RCB
RCB: బలమైన జట్టు.. సమర్థవంతమైన ఆటగాళ్లు.. భీకరమైన బ్యాటింగ్ లైనప్.. ప్రతిభావంతమైన బౌలింగ్.. ఇవన్నీ ఉన్నా.. ఎక్కడో దురదృష్టం ఎదురుతంతోంది. ఫలితంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న బెంగళూరు జట్టు వరుస ఓటములు ఎదుర్కొంటోంది. అటు అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తోంది. ఇటీవలి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు మహిళా జట్టు కప్ గెలిస్తే.. పురుషుల జట్టు మాత్రం దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తోంది. పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతూ పరువు తీసుకుంటున్నది. ఈ టోర్నీలో కచ్చితంగా నిలబడాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్ లో గెలుపు వాకిట్లో బోర్లా పడింది. ఒకే ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది.
ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 222 పరుగులు చేసింది. సాల్ట్(48), రస్సెల్(27*), అయ్యర్ (50) ధాటిగా ఆడటం.. రమణ్ దీప్ సింగ్ ( 24*) సత్తా చాటడంతో బెంగళూరు ఎదుట కోల్ కతా 223 లక్ష్యాన్ని ఉంచింది. బెంగళూరు బౌలర్లలో దయాల్ 2, గ్రీన్ 2, మహమ్మద్ సిరాజ్, ఫెర్గూసన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
223 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 221 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. జాక్స్ 55, రజత్ పాటిధార్ 52, దినేష్ కార్తీక్ 24, కర్ణ శర్మ 20 పరుగులు చేసి సత్తా చాటారు. కోల్ కతా బౌలర్లలో రస్సెల్ 3, సునీల్ నరైన్, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు పడగొట్టారు. మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ ఓటమి నేపథ్యంలో బెంగళూరు ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
ఈ ఓటమితో దాదాపు బెంగళూరు ప్లే ఆఫ్ రేస్ నుంచి దాదాపు తప్పుకున్నట్టు తెలుస్తోంది. బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ వెళ్లాలంటే అద్భుతాలు జరగాలి. ఇప్పటివరకు బెంగళూరు ఎనిమిది మ్యాచ్ లు ఆడి 7 ఓడిపోయింది. ఇంకా ఆ జట్టు ఆరు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఒకవేళ ఈ ఆరు మ్యాచ్ లు గెలిచినా, 7 విజయాలతో 14 పాయింట్లు సాధిస్తుంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ప్లే ఆఫ్ చేయాలంటే కనీసం 8 మ్యాచ్లు మెరుగైన రన్ రేట్ తో గెలవాల్సి ఉంటుంది. అద్భుతాలు జరిగి, తదుపరి ఆరు మ్యాచ్లో భారీ పరుగుల తేడాతో విజయం సాధిస్తే సాంకేతికంగా ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్లే ఆఫ్ చేరే నాలుగు జట్లలో ఏదైనా ఒక జట్టు ఏడు విజయాలు 14 పాయింట్లు సాధిస్తే, అప్పుడు రన్ రేట్ కీలక పాత్ర పోషిస్తుంది. బెంగళూరుకు మెరుగైన రన్ రేట్ ఉంటే కచ్చితంగా ముందంజ వేసే అవకాశం ఉంటుంది. కానీ, ఆ ఛాయలు దరిదాపులో కూడా లేవని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.