Homeక్రీడలుRCB Vs SRH 2023 Kavya Maran: కావ్య పాప నవ్వింది.. మొత్తానికి సంతృప్తి పరిచిన...

RCB Vs SRH 2023 Kavya Maran: కావ్య పాప నవ్వింది.. మొత్తానికి సంతృప్తి పరిచిన సన్ రైజర్స్ క్రికెటర్..!

RCB Vs SRH 2023 Kavya Maran: ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘోరంగా విఫలమైంది. ఈ జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోవడంతో అభిమానులతోపాటు ఆ జట్టు యజమాని కావ్య మారన్ కూడా తీవ్ర నిరాశ చెందారు. జట్టు గొప్ప విజయాలు సాధించకపోయినా.. విజయాన్ని అందుకునే స్థాయిలో ప్రదర్శన అయినా చేయలేక పోతారా..? అన్న ఆశతో ఆమె ప్రతి మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వస్తున్నారు. అయితే, ఆశించిన స్థాయిలో జట్టు ఆటగాళ్లు ప్రదర్శన చేయకపోవడంతో ఆమె ప్రతి మ్యాచ్ సందర్భంగా నిరాశ వదనంతో కనిపించేవారు. గురువారం బెంగుళూరుతో మ్యాచ్ సందర్భంగా మాత్రం కావ్య పాప ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కనిపించారు.

ఐపీఎల్ లో పది జట్లు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఈ జట్లకు సంబంధించిన యజమానులు ఎప్పుడో ఒకటి.. రెండు మ్యాచ్లకు మినహా.. అన్ని మ్యాచులు వీక్షించేందుకు రారు. కానీ, హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ మాత్రం ఇందుకు భిన్నం. హైదరాబాద్ జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడినా స్వయంగా ఆమె హాజరై జట్టు సభ్యులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తుంటారు. యజమాని మ్యాచ్ చూసేందుకు వస్తున్నారన్న విషయం తెలిసినప్పటికీ ఆ జట్టు సభ్యులు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేక తీవ్ర నిరాశ పరుస్తున్నారు. దీంతో మ్యాచ్ ఓడిన ప్రతిసారి ఆమె ముభావంగా కనిపిస్తూ ఉండేవారు. గెలుపోటములతో సంబంధం లేకుండా కనీస స్థాయిలో ప్రదర్శన ఇవ్వకపోవడం పట్ల ఆమె అసహనాన్ని కనబరిచేవారు. తొలిసారి బెంగుళూరు జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్ లో ఆమె ఉత్సాహంగా కనిపించారు. జట్టు ఓడిపోయినప్పటికీ అద్భుతమైన ఆటతీరు కనబరిచారన్న ఆనందం ఆమె ముఖంలో కనిపించింది. ముఖ్యంగా, క్లాసెన్ సెంచరీ చూసి ఆమె చప్పట్లు కొడుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎట్టకేలకు కావ్య పాప నవ్వింది అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.

మళ్లీ అదరగొట్టిన క్లాసెన్..

హైదరాబాద్ జట్టులో వన్ మ్యాన్ ఆర్మీగా ఉన్నటువంటి క్లాసెన్ మరోసారి తన క్లాస్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో కేవలం 51 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు. అతనికి మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించలేదు. అయినా సరే హైదరాబాద్ జట్టు అద్భుతమైన స్కోర్ చేసిందంటే దానికి కారణం క్లాసెన్ ఇన్నింగ్స్ మాత్రమే. ఈ మ్యాచ్ లో కొత్త ఓపెనింగ్ జోడీతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు సరైన ఆరంభం దక్కలేదు. బ్రేస్ వెల్ వేసిన ఒకే ఓవర్ లో ఓపెనర్లు అభిషేక్ శర్మ (11), రాహుల్ త్రిపాఠి (15) ఇద్దరూ పెవిలియన్ చేరారు. దీంతో ఆ జట్టు ఆత్మ రక్షణలో పడిపోయింది. కెప్టెన్ మార్క్రమ్ కూడా 20 బంతుల్లో 18 పరుగులు చేయగలిగాడు. అయితే, అతనికి జత కలిసిన హెన్రిక్ క్లాసెన్ మాత్రం చెలరేగిపోయాడు. తన సూపర్ ఫామ్ తో అద్భుతమైన షాట్లు ఆడాడు. ఎడాపెడా బౌండరీలు బాదిన అతను కేవలం 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ పూర్తయిన కాసేపటికి అతను అవుట్ అయ్యాడు.

కావ్య పాపతోపాటు అభిమానుల ఆనందం..

ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఓటమిపాలైనప్పటికీ క్లాసెన్ క్లాస్ ఇన్నింగ్స్ కు ఆ జట్టు యజమాని కావ్యా పాపతో పాటు అభిమానులు కూడా ఫిదా అయ్యారు. హర్షల్ పటేల్ వేసిన స్లో యార్కర్ ను మిస్ జడ్జ్ చేసిన అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయినప్పటికీ అప్పటి వరకు అతడు ఆడిన క్లాస్ షాట్లు చూసిన జట్టు యజమాని ఎంతగానో ఆనందాన్ని వ్యక్తం చేశారు. క్లాసెన్ ఆడిన ప్రతి షాట్ ను ఆమె ఎంతగానో ఆస్వాదించారు. ఈ ఇన్నింగ్స్ చూసిన అభిమానులు.. క్లాసెన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్రికెట్ దేవుడు సచిన్ కూడా క్లాసెన్ ఇన్నింగ్స్ క్లాస్ అంటూ మెచ్చుకున్నాడు. హైదరాబాద్ జట్టు అభిమానులు అయితే.. ‘క్లాసెన్ కాకా నువ్వు కేక ‘ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ లో క్లాసెన్ ప్రతి మ్యాచ్ లోనూ అద్భుతంగా ఆడి భారీగా పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. 51 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సులతో 104 పరుగులు చేశాడు క్లాసెన్. హ్యారీ బ్రూక్ 19 బంతుల్లో 27 పరుగులు చేశాడు. వీరిద్దరు మినహా ఎవరు ఆశించని స్థాయిలో పరుగులు చేయలేదు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు సులభంగానే ఛేదించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ అద్భుతంగా ఆడడంతో రెండు వికెట్ల నష్టానికి మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే బెంగళూరు జట్టు విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 63 బంతుల్లో నాలుగు సిక్సులు, 12 ఫోర్ల సహాయంతో 100 పరుగులు, డు ప్లెసిస్ 47 బంతుల్లో రెండు సిక్సులు, ఏడు ఫోర్లతో 71 పరుగులు చేయడంతో జట్టు సులభంగానే విజయం సాధించగలిగింది. జట్టు ఓడినా క్లాసెన్ క్లాస్ ఇన్నింగ్స్ జట్టు యజమాని కావ్య మారన్ ను ఆనంద డోలికల్లో ముంచెత్తింది.

Exit mobile version