ధోనీ దంచికొడతాడా?.. రో‘హిట్‌’ అవుతాడా? ఐపీఎల్‌లో బోణీ కొట్టేదెవరు..?

క్రికెట్‌ ప్రపంచం ఎంతో ఆశతో, ఆసక్తితో ఎదురు చూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ మరికొద్ది సేపట్లో మొదలవనుంది. హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్‌, మిస్టర్ కూల్‌ ఎంఎస్‌ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య తొలి మ్యాచ్తో గ్రాండ్ ఓపెనింగ్కు సర్వం సిద్ధమైంది. కరోనాతో ఉక్కిరిబిక్కిరి అయిన సీఎస్కే తక్కువ సమయంలోనే కోలుకుని మళ్లీ బరిలోకి దిగుతుండటం శుభపరిణామం. దీనికితోడు ధోనీ ఆట కోసం కోట్లాది మంది అభిమానులు చాలా ఆతృతగా […]

Written By: Neelambaram, Updated On : September 20, 2020 7:36 am
Follow us on


క్రికెట్‌ ప్రపంచం ఎంతో ఆశతో, ఆసక్తితో ఎదురు చూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ మరికొద్ది సేపట్లో మొదలవనుంది. హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్‌, మిస్టర్ కూల్‌ ఎంఎస్‌ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య తొలి మ్యాచ్తో గ్రాండ్ ఓపెనింగ్కు సర్వం సిద్ధమైంది. కరోనాతో ఉక్కిరిబిక్కిరి అయిన సీఎస్కే తక్కువ సమయంలోనే కోలుకుని మళ్లీ బరిలోకి దిగుతుండటం శుభపరిణామం. దీనికితోడు ధోనీ ఆట కోసం కోట్లాది మంది అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వన్డే వరల్డ్‌ కప్‌ అనంతరం ధోనీ మళ్లీ మైదానంలోకి రాలేదు. పైగా, గత నెలలో అతను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దాంతో, ఐపీఎల్‌లో అతను కనిపించే ప్రతి క్షణాన్ని, ఆడే ప్రతీ షాట్‌ను, నాయకుడిగా వేసే ప్రతి ఎత్తును ఆస్వాదించాలిని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు స్టార్ప్లేయర్లతో కళకళలాడుతున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై కూడా కోట్లల్లో ఫ్యాన్స్‌ ఉన్నారు. దాంతో, ఇరు జట్ల మధ్య తొలి ఆటతోనే ఐపీఎల్‌ 13వ సీజన్‌కు అదిరిపోయే ఆరంభం లభిస్తుందని అంతా భావిస్తున్నారు.

ఫేవరెట్‌ ముంబై
తొలి పోరులో పోటీ పడే ఇరుజట్లను ఓసారి పరిశీలిస్తే మాత్రం ఈ మ్యాచ్లో ముంబై ఫేవరెట్‌ అనిపిస్తోంది. ముంబైకి స్లో స్టార్టర్ అని పేరుంది. ప్రతి సీజన్‌ ఆరంభంలో ఆ జట్టు తడబడుతుంది. కానీ, బలమైన జట్టుతో ముంబై పటిష్టంగా ఉంది. పైగా, ఈ సీజన్‌ కోసం పక్కా ప్రణాళికలతో రెడీ అయిందా జట్టు.దుర్బేధ్యమైన బ్యాటింగ్‌ లైనప్‌ ముంబై సొంతం. హిట్‌మ్యాన్‌ రోహిత్‌తో పాటు డికాక్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్, కృనాల్, పొలార్డ్ ఇలా అందరూ బాదుడులో బాద్‌షాలే. బౌలింగ్‌లో కూడా దానికి తిరుగులేదు. ట్రెంట్ బౌల్ట్, కూల్టర్నీల్‌తో పాటు యార్కర్ల స్పెషలిస్ట్‌ బుమ్రా ముంబై తురుపు ముక్క. అయితే, శ్రీలంక లెజెండరీ బౌలర్ లసిత్‌ మలింగ లేకపోవడం రోహిత్‌సేనకు అతి పెద్దలోటు. పైగా, చెన్నైతో ముఖాముఖీల్లో ముంబైదే పైచేయి కావడం గమనార్హం. ఇరు జట్ల మధ్య ఇప్పటిదాకా 30 మ్యాచ్‌లు జరిగితే ముంబై 18సార్లు గెలిచింది. చెన్నై 12 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది.

లక్ష్మణుడు లేని చెన్నై
మరోవైపు సీఎస్కే కోర్ టీమ్ బాగానే ఉన్నా..సురేశ్ రైనా లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. చెన్నై టీమ్‌లో ధోనీ, రైనాలను రామ లక్ష్మణులు అంటారు. ధోనీకి ఆనంగు శిష్యుడైన రైనా కరోనా భయంతో పాటు కుటుంబంలో జరిగిన విషాదం కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యాడు. అలాగే, సీనియర్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ కూడా కరోనా భయంతో దుబాయ్‌ రాలేదు. పైగా, చెన్నై టీమ్‌లో పేసర్ దీపక్‌ చహర్, బ్యాట్స్‌మన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మరో 11 మంది సపోర్ట్‌ స్టాఫ్‌ కరోనా బారిన పడ్డారు. దాంతో, అన్ని జట్ల కంటే వారం ఆలస్యంగా ప్రాక్టీస్‌ ప్రారంభించింది ధోనీసేన. పేసర్ దీపక్‌ చహర్ కోలుకొని జట్టుతో కలిసినా.. రైనా ప్లేస్లో ఆడించాలనుకుంటున్న రుతురాజ్ గైక్వాడ్ ఇంకా కోవిడ్ నుంచి కోలుకోలేదు. అయితే, ధోనీనే జట్టుకు అతి పెద్ద బలం. బ్యాటింగ్‌లోనే కాకుండా తన వ్యూహాలతోనూ అతను ఆటను మలుపు తిప్పుతాడు. అలాగే, వాట్సన్, రాయుడు, కేదార్, జడేజా, బ్రావోలతో సీఎస్‌కే బ్యాటింగ్‌ బలంగానే ఉంది. పైగా అందరూ అనుభవజ్జులే కావడం ప్లస్‌ పాయింట్‌. బౌలింగ్‌లో దీపక్‌ చహర్, లుంగి ఎంగిడి, మిచెల్‌ శాంట్నర్, శార్దుల్‌ ఠాకూర్ బరిలోకి దిగొచ్చు. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్ సామ్‌ కరణ్‌, ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్‌ అందుబాటులోకి వస్తే బౌలింగ్‌లోనూ తిరుగుండదు. అయితే, రెండు జట్లలోని ఇండియన్‌ క్రికెటర్లంతా ఆరు నెలల తర్వాత బరిలోకి దిగుతున్నారు కాబట్టి వాళ్లు ఎలా ఆడతారన్నదానిపైనే మ్యాచ్‌ ఫలితం ఉంటుంది.

ఐపీఎల్లో చెన్నై రికార్డు
మ్యాచ్లు 165
విజయాలు 100
ఓటములు 63
టై 1
నోరిజల్ట్ 1
టైటిల్స్ 3

ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ రికార్డు
మ్యాచ్లు 187
విజయాలు 107
ఓటములు 78
నో రిజల్ట్ 2
టైటిల్స్ 4

ముంబైx చెన్నై ముఖాముఖీ
మ్యాచ్‌లు 30
ముంబై విజయాలు 18
చెన్నై విజయాలు 12