IND Vs AUS Test : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్.. ఇలా భీకరమైన లైనప్ ఉన్న బ్యాటింగ్ దళం ఆస్ట్రేలియా బౌలర్ల ముందు చేతులెత్తేసింది. గల్లి స్థాయి ఆట ఆడి పరువు తీసుకుంది. అడిలైడ్ మైదానంపై పరువు తీసుకుంది. పింక్ బాల్ తనకు అచ్చి రాదని మరోసారి నిరూపించుకుంది. డే అండ్ నైట్ ఫార్మాట్లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 180 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో కుప్పకూలింది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్టార్క్ ఆరు వికెట్ల పడగొట్టాడు. కమిన్స్ , బోలాండ్ చెరి 2 వికెట్లు సాధించారు. ఆస్ట్రేలియా తొలిఇన్నింగ్స్ లో 337 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 140 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. బుమ్రా, సిరాజ్ చెరి నాలుగు వికెట్లు పడగొట్టారు. నితీష్ రెడ్డి, అశ్విన్ చెరో వికెట్ సాధించారు.
రెండవ ఇన్నింగ్స్ లోనూ..
157 పరుగుల లోటుతో రెండవ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన టీమిండియా ఏ దశలోనూ ఆస్ట్రేలియాకు పోటీ ఇవ్వలేకపోయింది. తొలి ఇన్నింగ్స్ లో 0 పరుగులకు అవుటయిన యశస్వి జైస్వాల్.. ఈసారి మాత్రం 24 పరుగులు చేశాడు. బోలాండ్ బౌలింగ్ లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఓపెనర్ రాహుల్ ఏడు పరుగులు మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. గిల్ 28 పరుగులు చేసి సౌకర్యవంతంగా కనిపించినప్పటికీ.. స్టార్క్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విరాట్ కోహ్లీ (11), రోహిత్ శర్మ (6) పరుగులు మాత్రమే చేసి బోలాండ్, కమిన్స్ బౌలింగ్లో అవుట్ అయ్యారు. దీంతో టీం ఇండియా అప్పటికే 5 వికెట్లు కోల్పోయింది. అప్పటికే రెండవ రోజు ఆట ముగిసింది. ఇక ఆదివారం మూడవరోజు నితీష్ రెడ్డి (42), పంత్ (28) మెరుగ్గా ఆడతారనుకుంటే.. వారు కూడా కీలక సమయంలో అవుట్ అయ్యారు. దీంతో టీమ్ ఇండియా 175 పరుగుల వద్ద రెండవ ఇన్నింగ్స్ ను ముగించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ ఐదు వికెట్లు పడగొట్టాడు. బోలాండ్ 3, స్టాక్ రెండు వికెట్లు సాధించారు. భారత విధించిన 19 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 3.2 ఓవర్ల లోనే చేదించింది. 10 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది.. తొలి ఇన్నింగ్స్ లో 140 పరుగులు చేసిన హెడ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.