IPL 2021 : కరోనా మహమ్మారి కారణంగా అకస్మాత్తుగా నిలిచిపోయిన ఐపీఎల్-14వ సీజన్ నేటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఆదివారం జరగబోయే తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ జట్ల మ్యాచ్ తోరెండో అంచె పోటీలకు తెరలేవనుంది. ఈ సీజన్లో మిగిలిన 31 మ్యాచ్ లను దుబాయ్, అబుదాబి, షార్జా స్టేడియాల్లో నిర్వహించనున్నారు. అయిఏ.. ఇప్పటి వరకు జరిగిన తొలి దశలో ఎవరు టాప్ లో ఉన్నారు? హైదరాబాద్ జట్టు ఏ స్థానంలో ఉంది?
ఐపీఎల్ ఆగిపోవడానికి ముందు వరకు 29 మ్యాచ్ లు జరిగాయి. ఆ సమయానికి పాయింట్ల పట్టికలో ఢిల్లీ కేపిటల్స్ టాప్ లో ఉంది. రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు 8 మ్యాచ్ లు ఆడి ఏకంగా 6 విజయాలను సొంతం చేసుకుంది. దీంతో.. 12 పాయింట్లు సాధించి.. పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ధోనీ జట్టు సెకండ్ ప్లేస్ లో ఉంది. మొత్తం ఏడు మ్యాచులు ఆడిన చెన్నై జట్టు 5 విజయాలు సాధించింది. 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
విరాట్ కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు జట్టు కూడా 7 మ్యాచులు ఆడి, 5 విజయాలు సొంతం చేసుకుంది. 10 పాయింట్లు సాధించింది. రన్ రేట్ వంటి వాటి కారణంగా మూడో స్థానంలో ఉంది. ఇప్పుడు ఢిల్లీ జట్టు రెండు విజయాలు.. చెన్నై, బెంగళూరు మూడు విజయాలు సాధిస్తే.. ప్లే ఆఫ్ కు చేరుకుంటాయి.
అయితే.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం పాయింట్ల పట్టికలో ఇబ్బందికర స్థానంలోనే ఉంది. 7 మ్యాచులు ఆడిన హైదరాబాద్.. కేవలం ఒకే ఒక విజయం సాధించింది. దీంతో కేవలం 2 పాయింట్లు సాధించి అట్టడుగున ఉంది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ బెర్త్ అసాధ్యంగానే కనిపిస్తోంది. మిగిలిన 7 మ్యాచుల్లో 6 విజయాలు సాధిస్తేనే అది సాధ్యమవుతుంది. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.