RCB Players : ప్రస్తుత ఐపీఎల్ 17వ సీజన్ జోరుగా సాగుతోంది. జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లలో అప్రతిహత విజయాలు సాధిస్తూ కోల్ కతా మొదటి స్థానంలో కొనసాగుతోంది. చెన్నై రెండవ స్థానంలో ఉంది. ఇక పేరు పొందిన జట్లు అంతంతమాత్రంగానే ఆడుతూ అభిమానులను నిరాశలు గురిచేస్తున్నాయి. అలాంటి జట్లలో బెంగళూరు కూడా ఒకటి. ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభ మ్యాచ్లో చెన్నై జట్టుతో ఆడి ఓడిపోయింది. సొంత మైదానాల్లో కోల్ కతా, లక్నో జట్లతో జరిగిన మ్యాచ్ లలోనూ బెంగళూరు దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ మాత్రమే రాణిస్తున్నాడు. మిగతావారు మొత్తం విఫలం కావడంతో ఆ జట్టు వరుస ఓటములు ఎదుర్కొంటోంది. అంతేకాదు ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకొని జట్టుగా అపప్రదను మోస్తోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడి.. మూడు ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది.
ఈ సీజన్లో చెత్త ప్రదర్శన కొనసాగిస్తున్న నేపథ్యంలో బెంగళూరు జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఆటగాళ్లు ఆ జట్టును విడిపోతే స్టార్లుగా ఎదుగుతారంటూ ఒక జాబితాను కూడా సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్లో మెరుగ్గా రాణిస్తున్న ఆటగాళ్లు మొత్తం బెంగళూరు జట్టు నుంచి బయటికి వచ్చిన వారేనని వారు ఉదహరిస్తున్నారు.
ఆశిష్ నెహ్రా ముందుగా బెంగళూరు జట్టులో ఆడాడు. ఆ జట్టులో ఉన్నప్పుడు పెద్దగా రాణించలేకపోయేవాడు. ఐపీఎల్ కెరీర్ చివర్లో చెన్నై జట్టు తరఫున బౌలింగ్ చేసి దుమ్మురేపాడు. 2022లో ఐపీఎల్లోకి ప్రవేశించిన గుజరాత్ జట్టు ను విజేతగా నిలిపాడు. రెండవ సీజన్లో రన్నర్ అప్ సాధించేలా తర్ఫీదు ఇచ్చాడు. ఇక అతడి తర్వాత శివం దుబే గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. బెంగళూరు జట్టులో ఉన్నప్పుడు అతడు ఒక అనామక ఆటగాడిగా ఉండేవాడు. కొంతకాలంగా చెన్నై జట్టుకు అతడు ఆడుతూ కీలక ఆటగాడిగా ఎదిగాడు. చెన్నై జట్టులో ప్రతిభ చూపించిన తర్వాతే అతడికి జాతీయ జట్టులో స్థానం దక్కింది. 2019, 2020 సీజన్లలో ఐదు కోట్లకు బెంగళూరు తరఫున ఆడాడు. అయినప్పటికీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. కానీ ప్రస్తుత చెన్నై జట్టుకు నాలుగు కోట్లకే అమ్ముడుపోయి కీలక ఆటగాడిగా ఎదిగాడు.
ఇక ప్రస్తుతం హైదరాబాద్ జట్టు తరుపున ఆడుతూ.. విధ్వంసకరమైన ఇన్నింగ్స్ కు పర్యాయపదంగా మారిపోయిన క్లాసెన్ గతంలో బెంగళూరు జట్టుకు ఆడాడు.. ఇలా చెబితే ఎవరైనా ఆశ్చర్యపోతారు కావచ్చు.. 2019లో బెంగళూరు జట్టుకు ఆడిన అతడు కేవలం 50 లక్షల కు మాత్రమే అమ్ముడుపోయాడు.. ఆ సీజన్లో అతడు పెద్దగా రాణించలేదు. కానీ ఎప్పుడైతే హైదరాబాద్ జట్టు అతడిని 5.25 కోట్లకు కొనుగోలు చేసిందో.. అప్పుడే అతడి ఆట తీరు మారిపోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇదే జట్టులో మరో కీలక ఆటగాడు ట్రావిస్ హెడ్ గతంలో బెంగళూరు జట్టుకు ఆడాడు.. 2016, 2017 సీజన్లలో అతడు ఆడిన విషయం చాలామంది అభిమానులకు గుర్తుకు లేదంటే అతిశయోక్తి కాదు. బెంగళూరు జట్టు ను వదిలిపెట్టిన తర్వాత అతడు బ్యాట్ తో తాండవం చేస్తున్నాడు. హైదరాబాద్ తరఫున కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇలా ఈ నలుగురు ఆటగాళ్లు ఐపీఎల్లో మెరుపులు మెరిస్తున్నారు.. ఈ నేపథ్యంలో బెంగుళూరు జట్టును అభిమానులు ఏకిపారేస్తున్నారు. దరిద్రం మొత్తం ఆ జట్టులోనే ఉందంటూ విమర్శలు చేస్తున్నారు.
#RCBvsKKR #RCB #IPL2024 pic.twitter.com/qvRL8Cp7lB
— Sayyad Nag Pasha (@nag_pasha) March 30, 2024