Sajjanar: వీసీ సజ్జనార్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ నిఖార్సైన పోలీస్ అధికారి గురించి తెలియని వారు ఉండరు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా.. అక్రమార్కుల వెన్నులో వణుకుపుట్టించే అధికారిగా.. ముఖ్యంగా ఆడపిల్లల మానప్రాణాలను తీసే వారిని ఎన్ కౌంటర్ లో లేపేసే ధీర పోలీస్ ఆఫీసర్ గా పేరుపొందాడు.
సైబరాబాద్ సీపీగా పనిచేసి ఎంతో ఆకట్టుకున్న ఆయన ఇటీవలే ఆర్టీసీ ఎండీగా బదిలీ అయ్యారు. ఏ శాఖలో పనిచేసినా తనదైన ప్రత్యేకతతో అందరి అభిమానాన్ని సంపాదించుకోవడం సజ్జనార్ ప్రత్యేకత.. సైబరాబాద్ కమిషనర్ గా పనిచేసిన కాలంలో సజ్జనార్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.
దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ తో మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు సజ్జనార్ కు బ్రహ్మరథం పట్టాయి. సమర్థుదైన అధికారిగా పేరున్న ఈయన ఇటీవల ఆర్టీసీ ఎండీగా బదిలీ అయ్యారు.
అయితే నష్టాల్లో ఉన్న సంస్థలోనూ ఆయన ఆదాయాన్ని పెంచేలా వినూత్నమైన పద్ధతులు అవలంభిస్తున్నారు. బాధ్యతలు చేపట్టగానే తనదైన పనితీరుతో సజ్జనార్ ఇక్కడ కూడా అందరి దృష్టిలో పడుతున్నారు.
ఆదివారం గణేష్ నిమజ్జనాన్ని సజ్జనార్ ప్రత్యేకంగా నిర్వహించి హైలెట్ అయ్యారు. వినాయక విగ్రహాన్ని ఆర్టీసీ బస్సులో నిమజ్జనానికి తీసుకెళ్లి సజ్జనార్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. సాంప్రదాయ వస్త్రధారణలో వినాయక విగ్రహాన్ని ఒడిలో కూర్చుబెట్టుకున్న సజ్జనార్ కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. సజ్జనార్ సాధారణంగా ఉంటున్న తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.