ఐపీఎల్‌13 తొలి రోజు ఎలా ఉంటుందంటే…

కరోనాతో ప్రపంచం మొత్తం వణికిపోతున్న వేళ… ఆరు నెలలుగా క్రికెట్‌ లేక దిగాలుగా ఉన్న అభిమానుల్లో జోష్‌ నింపే పండగ వచ్చేసింది. కరోనా దెబ్బకు విశ్వక్రీడా సంబురం ఒలింపిక్స్‌ సైతం వచ్చే ఏడాదికి వాయిదా పడినా.. ఈ ఏడాది జరగాల్సిన టీ20 వరల్డ్‌ కప్‌ రద్దయినా.. సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలోని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)… ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌) పదమూడో సీజన్‌ ను పట్టాలెక్కించింది. వేసవి కాలం.. ఏప్రిల్‌, మే నెలల్లో జరగాల్సిన […]

Written By: Neelambaram, Updated On : September 20, 2020 7:37 am
Follow us on


కరోనాతో ప్రపంచం మొత్తం వణికిపోతున్న వేళ… ఆరు నెలలుగా క్రికెట్‌ లేక దిగాలుగా ఉన్న అభిమానుల్లో జోష్‌ నింపే పండగ వచ్చేసింది. కరోనా దెబ్బకు విశ్వక్రీడా సంబురం ఒలింపిక్స్‌ సైతం వచ్చే ఏడాదికి వాయిదా పడినా.. ఈ ఏడాది జరగాల్సిన టీ20 వరల్డ్‌ కప్‌ రద్దయినా.. సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలోని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)… ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌) పదమూడో సీజన్‌ ను పట్టాలెక్కించింది. వేసవి కాలం.. ఏప్రిల్‌, మే నెలల్లో జరగాల్సిన మెగా లీగ్‌ను మొదటిసారి చలికాలంలో నిర్వహిస్తోంది. భారత్‌లో నిర్వహించే అవకాశం లేకపోవడంతో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు ఈ టోర్నీని షిఫ్ట్‌ చేసింది. కరోనాకు సవాల్ విసురుతూ.. దుబాయ్‌, అబుదాబి, షార్జాలోని మూడు క్రికెట్‌ స్టేడియాల్లో బయో సెక్యూర్ వాతావారణం సృష్టించి లీగ్‌ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రోజు నుంచే పరుగుల మోత, వికెట్ల వేట మొదలవనుంది. రాత్రి 7.30 గంటకు జరిగే తొలి మ్యాచ్‌తో పదమూడో సీజన్‌కు తెరలేవనుంది. ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన జట్లయిన ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య మొదటి పోరు జరగనుంది. దాదాపు ఆరు నెలలుగా మైదానం మొహం చూడని భారత క్రికెట్‌ వీరులు.. పలువురు విదేశీ స్టార్ క్రికెటర్లతో కలిసి దుమ్ముదులిపేందుకు రెడీ అయ్యారు. 13 ఏళ్ల చరిత్రలో మొదటిసారి ఖాళీ స్టేడియాల్లో జరుగుతున్న లీగ్‌లో దంచికొట్టబోతున్నారు.

ప్రతి సీజన్‌ ఐపీఎల్‌కు ముందు ఆరంభ వేడుకలు ఉండేవి. గతంలో ఒకరోజు ముందే బాలీవుడ్‌ స్టార్ హీరోలు, హీరోయిన్లతో ఓపెనింగ్‌ సెర్మనీ జరిగేది. రెండేళ్ల నుంచి తొలి మ్యాచ్‌కు ముందు అరగంట పాటు ఈ ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. కానీ, కరోనా ముప్పు నేపథ్యంలో ఈ సారి ఎలాంటి ఆరంభ వేడుకలు జరగడం లేదు. రాత్రి ఏడు గంటలకు ఇరు జట్ల కెప్టెన్లు టాస్‌ ఎగరేయనున్నారు. అది కూడా గతానికి భిన్నంగా ఉండనుంది. టాస్‌ టైమ్‌లో కెప్టెన్లు కరచాలనం గానీ, హత్తుకోవడం గానీ చేసుకోరు. అలాగే, తుది జట్టులో ఆడే క్రికెటర్ల వివరాలు రాసున్న కాగితాలు కూడా వారి చేతిలో కనిపించవు. టాస్‌ పడగానే స్టేడియంలోని ఎలక్ట్రానిక్‌ డిస్‌ప్లేలో టీమ్ వివరాలను బహిర్గతం చేస్తారు. టాస్‌ టైమ్‌లో కెమెరామెన్‌ కూడా దూరంగా నిల్చొని వీడియో చిత్రీకరిస్తాడు. ఇక, ఇరు జట్ల డగౌట్స్‌లో ఉండే కోచింగ్‌, సహాయక సిబ్బంది, అదనపు ఆటగాళ్లు మాస్కులు ధరించి దూరం దూరంగా కూర్చుంటారు. ప్రేక్షకులను అనుమతించరు కాబట్టి స్టేడియం మొత్తం ఖాళీగా ఉంటుంది. ఫోర్, సిక్సర్ కొట్టినప్పుడు, వికెట్లు పడ్డప్పుడు డీజే సౌండ్‌ వినిపించదు. చీర్ గాళ్స్‌ నృత్యాలు కనిపించవు. ఆటగాళ్లు సైతం కరచాలనం, కౌగలింతలు లేకుండా సంబరాలు చేసుకుంటారు. పైగా, సిక్సర్ కొట్టినప్పుడు స్టాండ్స్‌లో పడ్డ బంతిని ఫీల్డర్లే తీసుకురావాల్సి ఉంటుంది. వేరే ఎవ్వరూ బంతిని ముట్టుకోకూడదు. ఎవరైనా ముట్టుకుంటే అంపైర్లు వెంటనే శానిటైజ్‌ చేస్తారు. అలాగే, బౌలర్లు బంతిపై ఉమ్మి రుద్దడం నిషేధం. ఎవరైనా తెలియక చేస్తే అంపైర్లు ఒకటి రెండుసార్లు హెచ్చరిస్తారు. అయినా అదే పని చేస్తే ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తారు.

స్టేడియంలో అనుష్కను చూడొచ్చు

లీగ్‌ ముగిసే వరకూ ఆటగాళ్లు, కోచింగ్‌ స్టాఫ్‌ స్టేడియాలు, హోటల్స్‌, బీసీసీఐ అనుమతించిన ప్రదేశాలకు తప్ప వేరే ఎక్కడికి వెళ్లడానికి వీళ్లేదు. లీగ్‌తో సంబంధం లేని ఎవ్వరినీ కలవకూడదు. ఆటగాళ్లు, స్టాఫ్‌ వెంట వారి కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు బోర్డు అనుమతించింది. కానీ, ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో పాటు కొన్ని జట్లే క్రికెటర్లతో పాటు కుటుంబాలను కూడా యూఏఈ తీసుకెళ్లాయి. వాళ్లు కూడా క్రికెటర్ల మాదిరిగా బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్‌లో ఉండాల్సిందే. ఫ్యామిలీ మెంబర్స్‌ ను స్టేడియంలోకి అనుమతిస్తారు. ప్రేక్షకులు లేని ఖాళీ స్టేడియంలో ఆటగాళ్లను ఉత్సాహపరిచేది వీళ్లు మాత్రమే అనొచ్చు. రోహిత్‌ శర్మ సిక్సర్ కొడితే భార్య రితికా సజ్‌దే, కూతురు సమైరా చప్పట్లతో అతడిని అభినందించడం చూడొచ్చు. అలాగే, తొందర్లోనే తండ్రి కాబోతున్న విరాట్‌ కోహ్లీ సెంచరీ కొట్టి స్టాండ్స్‌లో ఉన్న అనుష్క శర్మకు ఎప్పట్లానే ఫ్లైయింగ్‌ కిస్‌లు ఇవ్వొచ్చు. అయితే, కుటుంబ సభ్యులు కేవలం స్టాండ్స్‌కే పరిమితం అవుతారు. గతంలో మాదిరిగా మ్యాచ్‌ ముగిసిన వెంటనే గ్రౌండ్‌లోకి వచ్చే అవకాశం లేదు. అలాగే, స్టేడియానికి, అక్కడి నుంచి తిరిగి హోటల్‌కు వెళ్లేప్పుడు ఆటగాళ్లు ప్రయాణించిన బస్సుల్లో వారికి అనుమతి ఉండదు. ఇక, స్టేడియంలోకి మీడియాకు కూడా అనుమతి లేదు. మ్యాచ్‌లకు ముందు జరిగే ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ను రద్దు చేశారు. మ్యాచ్‌ల తర్వాత ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ కూడా వర్చువల్‌గా జరగనుంది. అలాగే, మ్యాచ్‌ పూర్తయిన తర్వాత ప్లేయర్ ఆఫ్‌ ద మ్యాచ్‌ సహా పలు అవార్డులను కూడా గెస్టులతో ఇప్పించరు. ఆటగాళ్లే నేరుగా తీసుకుంటారు. ఇలా గతానికి పూర్తి భిన్నంగా ఐపీఎల్‌13 ఉండనుంది. మొదటి రోజు సరికొత్త, వింత అనుభూతి కలగడం ఖాయం.