కా పేమెంట్స్ ఇస్తోందని.. బేరాలు మోసాలు ఈ సంస్థకు అసలు పడవు అని ఇలా సితార అంటే ఒక బ్రాండ్ లాగా స్థిరపడిపోయింది. తెలుగు చిత్రపరిశ్రమలో ఒక సంస్థకు ఇలా బ్రాండ్ రావడం అంటే అంత ఆషామాషీ కాదు. అయితే, ఇంతగా పేరు తెచ్చుకుని చివరకూ ‘సితార’ తన పరువును పోగొట్టుకుందని సినీ జనం కామెంట్స్ చేసుకుంటున్నారు.
గత ఏడాది లాక్ డౌన్ కి ముందు ‘సితారా’ మంచి ఊపు మీద కనిపించింది. దాదాపు ఎనిమిది చిన్న, మీడియం, పెద్ద సినిమాలను పక్కాగా ప్లాన్ చేసుకుంది. అన్ని సినిమాలు ప్లాన్ చేసింది కాబట్టి, పనిలో పనిగా నటీనటులకు, అలాగే మిగిలిన సాంకేతిక బృందానికి భారీగా అడ్వాన్స్ లు ఇచ్చి లాక్ చేసింది. అయితే, అడ్వాన్స్ ల రూపంలోనే సితార కోట్ల రూపాయిలను ముట్టజెప్పినట్టు సమాచారం. కానీ, ప్లాన్ చేసిన ఎనిమిది సినిమాల్లో ఒక్క ‘రంగ్ దే’ సినిమాని మాత్రమే పూర్తీ చేసి రిలీజ్ చేసింది.
ఇక మిగిలిన సినిమాలలో నాగశౌర్యతో సినిమా సెట్ మీద వుంది. అలాగే విష్వక్ సేన్ హీరోగా ఫిక్స్ అయిన సినిమాని కూడా సెట్స్ మీదకు తీసుకువెళ్లినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అదే విధంగా సిద్దు జొన్నలగడ్డతో హీరోగా సుధీర్ వర్మ డైరక్షన్ లో ఫిక్స్ అయిన సినిమా కూడా దాదాపు సెట్స్ మీదకు వెళ్ళి ఆగిపోయింది. అయితే మరో నాలుగు సినిమాల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా ఉందట.
ఆ సినిమాల్లో కొత్త డైరక్టర్లతో చేస్తామని కమిట్ అయిన రెండు సినిమాలు ఉన్నాయి. అలాగే శ్రీవిష్ణు, గణేష్ బెల్లంకొండలతో కమిట్ అయినా సినిమాలు రెండు ఉన్నాయి. ఈ నాలుగు సినిమాల కోసం సితార అడ్వాన్స్ ల రూపంలోనే దాదాపు ఇరవై కోట్లు వరకూ ఖర్చు పెట్టింది. ఇప్ప్పుడు ఎలాగూ కరోనా సెకెండ్ వేవ్ కాబట్టి, మళ్ళీ ఎప్పటికీ సాధారణ పరిస్థితులు వస్తాయో తెలియదు.
పైగా చేయాల్సిన సినిమాలే ఇంకా ఐదు ఉన్నాయి. అందుకే పైన నాలుగు సినిమాల టీమ్ లకు ఇచ్చిన అడ్వాన్స్ లను, తిరిగి ఇవ్వాల్సిందిగా ‘సితార సంస్థ’ అందరికీ ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేస్తోంది. అసలు తొందరపడి ఎక్కువ సినిమాలు ఎందుకు ప్రకటించడం ?, చివరకు ఇలా పరువు ఎందుకు పోగొట్టుకోవడం ? పాపం ‘సితార’.