Sunrisers Hyderabad: టీమిండియా ప్లేయర్ ఒక్కరూ లేరు.. అయినా సమష్టి కృషితో SRH అద్భుతాలు

బెంగళూరు జట్టుకు కెప్టెన్ డూ ప్లెసిస్ అయినప్పటికీ.. విరాట్ కోహ్లీ ఆ జట్టుకు ప్రధాన బలం. అట్టడుగు స్థానం నుంచి సెమీస్ దాకా వచ్చింది అంటే.. అందుకు ప్రధాన కారణం విరాట్ కోహ్లీ.

Written By: Anabothula Bhaskar, Updated On : May 25, 2024 12:41 pm

Sunrisers Hyderabad

Follow us on

Sunrisers Hyderabad: బలమైన ముంబై జట్టుపై 277 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇదే అనితర సాధ్యమైన ఘనత అని భావిస్తుంటే.. బలమైన బెంగళూరు పై 287 రన్స్ చేసింది.. తన రికార్డును తానే బద్దలు కొట్టింది. లక్నో జట్టుపై ఏకంగా పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ సాధించిన ఘనతలు అన్నీ ఇన్నీ కావు. గత సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న హైదరాబాద్.. ఈసారి ఏకంగా ఫైనల్ వెళ్ళింది. బలమైన కోల్ కతా జట్టు తో తలపడనుంది. వాస్తవానికి హైదరాబాద్ ఈ స్థాయిలో ఆడుతుందని ఎవరూ ఊహించలేదు. చివరికి సీజన్ ప్రారంభమయ్యే నాటికి ఏ మాజీ క్రీడాకారుడు కూడా హైదరాబాద్ జట్టుపై సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేయలేదు. అయినప్పటికీ హైదరాబాద్ అనితర సాధ్యమైన విజయాలను నమోదుచేసింది.

మూడు జట్లను గమనిస్తే..

ఈ సీజన్లో ప్లే ఆఫ్ దశకు వచ్చిన హైదరాబాద్ మిగతా మూడు జట్లను గమనిస్తే..కోల్ కతా జట్టు లో టీమిండియా జాతీయ జట్టు ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అతని ఆధ్వర్యంలో కోల్ కతా ఈ సీజన్లో అద్భుతంగా రాణించింది.

బెంగళూరు జట్టుకు కెప్టెన్ డూ ప్లెసిస్ అయినప్పటికీ.. విరాట్ కోహ్లీ ఆ జట్టుకు ప్రధాన బలం. అట్టడుగు స్థానం నుంచి సెమీస్ దాకా వచ్చింది అంటే.. అందుకు ప్రధాన కారణం విరాట్ కోహ్లీ. అతడి తర్వాత స్థానం మహమ్మద్ సిరాజ్ కు దక్కుతుంది. ఎందుకంటే అతడు కొన్ని మ్యాచ్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి.. బెంగళూరుకు విజయాన్ని అందించాడు.

రాజస్థాన్ జట్టుకు సంజు శాంసన్ నాయకత్వం వహించాడు. అతని ఆధ్వర్యంలో రాజస్థాన్ జట్టు అద్భుతమైన విజయాలు అందుకుంది. ఏకంగా బలమైన బెంగళూరు జట్టును ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడించింది. కీలకమైన సెమీఫైనల్ లో హైదరాబాద్ చేతిలో ఓడిపోయినప్పటికీ.. ఆ జట్టు అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

ఇలా ఐపీఎల్లో కీలకమైన ప్లే ఆఫ్ దాకా వచ్చిన జట్లకు టీమిండియా జాతీయ జట్టు ఆటగాళ్లు సారధ్యం వహించారు. కొంతమంది కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. ఇదే పరిస్థితి హైదరాబాద్ జట్టుకు లేదు. ఎందుకంటే ఆ జట్టులో టీమిండియా ఆటగాళ్లు లేరు. పైగా ఆ జట్టుకు ఆస్ట్రేలియా ఆటగాడు కమిన్స్ నాయకత్వం వహిస్తున్నాడు.. టీమిండియా ఆటగాళ్లు లేకపోయినప్పటికీ ఆ జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్ లో రాణించేలా చేస్తున్నాడు. అందువల్లే హైదరాబాద్ టైటిల్ వేటలో నిలిచింది. సమష్టి కృషితో అద్భుత విజయాలు సాధించి.. ఫైనల్ దూసుకెళ్లింది.. ఇప్పటికే ప్లే ఆఫ్ లో రాజస్థాన్ జట్టును ఓడించి ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే అంతకుముందు కోల్ కతా జట్టు తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ.. వెంటనే హైదరాబాద్ జట్టు తేరుకుంది. గోడకు కొట్టిన బంతి లాగా వేగంగా దూసుకు వచ్చింది. రాజస్థాన్ జట్టు పై ప్రదర్శించిన పోరాట పటిమను..కోల్ కతా పై కూడా కొనసాగిస్తే హైదరాబాద్ మూడోసారి విజేతగా ఆవిర్భవిస్తుంది.