SRH Vs PBKS: ఇది ఒకప్పటి సన్ రైజర్స్ కాదు..ప్లే ఆఫ్ తోనే ఆగదు.. లెక్క వేరే ఉంది బాస్..

గుజరాత్ జట్టుతో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల తుడిచి పెట్టుకోవడంతో.. అటు హైదరాబాద్, ఇటు గుజరాత్ టైటాన్స్ జట్లకు చెరొక పాయింట్ లభించింది . దీంతో హైదరాబాద్ దర్జాగా ప్లే ఆఫ్ వెళ్లిపోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 19, 2024 10:01 am

SRH Vs PBKS

Follow us on

SRH Vs PBKS: గత మూడు సీజన్లలో దారుణమైన ఆట తీరు ప్రదర్శించిన హైదరాబాద్.. ఈసారి మాత్రం అదరగొట్టింది. అదిరిపోయే ఆటతీరుతో ప్లే ఆఫ్ వెళ్లిపోయింది. ప్లే ఆఫ్ తోనే సరి పెట్టుకోకుండా ఇప్పుడు మరో సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించేందుకు తహతహలాడుతోంది. ఇంతకీ హైదరాబాద్ జట్టు మదిలో ఏముందంటే..

గుజరాత్ జట్టుతో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల తుడిచి పెట్టుకోవడంతో.. అటు హైదరాబాద్, ఇటు గుజరాత్ టైటాన్స్ జట్లకు చెరొక పాయింట్ లభించింది . దీంతో హైదరాబాద్ దర్జాగా ప్లే ఆఫ్ వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఆదివారం సొంత మైదానంలో పంజాబ్ జట్టుతో హైదరాబాద్ తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం పాయింట్లు పట్టికలో రెండవ స్థానంలో చోటు సంపాదించుకోవాలంటే హైదరాబాద్ ఈ మ్యాచ్ తప్పక గెలవాలి. దీంతోపాటు కోల్ కతా, రాజస్థాన్ పోరులో.. రాజస్థాన్ ఓడిపోవాలి. ఎలాగైనా రెండవ స్థానం సాధించాలనే కసితో హైదరాబాద్ మైదానంలోకి దిగుతోంది. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్ కు దూరమైన పంజాబ్ జట్టు.. చివరి లీగ్ మ్యాచ్లో గెలిచి.. విజయంతో సీజన్ ముగించాలని యోచిస్తోంది.

15 పాయింట్లతో ప్రస్తుతం హైదరాబాద్ మూడో స్థానంలో కొనసాగుతోంది. రెండవ స్థానంలోకి రావాలంటే పంజాబ్ జట్టుపై విజయం మాత్రమే కాదు.. కోల్ కతా రాజస్థాన్ జట్టును ఓడించాలి. అప్పుడే హైదరాబాద్ రెండవ స్థానంలోకి వస్తుంది. క్వాలిఫైయర్ – 1 కి హైదరాబాద్ అర్హత సాధించాలంటే కచ్చితంగా రాజస్థాన్ జట్టుపై కోల్ కతా విజయం సాధించాలి. కోల్ కతా 19, రాజస్థాన్ 16 పాయింట్లతో ఇప్పటికే ప్లే ఆఫ్ చేరుకున్నాయి. టాప్ -2 లో హైదరాబాద్ జట్టు నిలిస్తే క్వాలిఫైయర్ – 1 కు చేరుకుంటుంది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ వెళుతుంది. ఓడిపోయిన జట్టు క్వాలిఫైయర్ -2 లో ఎలిమినేటర్ మ్యాచ్ లో విజేతగా నిలిచిన జట్టుతో పోటీపడుతుంది. మూడు, నాలుగు స్థానాలలో ఉన్న జట్లు, ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడతాయి. క్వాలిఫైయర్ ఒకటి, రెండు విభాగాలలో గెలిచిన జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధిస్తాయి. అందువల్లే టాప్ -2 స్థానం కోసం హైదరాబాద్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఇక ఆదివారం జరిగే మ్యాచ్ లో స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు విశ్రాంతి ఇవ్వాలని హైదరాబాద్ జట్టు భావిస్తోంది. ఆదివారం జరిగే మ్యాచ్ నామమాత్రం కావడంతో.. అతనికి విశ్రాంతి ఇస్తే.. తదుపరి మ్యాచ్లలో విజృంభిస్తాడని హైదరాబాద్ జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. మయాంక్ అగర్వాల్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్ కు జట్టులో అవకాశం లభిస్తుందని సమాచారం. భువనేశ్వర్ స్థానంలో ఉమ్రాన్, సన్వీర్ సింగ్ స్థానంలో మాయాంక్, షాబాద్ అహ్మద్ స్థానంలో సుందర్ ను తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

హైదరాబాద్ తుది జట్టు అంచనా ఇలా..

కమిన్స్(కెప్టెన్), అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీష్ రెడ్డి, మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, విజయ్ కాంత్, జయదేవ్ ఉనద్కత్ (ఇంపాక్ట్ ప్లేయర్).