IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో భాగంగా శుక్రవారం బెంగళూరు వేదికగా బెంగళూరు, కోల్ కతా జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కోల్ కతా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేసింది. విరాట్ కోహ్లీ, డూ ప్లెసిస్ ఓపెనర్లుగా బరిలోకి వచ్చారు. ఈ మ్యాచ్ లోనూ డూ ప్లెసిస్ చెత్త ఫామ్ కనబరిచాడు. అతడు కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి హర్షిత్ రానా బౌలింగ్లో మీ చల్ స్టార్క్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత కెమెరూన్ గ్రీన్ (33) ఉన్నంతలో మెరుపులు మెరిపించాడు. మాక్స్ వెల్ (28) భారీ స్కోర్ సాధించే క్రమంలో అవుట్ అయ్యాడు. రజిత పాటిదార్ (3) నిరాశపరిచాడు. అనూక్ రావత్ (3) రజత్ దారినే అనుసరించాడు. ఈ దశలో వచ్చిన దినేష్ కార్తీక్ మరోసారి తన సూపర్ ఫామ్ ను ప్రదర్శించాడు. చివర్లో వచ్చాడు గాని.. ఒకవేళ అతడు మిడిల్ ఆర్డర్లో వచ్చి ఉంటే బెంగళూరు స్కోర్ మరో విధంగా ఉండేది. కేవలం ఎనిమిది బంతులు మాత్రమే ఎదుర్కొన్న దినేష్ కార్తీక్.. 3 సిక్సర్ల సహాయంతో ఏకంగా 20 పరుగులు చేశాడు. చివరి బంతికి సాల్ట్ చేతిలో రన్ అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ చివర్లో 15 బంతుల్లోనే 31 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం.
ఇక బెంగళూరు ఆ స్థాయి స్కోర్ సాధించిందంటే దానికి ముఖ్య కారణం కింగ్ విరాట్ కోహ్లీ. తనను కింగ్ అని పిలవద్దని విరాట్ అంటాడు కానీ.. ఇలాంటి బ్యాటింగ్ చేస్తుంటే కచ్చితంగా అతడిని అలాకాకుండా ఇంకెలా పిలుస్తారు?. కీలకమైన ఆటగాళ్లు మధ్యలోనే అవుట్ అయి వెళ్లిపోయారు. ఈ తరుణంలో జట్టు భారం మొత్తం విరాట్ కోహ్లీ ఒక్కడే మోసాడు. ఓపెనర్ గా వచ్చిన అతడు చివరి వరకు ఆడాడు. 59 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 83 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. అతడు గనుక నిలబడకపోయి ఉంటే బెంగళూరు పరిస్థితి దారుణంగా ఉండేది.
ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. డూ ప్లెసిస్ తో కలిసి 17 పరుగులు, కామెరూన్ గ్రీన్ తో 65 పరుగులు, మ్యాక్స్ వెల్ తో 42, పాటిదార్ తో 20, అనుజ్ రావత్ తో ఏడు, దినేష్ కార్తీక్ తో 31 పరుగుల భాగస్వామ్యాన్ని విరాట్ కోహ్లీ నెలకొల్పాడు. ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ చివరి వరకు అదే స్టామినాను కొనసాగించాడు. ముఖ్యంగా స్టార్క్, రసెల్ బౌలింగ్లో ఆకాశమేహద్దుగా చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. తోటి ఆటగాళ్ల నుంచి ప్రోత్సాహం లభించి ఉంటే విరాట్ మరింత బలమైన ఇన్నింగ్స్ ఆడేవాడు.
83 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచిన విరాట్ కోహ్లీపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది.”అతడు ఒక పరుగుల యంత్రం. చాలామందికి వయసు మీద పడుతున్న కొద్దీ అనారోగ్యం, ఇతర సమస్యలు ఏర్పడతాయి. కానీ విరాట్ కోహ్లీ ఇందుకు భిన్నం. రోజులు గడుస్తున్న కొద్ది అతని వయసు మరింత తగ్గిపోతోంది. వికెట్ల మధ్య చిరుతపులి లాగా అతడు పరిగెత్తుతున్నాడు. అతడు అలా ఆడుతున్నాడు కాబట్టే పరుగుల యంత్రంలాగా అభిమానులు కీర్తిస్తున్నారని” నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.