IPL 2023 Final GT Vs CSK: రిజర్వ్‌డే ఎవరికి రాసిపెట్టుందో.. చరిత్రను ధోనీ తిరగరాస్తాడా..?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలో తొలిసారి వర్షం కారణంగా ఫైనల్‌ మ్యాచ్‌ రిజర్వ్‌ డేకు వెళ్లింది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ – గుజరాత్‌ టైటాన్స్‌ జట్ల మధ్య ఐపీఎల్‌ 2023 సీజన్‌ టైటిల్‌ పోరు ఆదివారం జరగాల్సి ఉంది. వర్షం వల్ల సోమవారానికి మ్యాచ్‌ వాయిదా పడింది. హార్దిక్‌ నాయకత్వంలోని గుజరాత్‌ వరుసగా రెండోసారి విజేతగా నిలవాలని భావిస్తుండగా.. ముంబయితో సమంగా ఐదు టైటిళ్లను గెలవాలని ధోనీ సేన ఉవ్విళ్లూరుతోంది.

Written By: Raj Shekar, Updated On : May 29, 2023 12:26 pm

IPL 2023 Final GT Vs CSK

Follow us on

IPL 2023 Final GT Vs CSK: ఐపీఎల్‌ 2023 ఫైనల్‌తో వరుణుడు ఆటాడుకుంటున్నాడు. దీంతో షెడ్యూల్‌ ప్రకారం ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌ను రిజర్వ్‌డే సోమవారానికి వాయిదా వేశారు. అయితే రిజర్వ్‌ డే మ్యాచ్‌ సీఎస్‌కే అభిమానులను కలవరపెడుతోంది. గత రికార్డులే ఇందుకు కారణం. మరి ధోనీ ఈసారి ఆ రికార్డును తిరగరాస్తారా.. ఐపీఎల్‌ సీజన్‌ 16 ఎవరికి రాసిపెట్టి ఉందో అన్న చర్చ జరుగుతోంది.

తొలిసారి రిజర్వ్‌డేకు..
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలో తొలిసారి వర్షం కారణంగా ఫైనల్‌ మ్యాచ్‌ రిజర్వ్‌ డేకు వెళ్లింది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ – గుజరాత్‌ టైటాన్స్‌ జట్ల మధ్య ఐపీఎల్‌ 2023 సీజన్‌ టైటిల్‌ పోరు ఆదివారం జరగాల్సి ఉంది. వర్షం వల్ల సోమవారానికి మ్యాచ్‌ వాయిదా పడింది. హార్దిక్‌ నాయకత్వంలోని గుజరాత్‌ వరుసగా రెండోసారి విజేతగా నిలవాలని భావిస్తుండగా.. ముంబయితో సమంగా ఐదు టైటిళ్లను గెలవాలని ధోనీ సేన ఉవ్విళ్లూరుతోంది.

ధోనీకి కలిసిరాని రిజర్వ్‌డే..
రిజర్వ్‌ డే మ్యాచ్‌ అనగానే 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ గుర్తుకురావడం సహజం. అప్పుడు కూడా వర్షం కారణంగా మ్యాచ్‌ రిజర్వ్‌డేకు వెళ్లింది. న్యూజిలాండ్‌పై ధోనీ(50) హాఫ్‌ సెంచరీ సాధించినా టీమ్‌ఇండియా మాత్రం ఓడిపోయింది. కీలక సమయంలో ధోనీ రన్‌ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. విజయానికి చేరువగా వచ్చి మరీ భారత్‌ ఓటమిపాలైంది. ధోనీకి అదే చివరి అంతర్జాతీయ మ్యాచ్‌. మరుసటి ఏడాది ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికేశాడు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే నెలకొందన్న అభిప్రాయం సీఎస్‌కే అభిమానుల్లో వ్యక్తమవుతోంది. రిజర్వ్‌ డే రోజున జరిగిన మ్యాచ్‌లో ధోనీకి ఎలాంటి ఫలితం వస్తుందోనని టెన్షన్‌ పడుతున్నారు.

చరిత్రను మార్చాలంటున్న ఫ్యాన్స్‌..
ఆటగాడిగా ధోనీకి ఇదే చివరి ఐపీఎల్‌ సీజన్‌గా భావిస్తున్న తరుణంలో రిజర్వ్‌ డే మ్యాచ్‌లో విజయం సాధించాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఇలా జరగాలంటే మ్యాచ్‌ రద్దు కాకుండా కొన్ని ఓవర్లతోనైనా జరగాలి. ఈ క్రమంలో గత చరిత్రను ధోనీ తిరగరాసి ఐదో టైటిల్‌ను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్‌ ఆకాంక్షిస్తున్నారు. మరి ధోనీ గత చరిత్రను మారుస్తాడో లేదో చూడాలి.

వరణుడే ఆడుకుంటాడా.. ఫైనల్‌కు చాన్స్‌ ఇస్తాడా?
ఐపీఎల్‌ ఫైనల్‌ జరగాల్సిన అహ్మదాబాద్‌లో వరణుడే ఆదివారం ఓ ఆటాడుకున్నాడు. దీంతో మ్యాచ్‌ రిజర్వ్‌డేకు వాయిదా పడింది. అయితే సోమవారం కూడా వరణుడి నుంచి గండం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ కూడా వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు అయితే మాత్రం సీఎస్‌కేకు నిరాశే మిగులుతుంది. వర్షం కారణంగా రద్దు అయిన పక్షంలో విజేతగా గుజరాత్‌ టైటాన్స్‌ కప్‌ను సొంతం చేసుకుంటుంది. లీగ్‌ స్టేజ్‌లో పాయింట్ల పట్టిక ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. గుజరాత్‌ 10 విజయాలతో 20 పాయింట్లు సాధించింది. చెన్నై ఖాతాలో 17 పాయింట్లు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. రెండో రోజుకూడా వరణుడు మ్యాచ్‌కు చాన్స్‌ ఇవ్వకుండా తనే ఆడుకుంటే మాత్రం వరుసగా రెండోసారి చాంపియన్‌గా గుజరాత్‌ అవతరిస్తుంది.