LSG Vs PBKS 2023: కేఎల్ రాహుల్ వైఫల్యమే లక్నో భారీ స్కోరుకు కారణమా?

ఐపీఎల్ అంటేనే మజా. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఈ లీగ్.. ప్రతి ఏటా అభిమానుల ఆదరణను మరింత పొందుతోంది. దీనికి ప్రధాన కారణం సీజన్ సీజన్ కు మరింత ఎంటర్టైన్మెంట్ ను అభిమానులకు అందించడమే.

Written By: BS, Updated On : April 29, 2023 9:54 am
Follow us on

LSG Vs PBKS 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన అనేక మ్యాచ్ ల్లో 200కు పైగా స్కోర్లు నమోదు అయ్యాయి. అంటే ఏ స్థాయిలో బ్యాటర్లు విజృంభిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. తాజాగా శుక్రవారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సిక్సు, ఫోర్ అన్నట్టుగా ప్రతి బాల్ ను లక్నో బ్యాటర్లు బాదారు. దీంతో ఈ సీజన్లోనే అత్యధికంగా 257 పరుగుల భారీ స్కోరు నమోదయింది.

ఐపీఎల్ అంటేనే మజా. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఈ లీగ్.. ప్రతి ఏటా అభిమానుల ఆదరణను మరింత పొందుతోంది. దీనికి ప్రధాన కారణం సీజన్ సీజన్ కు మరింత ఎంటర్టైన్మెంట్ ను అభిమానులకు అందించడమే. అభిమానుల అభిరుచులకు అనుగుణంగా లీగ్ లో మార్పులు చేస్తూ ఆసక్తికరంగా మ్యాచులు జరిగేలా చేస్తున్నారు నిర్వాహకులు. దీంతో 16 సంవత్సరాలుగా ఐపీఎల్ జరుగుతున్నప్పటికీ ఏమాత్రం కూడా ఈ లీగ్ పట్ల క్రేజ్ తగ్గలేదు.

రాహుల్ పెవిలియన్ కు చేరాక విజృంభించిన బ్యాటర్లు..

మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో కు రాహుల్ (12) అనుకున్న ఆరంభం ఇవ్వలేకపోయాడు. తొలి ఓవర్ లో ఐదు బంతులు ఎదుర్కొన్న రాహుల్ ఒకే ఒక్క పరుగు చేశాడు. ఆ తరువాత కూడా అతని ఇన్నింగ్స్ వేగం పెరగలేదు. మొత్తం తొమ్మిది బంతులు ఎదుర్కొన్న రాహుల్ 12 పరుగులు చేశాడు. కగిసో రబాడ బౌలింగ్ లో షారుఖ్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు అందరూ పంజాబ్ బౌలర్లుపై ఎదురు దాడికి దిగారు. ప్రతి ఒక్కరూ 200పైగా స్ట్రైక్ రేట్ తో పరుగులు చేశారు.

ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన బ్యాటర్లు..

శుక్రవారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. రాహుల్ తో పాటు వచ్చిన మరో ఓపెనర్ కైల్ మేయర్స్ (54) పరుగులతో అదరగొట్టాడు. రాహుల్ అవుట్ అయిన తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఆయుష్ బదోని (43) అదరగొట్టాడు. మూడో స్థానంలో వచ్చిన అతను కూడా ధనాధన్ ఆటతో ఆకట్టుకున్నాడు. బదోనికి జత కలిసిన మార్కస్ స్టోయినీస్ 40 బంతుల్లో 72 పరుగులు చేసి పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతనితోపాటు నికోలస్ పూరన్ కూడా విజృంభించాడు. 19 బంతుల్లోనే 45 పరుగులతో అదరగొట్టాడు. ఇలా క్రీజీలోకి వచ్చిన ప్రతి బ్యాటర్ విశ్వరూపం ప్రదర్శించడంతో లక్నో జట్టు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది

రెండో జట్టుగా రికార్డు సృష్టించిన లక్నో జట్టు..

లక్నో బ్యాటర్ల అరవీర భయంకరమైన విధ్వంసంతో.. 257 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే ఐపిఎల్ లో 250 పరుగులు మార్కు దాటిన రెండో జట్టుగా రికార్డు సృష్టించింది. ఇదంతా చూసిన పంజాబ్ ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. అసలు కేఎల్ రాహుల్ ను అవుట్ చేయకపోయి ఉంటే.. లక్నో ఇంత భారీ స్కోరు చేసేది కాదని వాపోతున్నారు. రాహుల్ ను ఎందుకు అవుట్ చేసావురా అంటూ రబాడాపై జోకులు పేలుస్తున్నారు. ఫామ్ లో లేక సతమతమవుతున్న రాహుల్ ను అవుట్ చేసి.. మిగిలిన బ్యాటర్లు విజృంభించేలా చేశారని, రాహుల్ అవుట్ కావడం వల్లే లక్నో జట్టు భారీ స్కోర్ చేసిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.