IPL 2021 : కరోనా కారణంగా అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్-2021 సీజన్.. మరికొన్ని గంటల్లో మొదలు కానుంది. దుబాయ్ వేదికగా మొదలు కాబోతున్న ఫేజ్-2 మ్యాచ్ ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. టోర్నీ ఆగిపోవడానికి ముందు వరకు జరిగిన మ్యాచుల్లో దుమ్ములేపిన ఆటగాళ్లు ఎవరు? టాప్ స్కోరర్లుగా నిలిచిందెవరు? ధనాధన్ ఇన్నింగ్స్ తో అభిమానులచే కేరింతలు కొట్టించిందెవరు? అన్నది చూద్దాం.
ఈ సీజన్‌లో దుమ్ములేపే ఇన్నింగ్స్ తో సత్తా చాటిన వారిలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు శిఖర్ ధావన్. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న ఈ డైనమిక్ ఓపెనర్.. ఈ సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచు లు ఆడాడు. 54.28 సగటుతో 380 పరుగులు సాధించి 2021 సీజన్లోనే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. హయ్యెస్ట్ ఫోర్లు బాదిన బ్యాట్స్ మెన్ కూడా గబ్బరే. ఏకంగా 43 బౌండరీలు సాధించాడు. నేటి నుంచి ఆరంభం కాబోతున్న సెకండ్ ఫేజ్ లో ఎలాంటి ప్రదర్శన ఇస్తాడోచూడాలి.
సెకండ్ ప్లేస్ లో కేఎల్ రాహుల్ ఉన్నాడు. మొత్తం 7 మ్యాచులు ఆడిన రాహుల్.. 66.20 సగటుతో 331 పరుగులు సాధించాడు. అత్యధిక సిక్సర్లు కొట్టింది కూడా రాహులే. 16 సిక్సులు బాదాడు. నాలుగు హాఫ్‌సెంచరీలు చేశాడు. దుబాయ్ లోనూ ఇదే గేమ్ కంటిన్యూ చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఇక, మూడో ప్లేసులో ఉన్నాడు డుప్లెసిస్. 7 మ్యాచులు ఆడిన ఈ చెన్నై ఆటగాడు.. 64.00 సగటుతో 320 పరుగులు సాధించాడు. చెన్నై జట్టులో కీలకమైన ఆటగాడిగా ఉన్నాడు. అయితే.. రెండో సీజన్లో ఎన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉంటాడో తెలియని పరిస్థితి. ఇటీవల జరిగిన కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆడిన డుప్లెసిస్ గాయపడ్డాడు. మరి, ఎప్పుడు జట్టుతో చేరుతాడో చూడాలి.
ఆ తర్వాత మరో టీమిండియా ఆటగాడు పృథ్వీ షా కూడా సత్తా చాటాడు. 8 మ్యాచుల్లో 38.50 సగటుతో 308 పరుగులు సాదించాడు. కోల్ కతాతో జరిగిన ఓ మ్యాచ్ లో ఒకే ఓవర్లో ఆరు ఫోర్లు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మరి సెకండ్ ఫేజ్ లో ఎలా ఆడతాడో చూడాలని ఫ్యాన్ ఆసక్తిగా ఉన్నారు.