IPL 2024.. మరో మూడు రోజుల్లో మొదలు కాబోతోంది. అన్ని జట్లు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఈసారి ఎలాగైనా కప్ దక్కించుకోవాలనే కసితో ఉన్నాయి. అందులో ముంబై జట్టు ప్రత్యేకం. అరి వీర భయంకరమైన ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. అయితే గతంలో ఉన్న నాయకుడు కాకుండా.. ఈసారి ఆ జట్టుకు కొత్త నాయకుడు వచ్చాడు. ఈ నేపథ్యంలో అతని ముందు ఉన్న సవాళ్లు ఏంటి? వాటిని అతడు ఏ విధంగా అధిగమించగలడు? వీటిపై ప్రత్యేక కథనం.
ముంబై జట్టుకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వచ్చిన నాటి నుంచి ఒక్కటే చర్చ జరుగుతోంది. అంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ ఉండగా.. గుజరాత్ నుంచి హార్దిక్ ను ఎందుకు తెచ్చారని.. దీనిపై కోచ్ మార్క్ బౌచర్ అది మేనేజ్మెంట్ నిర్ణయమని స్పష్టం చేశాడు. మరోవైపు మేనేజ్మెంట్ కూడా జట్టు అవసరాల దృష్ట్యా అని చెబుతోంది. ఇప్పటికే ఐదుసార్లు ముంబై జట్టును రోహిత్ శర్మ విజేతగా నిలబెట్టాడు. అయినప్పటికీ అతడిని ముంబై మేనేజ్మెంట్ కెప్టెన్ గా పక్కన పెట్టింది. అప్పటినుంచి వివాదం కొనసాగుతూనే ఉంది. రోహిత్ అభిమానులు హార్దిక్ పాండ్యాను విమర్శిస్తున్నారు. ముంబై జట్టును తిడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముంబై జట్టును హార్దిక్ ఎలా నడిపించగలడు అనేదే ప్రధాన ప్రశ్న. హార్దిక్ పాండ్యాను తక్కువ చేయడానికి లేదు. ఎందుకంటే ఐపీఎల్ లోకి గుజరాత్ ఎంట్రీ ఇచ్చిన తొలి సంవత్సరమే.. ఆ జట్టును హార్దిక్ విజేతగా నిలిపాడు. పేరు మూసిన ఆటగాళ్లు లేకపోయినప్పటికీ.. నిలకడైన ఆటతీరుతో ఆ జట్టును ముందుకు నడిపాడు. ఏకంగా విజేతను చేశాడు. ఇక ఆ మరుసటి సీజన్లోనూ గుజరాత్ రన్నరప్ గా నిలిచింది. అటు బంతి, అటు బ్యాట్ తో రాణించగల సత్తా హార్దిక్ సొంతం. పైగా క్షణంలో నిర్ణయాలు తీసుకుంటాడు. వాటిని వెంటనే అమలు చేస్తాడు. ఆ నిర్ణయాల్లో చాలావరకు జట్టుకు లాభాన్ని చేకూర్చుతాయి.
వాస్తవానికి హార్దిక్ పాండ్యా గుజరాత్ జట్టుకు గతంలో కెప్టెన్ గా ఉన్నాడు కానీ.. ముంబై జట్టుతోనే తన సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగించాడు. 2022 సీజన్లో తనను తీసుకోకపోవడంతో మనసు నొచ్చుకొని గుజరాత్ జట్టుకు వేలానికి వెళ్లిపోయాడు.. వెళ్లిన తొలి సంవత్సరమే ఆ జట్టును విజేతగా నిలిపాడు. ఈ సీజన్లో ఉన్నట్టుండి ముంబై యాజమాన్యంతో చర్చలు జరిపాడు. కెప్టెన్సీ ఇస్తేనే వస్తానని షరతు పెట్టాడు. యాజమాన్యం దానికి ఒప్పుకోవడంతో కెప్టెన్ గా వచ్చాడు. ఇక గత రెండు సీజన్లలో ముంబై దారుణమైన ప్రదర్శన కనబరిచింది. రోహిత్ కెరియర్ కూడా ముగింపునకు వచ్చింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముంబై జట్టు హార్దిక్ కు కెప్టెన్ పగ్గాలు అప్పగించింది. వాస్తవానికి ముంబై జట్టు హార్దిక్ పాండ్యాకు కొత్త కాదు. ఆరు సంవత్సరాలపాటు అతడు ఆ జట్టుకు ఆడాడు. అక్కడివారు మొత్తం అతడికి పరిచయం. అయితే అప్పుడు ఆటగాడిగా ఉన్న హార్దిక్ ఇప్పుడు కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. పైగా హార్దిక్ కెప్టెన్ గా రావడం ఆ జట్టులోని ఆటగాళ్లకు నచ్చడం లేదు. ఇప్పటికే కొంతమంది తమ అసంతృప్తిని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రయత్నం చేశారు. రోహిత్ శర్మ కూడా అసంతృప్తికి గురైనట్టు వార్తలు వినిపించాయి. ఇలాంటి సమయంలో జట్టును ఏకతాటిపై నడిపించడం హార్దిక్ కు సవాలే. పైగా రోహిత్ శర్మతో తాను ఇంతవరకు మాట్లాడలేదు అని చెప్పిన హార్దిక్.. అతనితో ఎలా సమన్వయం చేసుకుంటాడనేది ఆసక్తికరమే.. ఇక హార్దిక్ కెప్టెన్ గా రావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ వారిలో అసంతృప్తి చల్లారడం లేదు. ఇలాంటి తరుణంలో ముంబై యాజమాన్యం ఈ వ్యవహారాన్ని కాస్త పద్ధతిగా డీల్ చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్ గతాన్ని మర్చిపోయి.. హార్దిక్ కూడా మిగతా విషయాలను పక్కనపెట్టి కలిసిపోతే ముంబై జట్టును అభిమానులు ఆదరిస్తారు. అదే సమయంలో ఒకప్పటి రోజులు ఆ జట్టుకు లభించే అవకాశాలుంటాయి.